పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాద్యత

పరిసరాల నిర్వహణకు సమయం కేటాయించాలి
గ్రామాల స్వచ్చతకే పల్లె ప్రగతి కార్యక్రమం
కేటిఆర్ పిలుపుకు మంచి స్పందన
మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్,నేటిధాత్రి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యతగా అలవరుచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ప్రతి ఆదివారం పరిసరాల పరిశుభ్రతలో పది నిమిషాలు మీకోసం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో పరిసరాలను మంత్రి పరిశుభ్రం చేశారు.
తన నివాసంలోని గార్డెన్ లో నీటి నిల్వలు లేకుండా చేసి, మొక్కల వద్ద మట్టిని తవ్వి మొక్కలు సజావుగా పెరిగేటట్లు గార్డెనింగ్ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ
రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
అనేక వ్యాధులకు చికిత్స కంటే నివారణ అత్యుత్తమమైందని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుకోవడమే కాకుండా, ఆర్ధికపరంగా కూడా జరిగే నష్టాన్ని నివారించవచ్చని, మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపును అందరూ పాటించి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలన్నారు.


ముఖ్యంగా దోమలు పెరిగే అవకాశం ఉన్న నీటి నిల్వలు లేకుండా డ్రైడే పాటించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు చూపుతో మనం విజయవంతం చేసుకున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల తెలంగాణలో కరోనా కట్టడికి చాలా ఉపయోగపడిందన్నారు.అనేక సీజనల్ వ్యాధులు పరిశుభ్రత లేకపోవడం వల్ల ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల వారే కాకుండా వారి చుట్టుపక్కల వారికి కూడా మేలు చేసినవారవుతారని తెలిపారు.కరోనా వైరస్ రాకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, సానిటైజర్ తో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *