పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి

*జనగామ జిల్లా..పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి*

*మరుగుదొడ్ల బాగోతంలో*
*కార్యదర్శిని సస్పెండ్ చేశారు*
*సర్పంచ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు*

*-సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం*

*-సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి రమేష్ రాజా*
——————————-

పాలకుర్తి:నేటిధాత్రి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి,అక్రమాలలో కలెక్టర్ కు పిర్యాదు లు అందిన నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నత అధికారులు 4 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని తేల్చి కేవలం కార్యదర్శి మనోహర్ స్వామిపై మాత్రమే చర్యలు తీసుకున్నారని, సర్పంచ్ వి.యాకాంత రావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ప్రశ్నించారు.
మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) అకౌంట్ కు సంబంధించి కార్యదర్శి, సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ కలిగి ఉన్నారని, అయితే నిధుల దుర్వినియోగంపై కేవలం కార్యదర్శిని మాత్రమే సస్పెన్షన్ చేశారని అన్నారు. జాయింట్ చెక్ పవర్ కలిగి ఉన్నందున ఇద్దరిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని, అలా కాకుండా సర్పంచ్ ను మినహాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం కావడం, మంత్రి గారి ముఖ్య అనుచరుడు కావడం వలనే సర్పంచ్ పై చర్యలు తీసుకోలేదని, అందుకు వారి సామాజిక వర్గం తోడైందని ప్రజల్లో కలుగుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇద్దరిపై చర్యలు తీసుకోకుండా ఒక బీసీ ఉద్యోగిపైన వివక్ష పూరితంగా చర్యలు చేపట్టారని అన్నారు. అవినీతికి ఎవరు పాల్పడిన ఒకే రకమైన న్యాయం ఉండాలని, కార్యదర్శి పాలకుర్తిలో ఉన్నప్పుడు సస్పెన్షన్ చేయకుండా వేరే మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందించి,ఆ మరుక్షణ మే సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంపై అంతర్యం ఏంటో తెలపాలని కోరారు. మరుగుదొడ్లలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని వదలకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు, రూరల్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు రమేష్ రాజా తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి జీడి సోమయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *