ఠాకూర్‌ పోయి ధాక్రే వచ్చే!

`ధాక్రే ఎటువైపు?

` సీనియర్ల వైపా…రేవంత్‌ వైపా!

`ఠాకూర్‌ ను పంపించడంలో సీనియర్లు సఫలమా!

` వచ్చేది రేవంత్‌ కు గడ్డుకాలమా!

`సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా?

`సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్‌ తో పొత్తు సాధ్యమామేనా?

` రేవంత్‌ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా!

`సీనియర్ల అడుగులు పిడుగులేనా?

`ఇక రేవంత్‌ కు చుక్కలేనా?

` బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ పొత్తు అంటే రేవంత్‌ కు పొగేనా!

` సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా!

` రేవంత్‌ ను కూరలో కరివేపాకును చేసినట్లేనా?

` సంకేతాలు చూస్తే రేవంత్‌ మాటలకు కళ్లెమేనా?

`అయినా మారకపోతే సీట్లో నుంచి దింపుడేనా! ఇంటికి పంపుడేనా!!

`థాక్రే రాకతో గెలిచిన ఆనందం సీనియర్లది!

` అయినా రేవంత్‌ కు సహకరిస్తారన్న నమ్మకమేది!

` ఇప్పటికైనా కాంగ్రెస్‌ లో కుంపట్లాగేనా?

`కుమ్ములాటలు సమసిపోయేనా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 అవసరమైతే తప్పుకుంటా! ఈ మాటలన్నది ఎవరో కాదు! సాక్షాత్తు పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. అసలు పిసిసి ఛీఫ్‌ కావడానికి పడిన ప్రయాస కన్నా…సీనియర్లతో ఎదుర్కొంటున్న ఆయాసం పెద్దదైపోయిందా? అన్న అనుమానం రాకమానదు. కాంగ్రెస్‌ లో ఏది జరిగినా వింతే. నిజానికి ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి కి కాంగ్రెస్‌ రాజకీయం ఒంటబట్టలేదనేది అర్థమౌతుంది. కాంగ్రెస్‌ పార్టీలో నోరు జారడం ఎంత సహజమో! టార్గెట్‌ లో వున్న నోరు జారడం అంతే అనర్థం. ఇది రేవంత్‌ రెడ్డి కి తెలియనట్లుంది. పార్టీ అధికారంలోకి రావడం కోసం తాను పదవీ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించడమే వెర్రితనం. ఎంత కష్టమైనా పడదాం…కష్టపడి పార్టీని బలోపేతం చేద్దాం…. అధికారంలోకి తీసుకొద్దాం… ఇదీ రేవంత్‌ చేయాల్సిన వ్యాఖ్యలు. పదవి నుంచి తప్పుకుంటా? అనడమంటే సీనియర్లకు పండగే. ఇంత కాలం నుంచి సీనియర్లు అధిష్టానాన్ని అడుగుతున్నది అదే…అలాంటిది నేను అస్ర్ర సన్యాసం చేయడానికి సిద్ధంగా వున్నానని చెప్పడం అంటే తాను ఓడిపోయానని ఒప్పుకోవడం! లేదా నావల్ల కాదని చేతులెత్తేడం!! నేను సీనియర్ల గోల తట్టుకోలేనని పారిపోవడం!!! మళ్ళీ తెలుగు దేశం పార్టీకి ఊపిరి పోసే పనిలో నిమగ్నమౌతానని చెప్పడం!!!! వీటిలో ఏదైనా కావొచ్చు. ఒక్కసారి రేవంత్‌ రెడ్డి పిసిసి కుర్చీ దిగితే ఆయనను పార్టీలో పట్టించుకునే వారు వుంటారు. పదవి నుంచి తొలగిపోగానే పార్టీ నుంచి కూడా రేవంత్‌ రెడ్డి ని సీనియర్లు తరిమేయకుండా వుంటారా? పిసిసి అధ్యక్షుడు గా వుండి అనుచరులకు పదవులు ఇస్తేనే పచ్చ రంగు పులిమారు. అలాంటిది కుర్చీ దిగిన మరుక్షణం సీనియర్లు రేవంత్‌ కు పచ్చ చొక్కా వేయకుండా వుంటారా? ఏది ఏమైనా రేవంత్‌ రెడ్డి కి కాంగ్రెస్‌ లో కష్టకాలమే….పిసిసి పదవికి గడ్డుకాలమే! ఒకవేళ కొత్త ఇన్చార్జ్‌ రాజకీయం సమన్వయంగా వుంటుందా! ఎటో వైపు మొగ్గుతుందా? అన్నదానిపై ఆధారపడి వుంటుంది. 

ధాక్రే ఎటువైపు?.

 పిసిసి అధ్యక్షుడు గా రేవంత్‌ రెడ్డి అయినప్పటి నుండి మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌ మాణికం ఠాకూర్‌ వివాదాలు ఎదుర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి ఎంపిక కాగానే అప్పటి దాకా పిసిసి మీద ఆశలు పెట్టుకున్న నిత్య అసమ్మతి వాది కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మాణికం ఠాకూర్‌ కు రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యాడు అని ప్రకటించాడు. ఇక రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడుగా వున్నంత కాలం తాను గాంధీ భవన్లో అడుగుపెట్టనన్నాడు. రేవంత్‌ రెడ్డి పిసిసి కావడాన్ని కాంగ్రెస్‌ లో వున్న సీనియర్లు ఎవరూ ఆహ్వానించలేదు. తొలుత చూద్దాం…ముందు ముందు ఏం జరుగుతుందో అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు రేవంత్‌ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమౌతున్నారు. జగ్గారెడ్డి నుంచి మొదలుపెడితే దామోదర రాజనర్సింహ దాకా ఎప్పుడెప్పుడు రేవంత్‌ రెడ్డి ని మార్చే ప్రయత్నం చేద్దామా అని ఎదురు చూస్తూనే వున్నారు. ఇంత కాలానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌ మాణికం ఠాకూర్‌ ను మార్చడం సీనియర్లుకు కొండంత బలమొచ్చినట్లైందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి రేవంత్‌ రెడ్డి గతంలో మాణికం ఠాకూర్‌ ను బుట్టలో వేసుకున్నట్లే ఠాక్రేను కూడా కమ్మితే అనే అనుమానాలు కూడా అప్పుడే వ్యక్తమౌతున్నాయి. 

సీనియర్ల వైపా…రేవంత్‌ వైపా!

 కొత్తగా వచ్చిన ఠాక్రే పని తీరు ఎలా వుంటుందో అన్నది పార్టీలో ఆసక్తిని రేపుతోంది. అసలు మాణికం ఠాకూర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని సార్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ అధిష్టానం ప్రియాంక గాంధీని పర్వవేక్షకురాలిగా పంపుతారని కూడా ప్రచారం జరిగింది. కొత్తగా ఠాక్రే వచ్చాడు. 

ఠాకూర్‌ ను అధిష్టానం పంపించడంలో సీనియర్లు సఫలమా!

 రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి రేవంత్‌ తోపాటు ఠాకూర్‌ ను కూడా సీనియర్లు టార్గెట్‌ చేస్తూ వచ్చారు. అధిష్టానం దూత అని ఆయనపై వ్యాఖ్యలు చేయడం తగదని అసలే తగ్గలేదు. పైగా ఆయన నేతృత్వంలో సాగిన సమావేశాలుకు డుమ్మా కొడుతూ వచ్చారు. నిరసన గళం వినిపిస్తూనే వస్తున్నారు. ఠాకూర్‌ వచ్చారని తెలిసినా కనీసం మర్యాద పూర్వకంగా కలిసేందుకు కూడా సీనియర్లు గాంధీ భవన్‌ వెళ్లకపోయేవారు. అంతేకాకుండా ఠాకూర్‌ ను కూడా తప్పించాలనే వాళ్లు మొదటి నుంచి పట్టుపడుతున్నారు. మొత్తం రేవంత్‌ రెడ్డి మనిషి గా వ్యవహరిస్తున్నాడనేది సీనియర్ల ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ సీనియర్లు అనుకున్నది జరిగింది. 

వచ్చేది రేవంత్‌ కు గడ్డుకాలమా! 

ఇంత కాలం అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోకపోతేనే సీనియర్లు ఆగలేదు. ఇప్పుడు అధిష్టానం ఎంతో కొంత సీనియర్ల మాటలకు విలువ ఇస్తోందని తెలిసిన తర్వాత ఆగుతారా? డిల్లీ వెళ్లి పితూరీలు చెప్పకుండా వుంటారా? ఇలాంటి అవకాశం కోసమే సీనియర్లు ఇప్పటి దాకా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా రేవంత్‌ రెడ్డి ని ఆడుకుందామనే చూస్తున్నారు. ఠాక్రే ఏ మాత్రం వారికి అవకాశం ఇచ్చినా సీనియర్లు చెలరేగిపోతారని మాత్రం సమాచారం. 

సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా?

 ఏఐసిసి కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. గతంలోనే ఒక వార్త వినిపించింది. రేవంత్‌ రెడ్డి మీద ఇన్ని ఫిర్యాదులు ఎందుకొస్తున్నాయని కామెంట్‌ కూడా చేసినట్లు తెలిసిందే. అదే సమయంలో కొంత మంది సీనియర్లు డిల్లీకి వెళ్ళి కొత్త అధ్యక్షుడు ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా దొరికిన అవకాశం వినియోగించుకున్నట్లున్నారు. ఇన్చార్జ్‌ మాణికం ఠాకూర్‌ మీద, రేవంత్‌ రెడ్డి వ్యవహారం మీద బాగానే ఖర్గేకు వివరించినట్లున్నారు. సహజంగా ఎవరైనా ఒక్కరు ఏ వ్యక్తి గురించి పితూరిలు చెబితే నిజమా? అనుకుంటారు. వరుసబెట్టి ఎంతో మంది అదే పనిగా ఆ వ్యక్తి గురించి చెబితే నిజమే అని నమ్ముతారు. ఇక్కడ ఇదే నిజమైంది. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి వర్గం అనే ముద్ర వున్న నేతలకు అధిష్టానంతో అంత చనువు లేదు. అంత కలుపుగోలు తనం లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. కానీ సీనియర్ల విషయంలో అలా కాదు. ఏఐసిసి కార్యాలయం సంగతులన్నీ తెలుసు. అందుకే తెలంగాణలో సీనియర్ల పప్పులు ఉడకకపోయినా, డిల్లీలో ఉడుకుతుంటాయి. అదీ సీనియర్లు అంటే.

సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్‌ తో పొత్తు సాధ్యమామేనా?

 నిజంగానే సీనియర్లు ఇది కోరుకుంటున్నారా? అన్నదానిలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రచారం మాత్రం జనంలోకి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి రేవంత్‌ రెడ్డి అభిప్రాయం ఎలా వుంటుందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఈ విషయంలో రేవంత్‌ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా! అన్నది దానిపై కూడా బాగానే చర్చ సాగుతోంది. ఒక వేళ సీనియర్ల సూచన ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ తో పొత్తు పొడుపు కనుక జరిగితే సీనియర్ల అడుగులు పిడుగులేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. సహజంగా కాంగ్రెస్‌ రాజకీయాలు విచిత్రంగా వుంటాయి. ఆ పార్టిని గెలిపించాలంటే ప్రజలు. ఓడిరచాలంటే నాయకులు. అని సరదాలోనే సీరియస్‌ గా చెప్పుకుంటారు. దేశ రాజకీయాలలో బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ కు అవసరం అన్నది సీనియర్లు చెప్పుకుంటున్న మాట. అందుకే కేవిపి. రామచంద్ర రావు గాంధీ భవన్‌ లో ప్రత్యక్షమయ్యారని కూడా ప్రచారం. సీనియర్లలో చాలా మంది కోవర్టులు అనే అపవాదును ఎలాగూ మోస్తున్నారు. అదే నిజం చేద్దామనుకుంటున్నారు. అనేది కొందరి వాదన. ఇక రేవంత్‌ కు చుక్కలేనా? అన్న చర్చ కూడా మొదలైంది. 

బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ పొత్తు అంటే రేవంత్‌ కు పొగేనా! 

 సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా! రేవంత్‌ ను కూరలో కరివేపాకును చేసినట్లేనా? సంకేతాలు చూస్తే రేవంత్‌ మాటలకు కళ్లెమేనా? అయినా మారకపోతే సీట్లో నుంచి దింపుడేనా! ఇంటికి పంపుడేనా!! థాక్రే రాకతో గెలిచిన ఆనందం సీనియర్లది! అయినా రేవంత్‌ కు సహకరిస్తారన్న నమ్మకమేది! ఇప్పటికైనా కాంగ్రెస్‌ లో కుంపట్లాగేనా? కుమ్ములాటలు సమసిపోతాయా? అని శ్రేణులు ఆశలు పెట్టుకోవడం కూడా అత్యాశే అవుతుందేమో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *