‘పీకే’సిన లెక్కలు?

` నమ్మి బాగుపడ్డోల్లు లేనేలేరు
` ఒక్కసారి పిలిచిన వాళ్లు మళ్ళీ పిలిచిన దాఖలాలు లేవు
` బిజేపి గెంటేసింది
` కాంగ్రెస్‌ గడప తొక్కొద్దంది?
` జేడీయూ దూరం కొట్టి..వేసిన కండువా తీసేసుకుంది
` తెలంగాణకేం అక్కరొచ్చిందని మండిపడుతున్న కార్యకర్తలు , నేతలు
` కేసిఆర్‌ పేరు చెడగొట్టేందుకే వచ్చాడంటూ మధనపడుతున్న పార్టీ శ్రేణులు


హైదరాబాద్‌ , నేటిధాత్రి :
పని మంతుడొచ్చి పందిరేస్తే, కుక్కతోక తాకి కూలిందట. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఎత్తుగడలు అలా వుంటాయన్నది తెలిసినవారు చెప్పే మాట. ఒక్కసారి ప్రశాంత్‌ కిషోర్‌ ఎక్కడ పనిచేసినా మరోసారి అవసరం వుండదు. అంటే ఆయనతో ఎవరికీ పొసగదు. కాకపోతే తెచ్చిపెట్టుకున్నాక భరించలేక, మధ్యలో వదులుకోలేక, పరువు పోగొట్టుకోలేక పాట్లు పడుతుంటారు. ఆఖరుదాకా వెంట తిప్పుకుంటారు. కోట్లకు కోట్లు అప్పటికే ఇచ్చి వుండడంతో పడి వుంటాడులే, పనికొస్తాడులే అనుకుంటుంటారు? అంతే తప్ప పికే లేకపోతే ఇక మాకు దిక్కులేదన్నంతగా ఇప్పటికీ ఏ పార్టీ లేదు. మళ్లీ ఆయన్ను దగ్గరకు రానిచ్చిన వారు లేరు. అందుకు ప్రత్యక్ష ప్రధమ సాక్ష్యం బిజేపియే. యూపిఏ రెండు తర్వాత ఎలాగైనా బిజేపి కేంద్రంలో అధికారంలోకి రావాలి. తప్పని పరిస్ధితి. మూడు సార్లు అధికారానికి దూరమైతే ప్రజలకు దూరం కాకతప్పదు. ఒక తరం తీరం దాటి పోతుంది. చెప్పుకోవడానికి ఏమీ వుండదు. అందువల్ల ఎవరో ఒకరు కావాలి. ఎవరో ఒకరు మేలు చేయాలి. ఎవరో ఒకరు వచ్చి తోడు నిలవాలి. ఇదే సమయంలో బిజేపికి పికే చీకట్లో దీపంలా కనిపించాడు. ప్రచార ఆర్భాటం బాగా తెలిసినవాడుగా తోచాడు. అప్పటికి బాగా చెప్పుకోదగ్గ నాయకుడు కూడా బిజేపిలో లేరు. దేశమంతా ప్రభావితం చేసే నాయకులు బిజేపిలో కనిపించడం లేదు. కాకపోతే అప్పటికే మూడుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీ అభివృద్ధిలో ఐకాన్‌ అన్న ముద్ర వుంది. ఆయనను బిజేపికి చిరుదివ్వెను చేసుకుంటే తప్ప మంచి రోజులు కనిపించడం లేదు. దాంతో నమో అంటూ మొదలు పెట్టారు. దేశం, ధర్మం అంటూ ప్రచారం సాగించారు. ఇదే సమయంలో నాడు నిత్యావసర వస్తువుల పెరుగుదల. పెట్రో వాతలు. ఉల్లి, పప్పుల ధరల మోతలు. వాటికి తోడు డిల్లీలో నిర్భయ ఘటన ఒక్కసారిగా బిజేపిని తెరమీదకు వచ్చింది. మరో వైపు లోక్‌పాల్‌ బిల్లు కోసం సాగుతున్న పోరాటం. ఇలా అన్నీ బిజేపికి కలసివచ్చాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో కేవలం జవహార్‌లాల్‌ నెహ్రూ కాలంలో తప్ప రెండు సార్లు వరుసగా గెలిచింది లేదు. ఇందిరాగాంధీ కూడా వరుసగా మూడుసార్లు గెలిచింది లేదు. అలాంటిది యూపిఏ కు మూడోసారి అవకాశం వచ్యే పరిస్ధితి లేదు. బిజేపికి ఆశలు పెరిగాయి. అప్పుడున్న బలం చాలదు. దాంతో బిజేపి పికే అనే పేరును కూడా రాజకీయంగా విపరీతంగా వాడుకున్నది. సొంత ప్రచారానికి కూడా తోడు చేసుకున్నది. పీకే అనే పేరు దేశమంతా తెలిసిపోయింది. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చాక పికే పెత్తనం పార్టీలో పెరగడం మొదలైంది. ప్రభుత్వంలోనూ జోక్యం దాకా వచ్చింది. ఇది బిజేపి పెద్దలకు నచ్చలేదు. అటు ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు. దాంతో ప్రధాని నరేంద్ర మోడీ పికేను పక్కను పెట్టక తప్పలేదు. ఆ దరిదాపుల్లోకి రాకుండా చూడక తప్పలేదు. పికే ప్రత్నామ్నాయ పార్టీలను వెతుక్కొవాల్సివచ్చింది. బిహార్‌ లాంటి ఎన్నికలు ఆయనకు మరోసారి కలిసివచ్చాయి. కాకపోతే రెండు ప్రతిపక్షాల ఏకంతో బిజేపిని కొట్టాలనకున్నాడు. ప్రజలకు కూడా ఆ కూటమి నచ్చింది. అంతకు ముందు జల్‌, బిజిలీ అనే నినాదంతో గెలిచిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కొంత పూర్తి చేశాడు. చీకట్లను పారద్రోలాడన్న నమ్మకం కలిగించాడు. మరోసారి ప్రజలు కూడా అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నారు. పికే వెంటనే అక్కడ వాలిపోయాడు. ఇక తాను ఎన్నికల వూహకర్త నుంచి రాజకీయ నాయకుడి అవతారం దాల్చాలనుకున్నాడు. జేడియూలో చేరారు. కొంత కాలానికే ఆయన అక్కడ కూడా ఇమడలేకుండా బైటకు వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే పికేను నితీష్‌కుమార్‌ బైటకు పంపేశాడు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన వైఎస్‌ జగన్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడ ప్రజల మద్దతు జగన్‌కే వుందని కనిపెట్టి, అంతా నేనే చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. జగన్‌ గెలుపుతో పికేకు మరింత పేరు రావడం కూడా గమనార్హం. ఇక ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ ఇలా కొన్ని రాష్ట్రాలలోనూ తన వ్యూహాలంటూ చెప్పుకున్నాడు. నమ్మించాడు. తమిళనాడులో జయలలిత మరణం, ఏఐడిఎంకేలో అనైక్యత అంతా స్టాలిన్‌కు అప్పుడే కలిసివచ్చాయి. కాకపోతే ఎందుకైనా మంచిదన్నట్లు పికేను స్టాలిన్‌ పక్కన పెట్టుకున్నాడు. ఇక మహారాష్ట్రలోనూ అదే జరిగింది. శివసేన ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం వంటి వాటితో బిజేపి ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బంది పడిరది. పైగా ఎప్పటినుంచో వున్న శివసనే,బిజేపి మైత్రికి బీటలు వారడం కూడా మహారాష్ట్ర ప్రజలు అంగీకరించలేదు. దాంతో బిజేపిని కాదని శివసేన వైపు కొంత, ఎన్సీపి వైపు కొంత ప్రజలు నిలిచారు. సంకీర్ణానానికి కొత్త తలుపు తెరిచారు. బిజేపి ఓటమి అంటూ కంకణం కట్టుకొని తిరగడం కూడా పికేకు కలిసి వచ్చింది.
ప్రాంతీయ పార్టీలకు అండగా అనిపిచింది. ఇంతకు మించి పీకేతో వాళ్లకు ఒరిగింది ఏమీలేదు. సహజంగా రాజకీయాలన్నాక ఎవరినో ఒకరిని నమ్మడం అన్నది తప్పదు. అందుకు ఎక్కడో పికే అన్నవాడు సాయం చేస్తాడు. వెళ్లిపోతాడు. తలనొప్పి వుండదు. ఇదే పార్టీలు కూడా అనుకునే అంశాలు. పార్టీగెలిచాక పికే కాంట్రాక్టు పూర్తిచేసుకొని చేతులు దులుపుకోవడాలు. ఇక ఆ మధ్య కాంగ్రెస్‌తో జత కట్టేందుకు, రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు కాంగ్రెస్‌తో కూడా చర్చలు జరిపాడు. కాని ఆయన వ్యూహాలేమీ కొత్తవి కాదు. కొత్తగా ఏమీ లేవు. పైగా పార్టీమీద పికే పెత్తనం ఎవరూ అంగీకరించరు. అందుకే పికేను కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. దరి చేరనివ్వలేదు. దగ్గరకు రాకుండానే దూరం జరిపింది. కాంగ్రెస్‌ గుమ్మం తొక్కకుండానే తరిమేసింది. దాంతో ఎలాగైనా ప్రాంతీయ పార్టీలను పట్టుకొని, గడ్డిపోచలను ఏకం చేసిన తాడు పేనాలనుకున్నాడు. ఎవరెవరికి కేంద్రం మీద గురి వుందన్నది తెలుసుకున్నాడు. అందరినీ సంప్రదింపులకు సిద్ధం చేయాలనుకున్నాడు. అందుకు తెలంగాణను ఎంచుకున్నాడు.
తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది ఆయనకు తెలిసిన వాళ్లైన ఆ రాష్ట్ర ఉన్నతోద్యోగులు కూడా సందిచ్చారని ఓ ప్రచారం? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను నమ్మించే ప్రయత్నంలో పికే వున్నాడన్నది వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇదే టిఆర్‌ఎస్‌ కొంప ముంచేదాక తెచ్చుకునేలా చేస్తుందనేది చాలా మంది వాదన. అదేంటో గాని టిఆర్‌ఎస్‌కు పనిచేసేందుకు వచ్చిన పికే టిఆర్‌ఎస్‌నేతలకే కాదు, విపక్ష నేతలకు కూడా నచ్చడం లేదు. కారణం కేసిఆర్‌ అంటే ప్రతిపక్షాలకు కూడా గురి. కేసిఆర్‌ ఈసారి ఎలాంటి అస్త్ర శస్త్రాలతో వస్తాడన్న ఆసక్తి. అవి పికే లాంటి వాడి సలహాలు అంటూ జరిగే ప్రచారం కూడా ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. తెలంగాణ సాధనకర్త, అభినవ తెలంగాణ నిర్మాణ కర్త, బంగారు తెలంగాణ ఆవిష్కర్తకు ఎవరో చెప్పే సూచనలు అవసరమా? అన్నది అందరి మదిని తొలుస్తున్నది. నిన్నటిదాకా అసలు కేసిఆర్‌ ఎవరి మాట వినడు. అన్నవారు. కేసిఆర్‌కు చెప్పేంద ధైర్యమా? అన్నవాళ్లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. దానికి తోడు కేసిఆర్‌ కు కూడా రాజకీయ చతురతకు ఒకరు కావాల్సివస్తున్నారా? అన్నంతంగా మాట్లాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కేసిఆర్‌ అంటే ఎంతో పిచ్చి ప్రేమతో ఆరాధించే వాళ్లు కూడా ఈసడిరచుకుంటున్నారు. ఇది నిజం. పికే అనేవాడు ఎందుకు? కేసిఆర్‌కు తెలియని తెలంగాణనా? తెలంగాణ తెలియని కేసిఆరా? మధ్యలో ఈ పీకే ఎందుకు? ఆయన పికేదేముందన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. పికేకేం తెలుసు తెలంగాణ. పికేకేం తెలుసు కన్నీళ్లు. కష్టాలు. ఒక్క కేసిఆర్‌కే తెలుసు. తెలంగాణ రాక ముందు ఒక తెలంగాణ. వచ్చాక ఇప్పటి వరకు తెలంగాణ అంటే ఒక లెక్క. అది ఎప్పుడూ కేసిఆర్‌ లెక్కనే తలపించాలి. కేసిఆర్‌ వేసిన లెక్కల్లోనే సాగాలి. అదే తప్పితే భవిష్యత్తులో తెలంగాణకు ఇబ్బందే. ప్రజల గుండె చప్పుడు నిన్నటిదాకా తెలంగాణ. ఇప్పుడు కేసిఆర్‌. ఇదీ నేటి తెలంగాణప్రజల మనోగతం.
ఇది తెలిసి కూడా కేసిఆర్‌ ఏం చేయాలో, ఏం చెప్పాలో కూడా పికే చెబితే ఇక అది కేసిఆర్‌ చెప్పినట్లు ఎలా అవుతుంది. ఇది టిఆర్‌ఎస్‌కు తీరని నష్టం చేస్తుంది. ఎందుకుంటే తెలంగాణ అంటే ఆకలి తెలిసిన తెలంగాణ. ఆకలి కోసం అన్నమో రామచంద్రా అని తల్లడిల్లిన తెలంగాణ. ఆవేదనలనుంచి పుట్టింది తెలంగాణ. ఆక్రందనలనుంచి ఉరిమిన తెలంగాణ. తెగువ తెలంగాణ.తెగింపు తెలంగాణ. త్యాగం తెలంగాణ. త్యాగాల గుట్ట తెలంగాణ. నిన్న చీకట్ల తెలంగాణ. నేడు వెలుగుల తెలంగాణ.వేకువ తెలంగాణ. వెలుగు నీడల తెలంగాణ. బతుకు తెలంగాణ. బతుకు తెరువు లేక ఏడ్చిన తెలంగాణ. పచ్చటి అడువుల మధ్య ఎండిన తెలంగాణ. కాకతీయ చెరువులతో సాగు విప్లవం తెలంగాణ. నిలువెల్లా కరువు తెలంగాణ. ఇదంతా చీకటి వెలుగుల సమ్మిళితం నాడు తెలంగాణ. నేడు నడయాడుతున్న నిండైన వెలుగుల రేడు తెలంగాణ. రాజకీయ తెలంగాణ. రాజకీయ చాణక్యం తెలంగాణ. దేశంలో మైనార్టీ ప్రభుత్వాన్ని సైతం ఐదేళ్ల పాలించిన ఠీవి. మన పివీ తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణను చేసిన దాశరధి తెలంగాణ. ఉప్పెన లాంటి పదాల కవి కాళోజీ తెలంగాణ. జీవితాంతం తెలంగాణ అంటూ బతికిన గురువు జయశంకర్‌ తెలంగాణ. తెలంగాణే ఊపిరైన కేసిఆర్‌ తెలంగాణ. కొట్లాడి కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ. నాలుగు కోట్ల గొంతుక కేసిఆర్‌. తెలంగాణ జాతి విముక్తి ప్రధాత కేసిఆర్‌. బంగారు తెలంగాణ ఆవిష్కర్త కేసిఆర్‌. కోటి ఎకరాల మాగాణ కేసిఆర్‌. మరి అలాంటి కేసిఆర్‌ ఏం చెప్పినా వినే తెలంగాణ. పికే చెప్పినట్లు కేసిఆర్‌ వింటుండన్న మాట కూడా వినలేని తెలంగాణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *