అత్యవసరంగా మీటింగ్‌ అన్నారు! అర్థాంతరంగా ఆపేశారు!!

 

`ఇంతకీ ఏం జరిగింది?

`పంచాయతీ రాజ్‌ సెక్రెటరీల వాదనేమిటి?

`మమ్మల్ని వదిలేయండి…ప్లీజ్‌!`మేం చిన్న జీవులం…

`దళిత బంధుపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు!

`పెద్ద వాళ్లను రక్షించేందుకు మమ్మల్ని బలిచేయొద్దు!

`దళిత బంధు లో రూపాయి తిన్నది లేదు!

`పూర్తిగా పై అధికారుల కనుసన్నల్లో జరిగిందే!

`అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు మేమే దొరికామా?

`అమలు విషయంలో అసత్యాలు నమోదు చేయలేం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పెద్ద పెద్ద తిమింగలాలు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాయి…చిన్న చిన్న చేపలే బలౌతుంటాయని అనేక సంఘటలను రుజువు చేసిన ఉదంతాలు వున్నాయి. ఇప్పుడు కూడా దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే చిన్న జీవులను బలిచేసే ప్రయత్నం పెద్ద జీవులు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులు అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ బాధ్యతను పై స్ధాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా చేపట్టాలి. కింది స్ధాయిలో ఎక్కడా అవకతవకలు జరక్కుండా చూసుకోవాలి. కింది స్ధాయి ఉద్యోగులకు పూర్తి స్ధాయి శిక్షణలివ్వాలి. వారికి కొన్ని బాద్యతలు అప్పంచాలి. కాని దళిత బంధు విషయంలో పై స్దాయి అదికారులే అన్నీ చూసుకున్నారు. పథకం తప్పుతోవ పట్టిందన్న విషయం వెలుగులోకి రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలిచేసే ఎత్తుగడలు మొదలైనట్లు తెలుస్తోంది. క్షేత్ర స్ధాయిలో ఈ పధకం అమలుకు సంబంధించి కేవలం అప్లికేషన్లు నింపే ప్రక్రియలాంటి చిన్న పని తప్ప, మరే సంబంధం లేదు. పైలెట్‌ ప్రాజెక్టు కావడంతో ఎంపిక విధానానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అసవరం లేకండాపోయింది. దళితులందరినీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేయడంతో పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు పేర్లు పంపించడం తప్ప మరేం చేయలేదు. కాని ఇప్పుడు వారికి పెద్ద చిక్కొచ్చి పడిరది. రెండో విడత నిధులు విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలతో పై స్ధాయి అధికారులక పని పడిరది. అసలు ఎంత పై స్దాయి అధికారులైనా ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులపై క్షేత్ర స్ధాయి అవగాహన వుండాలి. కాని అటు ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులెవరూ వాటిని పట్టించుకోలేదు. కేవలం ఇందులో ఎంత సంపాదించొచ్చన్న విషయాలను మాత్రం బాగా పట్టించుకున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 ఇటీవల దళిత బంధు పథకం పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై నేటిధాత్రిలో వస్తున్న కథనాలతో భూకంపం పుట్టింది.

 అంతకు ముందు ఈ విషయాలు అందరికీ తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని నేటిధాత్రిలో వచ్చే సరికి ప్రభుత్వం కూడా సీరియస్‌ గా వుంది. అసలేం జరిగిందన్నదానిపై ఆరా తీస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే ఇన్ని లోపాలు ఎదురైతే అసలు పధకం అమలులో అధికారులు ఎన్ని అవాంతరాలు సృష్టిస్తారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఓ మంచి పధకాన్ని తీసుకొచ్చి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తుంటే అధికారుల చేసిందేమిటి? అన్న ప్రశ్నలే మిగులుతున్నాయి. ఈ పధకంలో రాజకీయ జోక్యం వుండొద్దని పూర్తి పారదర్శతతో సాగాలని, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంతో బాగుంటుందని నమ్మిన ప్రభుత్వాన్ని పనిగట్టుకొని అబాసు పాలు చేసే పరిస్దితి తెచ్చారు. ఈ పధకం అమలు విషయంలో అధికార బిఆర్‌ఎస్‌ నాయకులను దూరంగా వుంచారు. లేకుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే ఎంతో ఆగం చేసేవి. అయినా పధకం సక్సెస్‌ కావొద్దనే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. అందుకే పైలెట్‌ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ పధకం మీద బురజ జల్లుతూనే వస్తున్నాయి. ఈ పధకం అమలైతే తమ పార్టీలకు ఇక తెలంగాణలో చోటుండదని ఆ నాయకులకు తెలుసు. అందుకే ఈ పధకం విఫల ప్రయత్నం అన్న ప్రచారంతోపాటు, ప్రభుత్వాన్ని నిందిద్దామని చూస్తూనే వున్నాయి. 

ఇలాంటి సమయంలో ఎంతో గొప్ప పధకంగా ప్రజల చేత కీర్తింబడుతున్న ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే పరిస్ధితి అధికారులు తీసుకొచ్చారు. 

ఇక పై నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో లబ్దిదారులకు సంబంధించినపూర్తి వివరాలు క్రోడీకరించాలని ఓ ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చారు. కింది స్ధాయి ఉద్యోగులైన పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలి చేసే ఎత్తుగడలు వేశారు. దీన్ని ఆ ఉద్యోగులు పసిగట్టారు. పంచాయితీ సెక్రెటరీలు నివేధిక మీదే పథకం భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. కాని ఇక్కడే అసలు చిక్కుముడి వుంది. కనీసం ముప్పై శాతం లబ్ధిదారుల వద్ద ఎలాంటి యూనిట్లు లేవు. కిరణాషాపులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన బర్రెలులేవు. కార్లు లేవు. ట్రాక్టర్లు లేవు. సెంట్రింగ్‌ సామాను లేదు. టెంటు హౌజ్‌ కు సంబంధించినవి లేవు. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు ఏ నివేధిక తయారు చేస్తారు. ఏ ఫోటోలు తీస్తారు.? పై స్ధాయి నుంచి ఒత్తిళ్లతో తిమ్మిని బమ్మిని చేసినట్లు నివేధికలు తయారు చేసినా, ప్రభుత్వం ఏదైనా విచారణకు ఆదేశిస్తే మొదట ఉద్యోగాలు కోల్పోయేది వీళ్లే…అందుకే మేం ఆ పని చేయలేమని పంచాయితీ సెక్రెటరీలు చేతులెత్తేశారు. ఈ మధ్య జిల్లా స్ధాయి అధికారులు జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌లో ఖచ్చితంగా పంచాయితీ సెక్రెటరీలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని తెలిసి, ఆ మీటింగ్‌ రద్దు చేశారు. అంతే కాదు తమ జీవితాలను ఆగం చేసేందుకు దళిత బంధు రూపంలో ఉత్పాతాన్ని సృష్టించి, వాళ్ల ఉద్యోగాలు కాపాడుకునేందుకు పై స్ధాయి అధికారులు కుట్ర పనుతున్నారని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లేందుకు కూడా సెక్రెటరీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

   నిజానికి పై స్ధాయిలో వున్న ఉద్యోగులకు అన్నీ తెలుసు. 

కాని ఏమీ తెలియనట్లు, తామేమీ తప్పు చేయనట్లు, క్షేత్ర స్ధాయిలో ఏం జరిగిందో తెలియనట్లు, నివేధికలు కోరడం వెనుకు ఆంతర్యం తెలియందా? కనీసం 30 నుంచి 40శాతం కూడా లబ్ధిదారులు దళిత బంధు యూనిట్ల కలిగి లేదు. అంతే కాదు కనీసం ఆ యూనిట్లు ఎలా వుంటాయన్నది కూడా వారికి ట్రేడర్లు చూపించలేదు. ఈ పధకం కింద ఇచ్చిన కార్లు వారు నడిపింది లేదు. ఇంటి ముందు పెట్టుకున్నది లేదు. ఆ కార్లతో తిరిగింది లేదు. వారి అవసరాలు, బలహీనతలను సొమ్ముచేసుకునేందుకు వచ్చిన దళారులు ఇచ్చిన అత్తెసరుతో సర్ధుకున్నారు. ఇచ్చింది తీసుకొని కార్లు, ట్రాక్టర్లు వారికి అప్పగించారు. అసలు అధికారులు చేయాల్సిన పని ఏమిటన్నది మర్చిపోయారు. కార్లు, ట్రాక్టర్లు,ఇతర యూనిట్లు అందిజేసినప్పుడే లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాలు సూచించాల్సి వుండాల్సింది. కాని అది అధికారుల చేయలేదు. అమాయకులైన దళితులు వాటిని అమ్ముకొని వచ్చిన నాలుగు రూపాయలతో పూట గడుపుకున్నారు. అవి కాస్త అయిపోయినవి. ఇప్పుడు రెండో విడత కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి వచ్చింది. మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? దళితులు ధనవంతులయ్యారా? అధికారులు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, తమ వాటాలు తాము తీసుకొని, చేతులు దులుపుకోవడం కోసమేనా? దళిత బంధు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *