ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ట్రబుల్‌షూటర్‌ హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్నది ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకుని టిఆర్‌ఎస్‌ పీఠం ఎక్కే వరకు అతి కీలకమైన పాత్ర పోషించిన హరీష్‌రావు ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోయిందని రాష్ట్రం మొదలుకుని దేశస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ప్రస్తుతం తన నియోజకవర్గమైన సిద్ధిపేటకు పరిమితం అవుతూ ప్రాధాన్యత తగ్గింది. పార్టీ అధిష్టానం కావాలనే ఇలా చేస్తుందని అనుచరగణం, ఇతర అభిమానులు ప్రకటనలు, తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న ట్రబుల్‌షూటర్‌ మాత్రం అలాంటిది ఏం లేదు గులాబీతోనే ఉన్నానంటూ తరుచుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ప్రకటనలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ గులాబీ వెంటే నేను అన్నట్లు సిగ్నల్స్‌ ఇస్తున్నారు. అయితే మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత బారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన హరీష్‌రావు, రెండోసారి ఏ మంత్రి పదవి లేకుండా మాజీగానే మిగిలిపోయారు. కీలకమైన ఎన్నికల్లో సైతం అంతగా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. దీంతో హరీష్‌ అనుచరుల్లో, అభిమానుల్లో ఆందోళన కలిగింది. నిర్ణయం ఏం తీసుకున్నా మేం కట్టుబడి ఉంటామని వారు నిర్ణయించుకున్నారట. కానీ ట్రబుల్‌షూటర్‌ మాత్రం ఎటువంటి తొందరపాటును ప్రదర్శించకుండా గురిచూసి కొడదాం, సమయం కోసం నిరీక్షిద్దాం అన్నట్లుగానే ఉన్నాడట.

ఇతర పార్టీల్లో జోరుగా చర్చ

హరీష్‌రావు టిఆర్‌ఎస్‌ పార్టీని వీడబోతున్నారనే చర్చ టిఆర్‌ఎస్‌ పార్టీలో కంటే ఇతర పార్టీల్లోనే జోరుగా కొనసాగుతుంది. మా పార్టీలోకి వస్తున్నాడంటే మా పార్టీలోకి అంటూ వారు తెగ సంబరపడి పోతున్నారట. ఇంకొందరైతే హరీష్‌రావు పార్టీ మారితే రాజకీయ సమీకరణలు మారుతాయని అప్పుడు టిఆర్‌ఎస్‌ పార్టీని అన్నిరకాలుగా ఎదుర్కొవడం అత్యంత సులభమని సంబరపడిపోతున్నారట. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆశించినంతగా సీట్లను సాధించకపోవడం, ఆ ఎన్నికల్లో హరీష్‌రావుకు అధిష్టానం ప్రాదాన్యతను కల్పించకపోవడంతో ఫలితాలు అలా ఉన్నాయని, మరీ హరీష్‌ పార్టీకే దూరం అయితే టిఆర్‌ఎస్‌ చొక్కా బొర్లపడటం ఖాయమని ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటున్నారట. అయితే ఈ విశ్లేషణలన్ని 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే జరుగుతున్న కాంగ్రెస్‌ బాహుబలి అంటూ పరోక్షంగా హరీష్‌పైనే ఆధారపడుతున్నాం అన్నట్లు ప్రకటనలు చేసినా లాభం లేకుండాపోయింది. దీంతో మామ, అల్లుళ్ల బంధం విడిపోదు అని కొందరు అనుకుంటుంటే ఇతరుల మనస్తత్వాలు తెలుసుకోవడానికే హరీష్‌ ద్వారా గులాబీ బాస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడని అది చూసి మనం చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని హరీష్‌ పార్టీని వీడేది లేదని ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తాడు తప్ప ఇతర పార్టీల్లోకి మాత్రం వెళ్లడని కొందరు విపక్షనేతల విశ్లేషిస్తున్నారట.

అమిత్‌షాను హరీష్‌ కలిశాడు…?

గులాబీని వదిలి కమలాన్ని అందుకోవడానికి హరీష్‌రావు కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు కొందరు లేదు, లేదు ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇంకొందరు తాజాగా ప్రచారం మొదలెట్టారు. గులాబీ గూటిని వదిలి కమలం గూటికి హరీష్‌రావు చేరుకోబోతున్నాడని రాజకీయవర్గాల్లో చర్చ జోరుగానే కొనసాగింది. దీంతో హరీష్‌రావు అనుచరులు, అభిమానుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఈ వార్త రాజకీయవర్గాల్లో తప్ప ఎక్కడ అంతగా చక్కర్లు కొట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబ సమయంలో విజయోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న హరీష్‌ తనకు వేరే ఆలోచన లేదనే సంకేతాలు పంపారు. కానీ రాజకీయవర్గాల్లో మాత్రం హరీష్‌ పార్టీ మార్పుపై ప్రచారం బాగానే జరిగింది.

అనుచరుల్లో అసంతృప్తి

టిఆర్‌ఎస్‌ పార్టీలో హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం, పక్కన పెడుతున్నట్లుగా క్యాడర్‌లోకి సంకేతాలు వెళ్తుండడంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి కలుగుతోంది. ఈ విషయమై వీరంతా హరీష్‌రావును ప్రశ్నిస్తే సమయం వచ్చేవరకు ఓపిక పట్టాలని సర్థిచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మారే ప్రసక్తే లేదని మన భవితవ్యం ఏంటో ఇందులోనే తేల్చుకుందామని పరోక్షంగా హరీష్‌ అన్నట్లు సమాచారం. అవసరం అయితే మరో ప్రాంతీయ పార్టీకి తెరతీస్తాం తప్ప ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని కొందరు హరీష్‌ అనుచరులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల కేసిఆర్‌ తమిళనాడు తరహా రాజకీయం అనగానే హరీష్‌ పార్టీ పెడతాడా అనే విషయం సైతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయిపోతుంది. అవును నిజం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని కొందరు రాజకీయ విశ్లేషకులు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఎవరెన్ని ఊహగానాలు చేసినా ప్రయత్నాలు చేసినా ట్రబుల్‌షూటర్‌ మాత్రం రూటు మారే ప్రసక్తే లేనట్లు కనిపిస్తోంది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *