Headlines

పెద్దల సభకు పంపి ఏం ప్రయోజనం!?

ఎవరూ ఊహించకుండా పదవి ఇస్తే ఏం లాభం?

పార్టీకి పనికొస్తాడని అనుకున్నా పనికిరాని వైనం?

నాయకులను కలుపుకుపోతున్నట్లు కనిపించదాయే?

డాబు దర్పం తప్ప జనంలో కనిపిస్తున్నది లేదాయే?

 ప్రతిష్టకు పోయి పదవిస్తే ఫలితం లేకపాయే?

 పార్టీ కోసం పనిచేస్తున్నట్లైనా కనిపించదాయే?

అసలు పనిచేసే తీరికే నాయకునికి లేకపాయే?

పదవి అలంకారమాయే? 

పుట్టిన పార్టీ కాకపాయే, పెంచిన పార్టీ మీద ప్రేమ కనపడదాయే?

పట్టిపట్టి పదవిస్తే పంగనామాలే కావట్టే?                                 

ఆ ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌ రెడ్డి. రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడికి దక్కని అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి అరుదైన అవకాశం ఎవరికీ రాలేదు. అంతటి గౌరవం కూడా ఎవరికీ దక్కినట్టు లేదు. కాని ఒక్క పాడి కౌషిక్‌రెడ్డికే దక్కింది. పాడి కౌషిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ రావడం అన్నది చిన్న విషయంగా కాదు. కాని దాని వెనక ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిదందన్నది అందరకీ తెలిసిందే. ఆయనకు ఇది అర్ధమైనట్లు లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎవరికోసం దిగనన్ని మెట్లు దిగి మరీ కౌషిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. దాంతో ఆయన తన ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టారు. ఒక దశలో టిఆర్‌ఎస్‌ పార్టీ వివాదం మూటగట్టుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయం ఎంతో విస్మయం కలిగించింది. ఆఖరుకు పాడి కౌషిక్‌ రెడ్డి మూలంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, బిజేపికి మధ్య చెడిరది. ముఖ్యమంత్రి కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు చెడిరది. దూరం పెరిగింది. అప్పటిదాకా వున్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయాన్ని కడుపులోనే దాచుకున్నారు. ఇదంతా ఎవరి కోసం జరిగింది. ఒక్క పాడి కౌషిక్‌రెడ్డి మూలంగానే జరిగింది. ముందు భావించినట్లు హుజూరాబాద్‌ టిక్కెట్టు కౌషిక్‌రెడ్డికే దక్కెది. కాని ఆయన చేసిన హంగామా మూలంగా టిఆర్‌ఎస్‌ విమర్శలపాలైంది. టిక్కెట్టు నాదే..నాకే అంటూ కౌషిక్‌రెడ్డి ఇతర నాయకులతో మాట్లాడిన మాటలు బైటకు రావడం పెద్ద దుమారమే జరిగింది. ఇద ఇదిలా వుంటే అప్పటికే మంత్రి కేటిఆర్‌ కౌషిక్‌కు ఎనలేని ఫ్రాధాన్యతను కూడా ఇస్తూ వచ్చారు. ఏ ఫంక్షన్‌లోనైనా కనిపించినా ఎంతో ఆప్యాయతను చూపించారు. ఒక దశలో కౌషిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్‌పై గవర్నర్‌ సంతకం చేయకపోవడం కూడా టిఆర్‌ఎస్‌ రాజకీయమే అన్నంత దూరం కూడా వెళ్లింది. అలాంటి వివాదాలు కూడా టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్నది. పరోక్షంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా విమర్శలను ఎదుర్కొవాల్సివచ్చింది. విషయం చిన్నదైనా అగాధం పెద్దదైంది. అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సిఎం చేసిన త్యాగం ఎవరూ చేయలేనిది. కౌషిక్‌రెడ్డి వివాదం పలు పలు విధాల చర్చలోకి రాకుండా చూసుకోవడానికి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నడిపిన మంత్రాంగం, చాణక్యం కూడా వృధా అవుతోందా? అన్నంత దాకా వస్తోంది. 

నమ్మకమన్న పదానికి పర్యాయ పదం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నది ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పొచ్చు. పార్టీకి ఏమీ కాని ఒక వ్యక్తి కోసం కూడా ఎంత దూరమైనా వెళ్లగలిగే వ్యక్తిత్వం కేసిఆర్‌ది అని కౌషిక్‌రెడ్డి విషయంలో రుజువైంది. ఎన్ని వివాదాలు ఎదురైనా భరించారు. ఎంత మంది వ్యతిరేకించినా పట్టించుకోలేదు. కాకపోతే ఎక్కడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరి అంచనాలు పటాంపచలు చేశారు. ఆయన ఆలోచనల్లో వెనుకడుగు వేయలేదు. ముందడుగే వేశారు. కౌషిక్‌రెడ్డి మీద అత్యంత నమ్మకం, విశ్వాసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పెట్టుకున్నారు. మరి అలాంటప్పుడు కౌషిక్‌రెడ్డి పని తనం ఎలా వుండాలి. రుణం తీర్చుకునే విధానం ఎలా వుండాలి? కాని అలా వుందా? ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పార్టీకోసం ఏమైనా పనిచేస్తున్నాడా? అన్న చర్చే సర్వత్రా జరుగుతోంది. ఆఖరుకు హుజూరాబాద్‌ ఎన్నికల్లో అంత అంకితభావంతో కౌషిక్‌రెడ్డి పనిచేశాడా? అన్నదానిపై ఇప్పటికీ ఎక్కడో అక్కడ గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. కనీసం ఇప్పటికైనా పార్టీకోసం పనిచేస్తున్నాడా? కార్యకర్తలకు అండగా వుంటున్నాడా? నియోజకవర్గాన్ని కంచుకోటగా మళ్లీ మార్చే ప్రయత్నం చేస్తున్నాడా? అంటే పార్టీ శ్రేణులు చెప్పే మాటలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే…? రాజకీయాల్లో నమ్మకాలు ఎప్పుడూ పనిచేయవని తెలుసుకోవాల్సిందే? అన్నదే వినిపిస్తోంది. 

                           నేను ఎమ్మెల్యే కావాలి. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి నేనే పోటీ చేయాలి. పార్టీ టిక్కెట్టు ఇచ్చేనా…సరే సరి…లేకుంటే ఏ పార్టీ అయినా సరి….నేను బరిలో వుండడం తప్పనిసరి…ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు మరి…ఎవరి కోసమే ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు మరి…ఇది ఆయన ఆంతరంగికులతో అనే మాటలు అంటూ టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనల సారాంశం. ఇంతకీ హుజూరాబాద్‌ టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుంది. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి ఎవరు? గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్‌ను కాదని కౌషిక్‌ రెడ్డి చేస్తున్న హంగామా? ఏమిటి? అన్న విషయాల్లోకి వెళ్తే…అసలైన టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎన్ని సార్లు ఫోన్‌లు చేసినా, స్పందించరు? అన్నది వినిపిస్తున్న మాట. తన ఇష్టాను సారం కమిటిలు వేసుకోవడం. ఆయన అనుచర గణానికి ప్రాధాన్యతనివ్వడం. నియోజకవర్గ ఇన్‌చార్చి గెల్లు శ్రీనుతో చర్చలన్నవి లేవన్నది జగమెరిగిన సత్యమే. మిగతా నాయకులతో పొసిగిందిలేదు. వారితో సఖ్యత కనబర్చింది లేదు. ఇప్పటికీ గోడమీద పిల్లి వాటమే కనిపిస్తోంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తే తప్ప ఆలోచించేది లేదన్నట్టుగానే ఆయన వ్యవహారం వుందంటున్నారు. 

                          కౌషిక్‌రెడ్డి నియోజకవర్గానికి రాడు….ఎవ్వరు ఫోన్లు చేసినా ఎత్తడు? ఇక్కడో ఇంకో ట్విస్టు. 2001 నుంచి టిఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఎవరు ఫోన్‌ చేసినా అసలే ఎత్తడు? ఆయనతోపాటు కాంగ్రెస్‌నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకులు, కొత్తగా ఇతర పార్టీలనుంచి ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి తప్ప ఇతరులకు స్పందించడు? పైగా ఇటీవల ఇల్లంత కుంట సీతారామ స్వామి ఆలయ కమిటిలో మొత్తం ఆయన అనుచరగణమైన కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన వారికే పదవులు అందించాడు? కనీసం ఒక్కరికి కూడా అసలైన కార్యకర్తలకు ఒక్క నాయకుడికి కూడా పదవి ఇవ్వలేదు. ఇప్పటికీ ఆయన జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కనుమల్ల విజయ గణపతితోగాని, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌తోగాని, మరే నాయకుడితో గాని ఒక్క సమావేశం కూడా జరిగింది లేదు? వారితో కలిసి పార్టీ బలోపేతం కోసం ఇంత వరకు కార్యాచరణ చేపట్టింది లేదు? గెల్లిశ్రీనుతో కలిసి, పార్టీ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏనాడూ చర్చ చేసింది లేదు… ఇక ఆయనతో పార్టీలోకి వచ్చిన వారితోనే ఇల్లంతకుంట కమిటి ప్రకటన జరగడంతో పార్టీలో వివాదం ముసురుకున్నది. దాంతో కౌషిక్‌రెడ్డి వెనక్కి తగ్గాల్సివచ్చింది. కౌషిక్‌రెడ్డి పూర్తిగా టిఆర్‌ఎస్‌ అసలైన నాయకులను పార్టీకి దూరం చేసే పనిలో వున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన మున్సిపల్‌ నాయకుడి కుమారుడి వివాహం విషయంలో రాజకీయం వెగులోకి వచ్చింది. ఇటు కౌషిక్‌రెడ్డి ఓ దారిలో నడుస్తుంటే, మరో వైపు కొందరు టిఆర్‌ఎస్‌ కోవర్టులు మరో దారిలో నడుస్తూ, మొత్తానికి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కోవర్టులు పదవులు పొందుతూ, ఇతర పార్టీలకు చెందిన వారితో అంటకాగుతూ పార్టీకి తీరని అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. 

                       ఇటీవల నాలుగు మండలాల టిఆర్‌ఎస్‌ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని, ఆ వివరాలును పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక సమ్మక్క`సారలమ్మ జాతర కమిటిలు కూడా కౌషిక్‌ రెడ్డి తనకు ఇష్టం వచ్చిన వారితో వేయడం కూడా పెద్ద వివాదమైంది. అది పార్టీ అధిష్టానం దాకా కూడా వెళ్లింది. కోర్టును కూడా ఆశ్రయించేదాకా తీసుకెళ్లడం జరిగింది. ఒక్క కమలాపూర్‌ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో సమ్మక్క జాతర జరుగుతుంది. ఆ కమిటిలలో అసలైన తెలంగాణ వాది, టిఆర్‌ఎస్‌ నాయకులు లేరన్నది కొందరి వాదన. మొత్తంగా కౌషిక్‌రెడ్డితో వచ్చిన వారు మాత్రమే అన్నది టిఆర్‌ఎస్‌ ఓ వర్గం ప్రధాన వాదన. వీణవంక మండలంలో మరో వివాదం రేపారు. పాడి సుధాకర్‌రెడ్డి కుటుంబంతో కొత్త వివాదం తెచ్చిపెట్టారన్నది పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు రావడం ఇలాంటి వివిదాలను రేపడం తప్ప చేస్తున్నదేమీ లేదంటున్నారు. ఇక పార్టీపై దృష్టిపెట్టకపోతే ఎలా? అని కొంత మంది ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పుడే నియోజకవర్గంలో పూర్తిస్ధాయి రాజకీయాలు వద్దు. క్యాబినేట్‌ ర్యాంక్‌ పదవి ఇచ్చిన తర్వాత నియోజక వర్గంలో పర్యటనలు చేయాలని సూచించారని అంటున్నారట. అసలు ఎమ్మెల్సీ పదవి అన్నదానికన్నా పెద్ద పదవి ఏముంటుందో? మరొకటి ఎలా ముఖ్యమంత్రి ఎలా ఇస్తానన్నారన్నదానిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఓ వైపు ఇప్పటికే ప్రతిపక్షాలు తమదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తుంటే, ఇప్పటికీ గ్రామ, మండల, జిల్లా కమిటిలు లేక సమాధానాలు చెప్పేవారు లేక, ప్రతిపక్షాలు చెప్పినవే జనం నిజమనుకునేదాకా తెస్తున్నారు. ఇప్పటికైనా ఎంతో నమ్మకంతో కట్టబెట్టిన ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేస్తూ, మిగతా నాయకులను కలుపుకుపోతూ, పార్టీ యంత్రాంగానికి నమ్మకం కల్గిస్తూ, వారికి భరోసా కల్పిస్తూ, పార్టీ కమిటీలను అందరూ కలిసి, వివాదాలు లేని నాయకులను ఎంపిక చేసి, పార్టీకి పూర్వవైభం తేవాల్సిన అవసరం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *