సమన్వయంతో పనిచేయాలి
– సీపీ డాక్టర్ వి.రవీందర్
వరంగల్ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ సూచించారు. వరంగల్ పోలీస్ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్ ఆర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్.రవికిరణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను ఆరికట్టడం కోసం తీసుకోవాల్సిన అంశాలపై వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం చేసిన సూచనలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి గుర్తించిన ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ ఎసిపి మజీద్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం 12 ట్రాఫిక్ జంక్షన్లల్లో ఉన్న సిగ్నల్స్‌తోపాటు, మరో అదనంగా 13 జంక్షన్లలో సిగ్నల్స్ ఏర్పాటుకు కావల్సిన నిధులపై జిడబ్ల్యూఎంసి అధికారులు పోలీస్ అధికారులతో కలసి తగు ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. నగరంలో సిగ్నల్స్ మరమత్తులు, ముఖ్యమైన రోడ్డుమార్గాల్లో డివైడర్ల ఏర్పాటు, జంక్షన్లలో ఐలాండ్ మార్పులపై అధికారులకు వివరించారు. అవసరమైన ముఖ్యకూడళ్లల్లో రోడ్డు వెడల్పు, నగరంలో ముఖ్య సూచికబోర్డుల ఏర్పాటుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో విఎంఎస్ సైన్‌బోర్డుల ఏర్పాటు చేయడంపై అధికారులను ఆదేశించారు. ట్రైసిటి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వేగం పరిమితి బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారుల దష్టికి తీసురావడంతోపాటు, అన్ని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్స్‌తోపాటు జీబ్రా లైన్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు, కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో పోలీస్ అధికారులతోపాటు, మనపై కూడా ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ కమిబద్దీకరణ కోసం ట్రాఫిక్ పోలీసుల సూచనలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుందని, ఇందుకోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనరేట్, ట్రాఫిక్ పోలీస్ విభాగానికి నోడల్ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఈ నోడల్ అధికారి ద్వారా ట్రాఫిక్ పోలీసులు సూచించే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు, జిడబ్ల్యూఎంసి, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధికారులు పాల్గోన్నారు.