‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

వద్దు బిడ్డా..లేనిదానికి కానిదానికి వెళ్లద్దు…ఉన్నంతలోనే వుండాలి. అందేకాడికే అందుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి. బయటికి కనిపించేదంతా అద్భుతం కాదు..మెరిసేదంతా బంగారం కాదు..ఇలాంటి మాటలు మన పెద్దోళ్లు చాలా మందికి చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ కొందరు మెరిసేదంతా బంగారమే అన్నట్లు ఊహలలో తేలిపోతుంటారు. అసలు విషయం తెలుసుకునేలోపే జరగాల్సి నష్టం, సమయం అన్ని జరిగిపోతాయి. తీరా తలలు పట్టుకుంటే ఏం లాభం..? ఇది జగమెరిగిన సత్యం.నగరంలో పేద, మద్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్‌కు పంపాలంటే బెంబేలెత్తిపోతున్నారు.అక్కడ ఫీజుల వివరాలు తెలుసుకున్న వారంతా వామ్మో..? ఇంత ఫీజా..? అని గుండెలు బాదుకుంటున్నారు.

అసలు పేర్లు మార్చి మాయచేస్తున్న ‘మోసగాడు’

హన్మకొండలో ఓ ప్రైవేటు స్కూల్‌ దందా అంతా ఇంతా కాదు..దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న పాలసీని వీరు అక్షరాల నిజంచేస్తున్నారు. ఒక స్కూల్‌ యజమాని పాతస్కూళ్లను కొనేసి అసులుపేరును మాయంచేసి, అనుమతిలేకున్నా ఒకే పేరుతో పాతస్కూళ్ల బోర్డులను కమ్మి ఈ స్కూల్‌ కూడా ‘మా’ స్కూలే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసంచేస్తున్నారు. అసలు విషయం తెలియక విద్యార్థులను ‘ఆ’ స్కూలే అనుకొని ఫీజులు భారమైనా అందులో చేర్చుతున్నారు. కొందరేమో తప్పదు కాబట్టి చేర్పిస్తున్నామని, మరికొందరేమో అసలు విషయం తెలుసుకొని పలానా స్కూల్‌ వీరు చెప్పిన స్కూల్‌ కాదుకదా..? అని ఆలోచిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా అసలు ‘షాని’కెళ్లడమే తప్పు లేనిదానికి, కానిదానికి ఎందుకు వెళ్లాలి అంటూ నగరంలో తల్లిదండ్రులు గుసగుసలాడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *