ఓటు ‘పడిపోయింది’ కౌంట్‌ ‘డౌన్‌’ – పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది

ఓటు ‘పడిపోయింది’

కౌంట్‌ ‘డౌన్‌’

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది. మండుతున్న ఎండలు ఇతర కారణాలతో ఓటు వేయడానికి ఓటర్లు ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం బాగానే పడిపోయింది. ఉదయం 8గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు కనిపించలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రాలన్ని దాదాపు బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం తరువాత కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించిన ఆశించిన మేరకు పోలింగ్‌ శాతం నమోదు కాలేదు. నాయకులు సైతం అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఓటర్లను చైతన్యం చేసి వాహనాల్లో తరలించేందుకుగాను, వాహనం సౌకర్యం కల్పించేందుకుగాను అంతగా ఆసక్తి కనబర్చలేదు. దీంతోపాటు గ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండి చదువు, ఉద్యోగం నిమిత్తం నగరాల్లో ఉంటున్న వారు సైతం ఓటుహక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు రాలేదు. దీంతో కొన్ని గ్రామాల్లో ఉన్న ఓట్లలో 50శాతం కూడా నమోదు కాలేదు. కారణంగా మొత్తంగా పోలింగ్‌ శాతం 60దాటకుండా పోయింది.

ఆసక్తి చూపని హైదరాబాదీలు

ఓటు వేయడానికి భాగ్యనగరవాసులు ఈసారి అంతగా ఆసక్తి కనబర్చనట్లే కనపడుతుంది. తెలంగాణవ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోనే అత్యత్పంగా పోలింగ్‌ నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో 39.49, సికింద్రాబాద్‌లో 39.20శాతం నమోదు అయ్యింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు పార్లమెంట్‌ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపనట్లు కనపడుతోంది.

మెదక్‌లో అత్యధికం

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా శాతాలు పరిశీలిస్తే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 68.60శాతం పోలింగ్‌ అత్యధికంగా నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లో ఓటు వేయడానికి ఓటర్లు కాసింత ఆసక్తి చూపినట్లే కనపడింది.

నిజామాబాద్‌లో 54.20శాతం

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 54.20శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. ఇక్కడ నుంచి కేసీఆర్‌ తనయ కవిత బరిలో నిలువగా రైతులు అత్యధిక సంఖ్యలో నామినేషన్‌ వేశారు. దీంతో ఈ స్థానంలో పోలింగ్‌ శాతంపై ఆసక్తి ఏర్పడింది.

నగదు పంపిణీ కారణమేనా…?

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు నగదు పంపిణీ చేయకపోవడం పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణంగా కొంతమంది చెపుతున్నారు. అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం అధికంగా ఉండగా ఈ ఎన్నికల్లో ఈ ప్రవాహం అధికంగా లేకపోవడంతో కొంతమంది ఓటర్లు ఓట్లు వేయడానికి నిరాసక్తత ప్రదర్శించారని కొందరు అంటున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఓటుకు వంద ఇవ్వడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణవ్యాప్తంగా పోలింగ్‌ శాతం వివరాలు

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. సాయంత్రం 5గంటల సమయానికి అత్యధికంగా మెదక్‌, కరీంనగర్‌లో పోలింగ్‌ శాతం నమోదు కాగా.. హైదరాబాద్‌ జంట నగరాల్లో అత్పల్పంగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే..

హైదరాబాద్‌ 39.49

మల్కాజ్‌గిరి 42.75

మెదక్‌ 68

మహబూబ్‌నగర్‌ 65

నాగర్‌కర్నూల్‌ 57.12

పెద్దపల్లి 59.24

సికింద్రాబాద్‌ 39.20

వరంగల్‌ 59.17

నల్గొండ 66.11

ఆదిలాబాద్‌ 66.76

ఖమ్మం 67.96

కరీంనగర్‌ 68

చేవెళ్ల 53.08

భువనగిరి 68.25

మహబూబాబాద్‌ 59.90

నిజామాబాద్‌ 54.20

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *