పార్లమెంటులో ఎంపీల నిరసన
మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక,అస్థిర పరిస్థితులపై ప్రధాని మోడీ నోరువిప్పాలి:ఎంపీ రవిచంద్ర
మణిపూర్ హింసాత్మక ఘటనల్ని నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఆందోళన
ఎంపీలు నాగేశ్వరరావు, సంతోష్ కుమార్,లింగయ్య యాదవ్,రంజిత్ రెడ్డిలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రవిచంద్ర
నేటి ధాత్రి న్యూఢిల్లీ
మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నోరువిప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న,జరుగుతున్న నేరాలు,ఘోరాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర,అసహజ పరిస్థితుల పట్ల యావత్ దేశం విస్తుపోతున్నదని ఆవేదన చెందారు.మహిళల్ని నగ్నంగా ఊరేగించడం,యువకులను ఘోరంగా హత్య చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.మణిపూర్ లో చోటుచేసుకున్న, జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోడీ నోరువిప్పి బదులివ్వాలంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి తదితరులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నేలపై కూర్చొని రెండో రోజు మంగళవారం కూడా నిరసన వ్యక్తం చేశారు, అలాగే.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ ఎంపీలు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎంపీలు మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ సిగ్గుతో తలవంచుకోవాలి,సభలో సమాధానం చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.