కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…?

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వెలువడుతున్న నేపధ్యంలో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్న చందంగా తాము ఎవరం అవినీతికి పాల్పడలేదని, అవినీతి అక్రమాలు జరుగలేదని కావాలనే తమపై ‘నేటిధాత్రి’లో సృష్టించి వార్తల ప్రచురిస్తున్నారని వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ ‘నేటిధాత్రి’ మీపై ఏ విషయాలను రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ డిఐఈవో లింగయ్యను ఆదేశిస్తూ డిఐఈవో కార్యాలయానికి కలెక్టర్‌ కార్యాలయం నుండి లేఖను పంపింనట్లు సమాచారం. ఏదేని ఉన్నతాధికారుల నుండి లేఖలు వస్తే ముందుగా వారి కార్యాలయంలో ఇన్‌వార్డు రిజిష్టర్‌లో నమోదు చేయాలి. కాని నేటివరకు కలెక్టర్‌ లేఖను ఇన్‌వార్డులో నమోదు చేయపోవడమే కాకుండా నేటికి కలెక్టర్‌ కోరినా డిఐఈవో లింగయ్య వివరణ ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తున్నది.

వివరణ ఇవ్వని డిఐఈవో ‘మేకల లింగయ్య’

తమపై నిందారోపణలు మోపుతున్నదని ‘నేటిధాత్రి’పై స్వయంగా డిఐఈవో లింగయ్యనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్‌ వివరణ ఇవ్వాలని కోరి 10రోజులు దాటుతున్నా నేటి వరకు ఎందుకు వివరణ ఇవ్వలేదో అర్ధం కాని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు పాల్పడకుంటే వివరణ ఇవ్వడానికి డిఐఈవో లింగయ్య ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో అంతుచిక్కడంలేదు. సత్యహరిశ్చంద్రులమంటూ కలెక్టర్‌ను కలిసిన వీరు వివరణ ఇవ్వాల్సిన విషయంలో ఎందుకు తప్పించుకుంటున్నారో, కలెక్టర్‌ లేఖను ఎందుకు ఇప్పటి వరకు ఇన్‌వార్డు రిజిష్టర్‌లో నమోదు చేయకపోవడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా డిఐఈవో లింగయ్య క్యాంపులో అవినీతికి పాల్పడినట్లు అవగతమవుతున్నది.

లేఖను తీసిపారెయ్యడమేంటని పలు విమర్శలు

వరంగల్‌ అర్బన్‌జిల్లా మెజిస్ట్రేట్‌, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి డిఐఈవో లింగయ్యను వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ కోరినా ఏ మాత్రం స్పందించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ లేఖకే విలువ ఇవ్వకపోతే ఇంకేమైనా ఉన్నదా..? ఇంత నిర్లక్ష్యమా..? ఎవరి అండను చూసుకొని లింగయ్య కలెక్టర్‌ లేఖను పక్కకు పెట్టినట్లు,,? కలెక్టర్‌ అంటే గౌరవం లేదా..? ఇంటర్‌ బోర్డు కమీషనర్‌ ఆదేశాలను గౌరవించడు…వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ లేఖను గౌరవించడు..! జిల్లా కలెక్టర్‌ లేఖకే వివరణ ఇవ్వని దిక్కులేని పరిస్థితి డిఐఈవో కార్యాలయంలో ఉండటంతో లింగయ్య తీరుపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.