జక్కలొద్దా…కేడలొద్దా..?
అవును ఇది అక్షరాల నిజం. గ్రేటర్ వరంగల్ నగరంలోని ఓ కార్పొరేటర్ భర్త నగరశివారు ప్రాంతంలోని జక్కలొద్ది ప్రాంతాన్ని తాను కష్టపడి చెమటోడ్చి సంపాదించినట్లు తెగ బిల్డప్ చేస్తున్నాడు. ఎక్కరిదో భూమి మోసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లు తాత, ముత్తాతల కాలం నుంచి ఆరుగాలం శ్రమించి భూమిని సంపాదించినట్లు ఆయనగారు కొడుతున్న ఫోజులు చూస్తుంటే ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. భూముల గూర్చి ఇతగాడు చేసిన కబ్జాల గూర్చి ప్రస్తావిస్తే ఇతను అధిష్టానంపై విరుచుకుపడుతాడు. వారు చేయడం లేదా…? అని ఎదురు ప్రశ్నిస్తాడు. తిమ్మాపురం గ్రామశివారులో పేదదళితుడి భూమి ఆక్రమించిన ఇతడిని ‘నేటిధాత్రి’ ప్రశ్నించింది. అంతే అంత ఎత్తున లేచి నీతివాక్యాలు వల్లిస్తూ మధ్యమధ్యలో పరోక్షంగా హెచ్చరిస్తూ తాము ఒక గ్యాంగ్గా ఏర్పడి భూములు కబ్జా చేస్తున్నామని ఒప్పుకోకనే ఒప్పుకుంటూ, మరోవైపు ఎంతో కొంత చెల్లించి భూములు హస్తగతం చేసుకుంటున్నామని చెపుతూ అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశాడు. ఇది సరైంది కాదు కదా అని ప్రశ్నిస్తే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్తో పోల్చుకుంటూ వారు ఎక్కడ కబ్జాలు చేయడం లేదా అంటూ సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తాడు. మొన్నటి వరకు టిఆర్ఎస్లో కొనసాగి ఇటీవలే పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్లిన ఓ సీనియర్ నేత అనుచరుడిగా చెప్పుకునే ఇతను ఆ సీనియర్ నేత భూముల వ్యవహారం తమకెందుకని గమ్మున ఉన్న కార్పొరేటర్ భర్త మాత్రం తన కబ్జా పంథాను ఎంతమాత్రం వీడడం లేదు. ఇటీవల జక్కలొద్ది ప్రాంతంలో ఓ దళితుడికి సంబంధించిన భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్ భర్త స్థానికులు భూమి ఎలా కబ్జా చేస్తారని నిలదీయడంతో ఆరులక్షల రూపాయల చెక్ అందజేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడట. ఇలా ఒకటి కాదు…రెండు కాదు…రెండువందల ఎకరాలకుపైగా భూమి ఇతని కబంధహస్తాల్లో చిక్కుకుని ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సీలింగ్ భూములు, అసైన్డ్భూములు, దళితుల బూములు, ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి కేవలం తెల్లకాగితంపై నాలుగు ముక్కలు రాయించి ఎవరితో సంతకం చేయించి పహాణీలు సృష్టించిన ఘనత ఇతగాడికే దక్కుతుందట. తిమ్మాపురం జక్కలొద్ది ప్రాంతాలలో ఎవరినడిగిన ఈయన పేరు చెప్తారు. కొందరు భూమిని కోల్పోయి…వారి భూమిలోనే వారు పరాయిగా మారిపోయి ఆవేదనతో, ఆక్రోశంతో బండభూతులు అందుకుంటారు, శాపనార్థాలు పెడతారు. మనం కేవలం పలకరిస్తే చాలు అయ్యా…నా భూమి నాకు అప్పగిస్తారా…అతనితో మాట్లాడతారా…? సగం అప్పగించిన చాలు మాట్లాడండయ్యా…? అంటూ బ్రతిమిలాడుతారు. ఈ ప్రాంతంలో ఇంత జరుగుతున్న రెవెన్యూ శాఖ కన్నెత్తి చూడదు సరికదా కబ్జాలోకి వెళ్లండి పహాణీలోకి ఎక్కిస్తాం…అంటూ ఉచిత సలహా ఇస్తారు అధికారులు. బలవంతుడితో ఢీకొన లేక, రెవెన్యూ, పోలీసుశాఖల సహకారం లేక రాత్రికి రాత్రే రికార్డులు 5 తారుమారు చేయించి తన పేరు వీలైతే బినామీ పేర్లు మరీ అవసరం అయితే తన కొడుకు పేరుతో రెవెన్యూ రికార్డులోకి ఎక్కి కబ్జా దర్పం ఒలకబోసే ఇతగాడిని తట్టుకోలేక భూమిని చూసి బతుకుతున్నారు తప్ప ఈ భూమి ఎప్పటికైనా తమ స్వంతం అవుతుందన్న ఆశను మాత్రం ఇక్కడి దళిత నిరుపేదలు ఎప్పుడో కొట్టేసుకున్నారు. విచిత్రం ఏంటంటే దళితుల భూములు కబ్జా అవుతుంటే తిరగబడి దళితులకు న్యాయం చేయాల్సిన దళిత నాయకులు కొంతమంది సైతం కార్పొరేటర్ భర్డకే సహకరిస్తుండటంతో దిక్కుతోచిన స్తితిలో ప్రస్తుతం దళితులున్నారు.