స్మశానమే తనదంటున్నాడు
గ్రేటర్ వరంగల్ నగరం శరవేగంగా అభివృద్ది చెందుతుంది. అభివృద్ధితోపాటు రియల్ ఎస్టేట్ అంతే వేగంగా ముందుకుపోతుంది. పనికిరాని భూములు అని అందరూ భావించినవి ప్రస్తుతం కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయి. భూముల ధరలకు అమాంతంగా రెక్కలు రావడంతో ఈజి మనికి అలవాటుపడిన కొందరు కబ్జాల తతంగాలను నడిపిస్తూ దానినే తమ వృత్తిగా మార్చుకున్నారు. వస్తే భూమి, లేదంటూ సెటిల్‌మెంట్ ఎంతో కొంత డబ్బు అనే ధోరణితో గ్యాంగ్‌లుగా ఏర్పడి కాలర్ ఎగరేస్తూ నగరంలో స్వైరవిహరం చేస్తున్నారు. అయితే ఈ కబ్జా విషయంలో ఈ స్థలం, ఆ స్థలం అన్న తేడా ఎంతమాత్రం లేదు. భూమి ఖాళీగాఉండి విలువైంది అయితే చాలు కబ్జా రాబందులు వాలిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే నగరంలో పెద్దమ్మగడ్డ ప్రాంతంలో జరిగింది. దళితుల స్మశానాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్న ఓ పెద్దమనిషి ఈ ప్రాంతవాసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసుల సాయంతో భూమిలోకి చొరబడి దహానసంస్కారాలు సైతం చేయకుండా అడ్డుకుంటున్నాడు. ఈ విషయమై పెద్దమ్మగడ్డవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేస్తే మా పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. కోర్టు కేసులు, కబ్జాదారుకు పోలీసుల సహకారం ఎలా ఉన్నా దళితుల స్మశానాన్ని కబ్జా చేస్తే ఎవరు సహిస్తారని అంటున్నారు. దళితుల స్మశానవాటిక స్థలం తనదేనంటూ జులుం ప్రదర్శిస్తున్న పెద్దమనిషి వ్యవహారంపై వారు ‘నేటిధాత్రి’కి పూర్తి వివరాలు అందించారు. వారు అందించిన వివరాల ప్రకారం…
ఇలా మొదలయ్యింది…
ములుగురోడ్డు సమీపంలోని పెద్దమ్మగడ్డవాసులకు స్మశానవాటిక కోసమని 1962వ సంవత్సరంలో ఇదే ప్రాంతానికి సమీపంలో ప్రధాన రహదారిని అనుకుని కాకతీయ కెనాల్ అవతల నల్లెల కట్టయ్య అనే పట్టాదారు సర్వేనెం.700లో మూడున్నర ఎకరాల స్థలం అప్పగించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతవాసులు ఈ స్థలాన్ని దహాన సంస్కారాలకు వినియోగిస్తున్నారు. భూమి పట్టాదారు వద్ద నుంచి ఓ కాగితం రాయించుకుని ఈ స్థలాన్ని దళితుల స్మశానం కోసం వారు కేటాయించుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ఆరు దశాబ్ధాలపాటు ఈ స్థలంపై ఎవరి కన్నుపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓ మాజీ మంత్రికి సంబంధీకులు కబ్జా చేయాలని యత్నించినా స్థానికులు తిరగబడి ఇది దళితుల స్మశానస్థలం దయచేసి అలా చేయవద్దని కోరడంతో స్థలాన్ని వదిలేసి వెళ్లారు. వారు వదిలేసిన తరువాత మళ్లీ ఓ కొత్త కథ మొదలయ్యింది.
కబ్జా కథ ఇది
1962వ సంవత్సరం నుంచి పెద్దమ్మగడ్డ ప్రాంతవాసులకు 700సర్వే నెంబర్‌లోని మూడున్నర ఎకరాల్లో స్మశానవాటిక కొనసాగుతూ వస్తుంది. అయితే 2014 సంవత్సరంలో ఈ స్మశానవాటికకు కబ్జా ముప్పు ఏర్పడింది. జాగృతి కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో హన్మకొండ బాలసముద్రం ప్రాంతానికి చెందిన బొజ్జ కిషన్‌రాజ్ అనే వ్యక్తి దళితుల స్మశానం కబ్జాకు యత్నిస్తున్నాడు. దళితుల స్మశాన స్థలంలోకి అక్రమంగా చొరబడి అక్కడి సమాధులను కూలగొట్టి కబ్జాకు యత్నించాడు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే 1984 సంవత్సరంలో వేగూరి ప్రకాష్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి 65వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు కొన్ని పత్రాలు చూపించాడు. దీంతో ఆవేదనకు గురైన స్థానికులు తమ స్మశాన స్థలాన్ని తమకు వదలాలని వేడుకున్నారు. అయినా మనసు కరగని కిషన్‌రాజ్ పోలీసులతో స్థానికులపై దాడులు చేయించాడు. కేసులు నమోదు చేయించి ఇప్పటికి 25మంది స్థానికులను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నాడు. సొసైటీ పేరుతో భూమి తనదంటున్న కిషన్‌రాజ్ కొంతమంది ప్రైవేట్ గ్యాంగ్‌తో దళితుల స్మశానస్థలంలోకి చొరబడుతున్నాడు తప్ప ఇప్పటి వరకు సభ్యులెవరు అక్కడికి రాలేదు. హౌజింగ్ సొసైటీ పేరు చెబుతున్న 1984 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ప్లాటింగ్ చేయకుండా ఎందుకు వదిలారో అర్థం కాని విషయం. 1964 నుంచి ఇక్కడ దళితుల స్మశానవాటిక ఉందని తెలిసినా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో ఇక్కడి స్థానికులకు అంతుబట్టడం లేదు.
కేసులు పెట్టని పోలీసులు
700సర్వే నెంబర్‌లోని మూడున్నర ఎకరాల స్థలంలోకి బొజ్జ కిషన్‌రాజ్ చొరబడి సమాధులను కూలగొడితే ఫిర్యాదు చేసిన పోలీసులు ఎంతమాత్రం స్పందించలేదు. భూమి విషయం ఎలా ఉన్న సమాధులు ధ్వంసం చేయడం నేరం కనుక కేసులు నమోదు చేయాలని వేడుకున్న పోలీసులు మాత్రం కనికరించలేదు. కోర్టు ఆర్డర్ అంటూ నమ్మబలుకుతూ కిషన్‌రాజ్‌కే పరోక్షంగా పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దళితుల స్మశానవాటికలో ఏం జరుగుతుందోనని స్థానికులు ఎవ్వరు అందులో అడుగుపెట్టిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదంతా కిషన్‌రాజ్ పలుకుబడి ఫలితమేనని అందుకే పోలీసులు సహకరిస్తున్నారనే స్థానికులు అంటున్నారు.
నిధులు మంజూరైనా కబ్జా వదల్లేదు
పెద్దమ్మగడ్డలోని దళితుల స్మశానవాటికకు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రహారీగోడ నిర్మాణం కోసమని 95లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. హన్మకొండలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమీషన్ సమీక్ష సమావేశంలో దళితుల స్మశానవాటిక విషయమై స్థానికులు ఫిర్యాదు చేస్తే అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి ఆ భూమి దళితుల స్మశానవాటికదేనని నిధులు మంజూరు చేశామని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అయినా ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. కబ్జా చెర వీడలేదు. అనేకసార్లు హన్మకొండ తహశీల్దార్ భూమి దళితుల స్మశానవాటికదేనని నిర్థారించిన కబ్జా చేసిన పెద్దమనిషి మాత్రం ఒప్పుకోవడం లేదు. మెడికల్ ఎక్విప్‌మెంట్ సరఫరా వ్యాపారం చేస్తున్న కిషన్‌రాజ్ సొసైటీ పేరుతో భూమిని తన ఆధీనంలోకి తీసుకుని మెడికల్ వేస్టేజి డంప్‌యార్డు, బర్నింగ్ యార్డును ఇక్కడ నిర్మించాలని చూస్తున్నాడని స్థానికులు అంటున్నారు.
స్మశాన స్థలాన్ని మాకు అప్పగించాలి
– హన్మకొండ కిష్టయ్య
దళితుల స్మశానవాటికను కబ్జా చెర నుంచి కాపాడాలని పెద్దమ్మగడ్డ ప్రాంత పెద్ద హన్మకొండ కిష్టయ్య అధికారులను కోరారు. ఆరు దశాబ్ధాల నుంచి స్మశానవాటిక ఇక్కడే కొనసాగుతున్న సొసైటీ పేరుతో కిషన్‌రాజ్ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధులు కూలగొట్టిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.
అందరి మద్దతు ఉన్నా కబ్జా చెర వీడడం లేదు
– పేర్ల మనోహర్
దళితుల స్మశానవాటిక విషయంలో తమ ప్రాంతవాసులకు అందరి నుంచి మద్దతు ఉన్న కబ్జా చెర మాత్రం వీడడం లేదని పెద్దమ్మగడ్డ డెవలప్‌మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల స్మశానవాటిక స్థలం కబ్జా కాకుండా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సైతం తమకు మద్దతు తెలిపారని అన్నారు. అయిన కబ్జా చెర మాత్రం వీడడం లేదన్నారు. అధికారులు చొరవ చూపి తమ సమస్య పరిష్కారం చేయాలన్నారు.
………………………….