గ్రేటర్లో ‘కార్పొరేటర్’ గిరి
– కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట
– అధికారులు సహకరిస్తే సరి…లేదంటే బదిలీలు…సరెండర్లు
– మున్సిపల్ కమిషనర్‌ను వదలని కార్పొరేటర్ గిరి
– భవన నిర్మాణంలో జోక్యం…అన్ని సరిగా ఉన్న అడిగింది ముట్టజెప్పాల్సిందే
– ఎవరి డివిజన్లో వారిదే రాజ్యం
– ఇబ్బందులు పడుతునన నగర ప్రజలు
వరంగల్ ప్రతినిధి, నేటిధాత్రి : గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రస్తుతం కార్పొరేటర్ గిరి నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచింది మొదలు డివిజన్లలో వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. ఎన్నికల వేళ కాళ్లవేళ్ల పడి గెలిపించాలని అందరిని వేడుకున్న కార్పొరేటర్లు ఇప్పుడు ఓట్లేసిన జనాన్నే ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు అయితే ఏకంగా తాము ఎన్నికల్లో ఖర్చుపెట్టామని ఇప్పుడు సంపాదించుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. ఓట మల్లన్న…బోడ మల్లన్న సామెతను బాగా ఒంట బట్టించుకున్న కొందరు కార్పొరేటర్లు డివిజన్లలో తమ రాజ్యాన్ని నడుపుతున్నారట. తమకు తెలియకుండా ఎంతమాత్రం అభివృద్ధి పనులు జరగరాదని, డివిజన్లో ఉన్న ప్రజలు సైతం నిర్మాణాలతో సహ ఎలాంటి పనులైన చేయరాదని అలా చేయాలంటే తమకు కావాల్సింది ముట్టజెప్పాల్సిందేనని తెల్చి చెపుతున్నారట. గతంలో ఎన్నడూ లేనంతంగా ప్రస్తుత కార్పొరేటర్లు డివిజన్ ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారని, ఇంటి నిర్మాణం, గొడవలు, వ్యక్తిగత విషయాలు, ల్యాండ్ సెటిల్మెంట్ తదితర విషయాలలో తల దూర్చుతూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా వినబడుతున్నాయి.
ప్రతి పనికో రేటు…?
డివిజన్లలో కార్పొరేటర్లు ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జనన, మరణ ధృవీకరణ పత్రం మొదలుకుని ఇంటి నిర్మాణ అనుమతుల వరకు వీరి జోక్యం చేసుకుంటున్నట్లు తెలిసింది. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం’ అన్న చందంగా ఉన్న వారు, లేని వారు అనే తారతమ్యాలు లేకుండా డివిజన్లో ప్రజలకు కార్పొరేటర్‌తో పని పడింది అంటే చాలు తమకు కావాల్సింది ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో డివిజన్ ప్రజలు స్థానిక కార్పొరేటర్ల పేరు చెపితేనే వామ్మో…అంటున్నారు.
అధికార్లు సహకరిస్తే సరీ…!
‘కార్పొరేటర్ గిరి’తో డివిజన్లలో అధికారులకు వేధింపులు ఎక్కువైనట్లు తెలిసింది. ప్రధానంగా డివిజన్లలో ఇంటి నిర్మాణ పనుల అనుమతి విషయాలలో కార్పొరేటర్లు చేతివాటానికి అలవాటుపడ్డారట. డివిజన్లో ఎవరు నిర్మాణ పనులు మొదలుపెట్టిన పిల్లర్‌కు ఇంత అని నగదు ముట్టజెప్పాలట. నిబంధనల ప్రకారం అన్ని ఉన్న కార్పొరేటర్‌కు సమర్పించేది సమర్పించాలి లేదంటే భవన యజమాని, అధికారులపై కార్పొరేటర్లు కేకలు వేస్తారు. వాటా ముట్టజెప్పందే నిర్మాణాన్ని కొనసాగనిచ్చేది లేదని తెల్చి చెబుతారు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్పిన కార్పొరేటర్లు వినరు. ఏది ఏమైనా తమకు నగదు ముట్టజెప్పాల్సిందేనని నానా ఇబ్బందులకు గురిచేస్తారట. ఇటీవల హన్మకొండలోని ఓ డివిజన్లో ఓ కార్పొరేటర్ అధికారిపై ఇలాంటి ప్రతాపాన్నే చూపాడట. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారి దగ్గర నుంచి అధికారే నగదు వసూలు చేసి అప్పగించాలని ఆదేశించాడట. ఆ అధికారి ససేమిరా అనడంతో ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఆ అధికారిని సరెండర్ చేయాలని నిర్ణయించి, సమావేశంలో తీర్మాణం చేయించి పనికినిచ్చాడట.
ఆ అధికారితో సహా మొత్తం ఐదుగురు ఇటీవలే గ్రేటర్ పాలకమండలి సరెండర్ చేస్తూ తీర్మాణం చేసింది. అధికారులు తమకు సహకరిస్తే సరి లేదంటే బదిలీలు, సరెండర్లు కార్పొరేటర్లు అనుసరిస్తున్న అవినీతి విధానాలతో సక్రమంగా, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని భూకబ్జాలు, అక్రమ వసూలును అడ్డుకున్నందుకే ఐఎఎస్ అధికారి గౌతమ్‌ను కార్పొరేటర్లు, ఇతరులు కలసి బదిలీ చేయించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు కొంతమంది కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. డివిజన్లు వీరి రాజ్యం అయినట్లు, ప్రజలను దోచుకునేందుకు వీరికి ఎవరో లైసెన్స్ ఇచ్చినట్లు ఇష్టారీతిన వ్యవహారిస్తూ అటు అధికారులను, ఇటు డివిజన్ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న కార్పొరేటర్లకు రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పి ప్రజలదే అంతిమ విజయం అని నిరూపిస్తామని కార్పొరేటర్‌గిరికి పులిస్టాప్ పెడతామని పలువురు ప్రజలు అంటున్నారు.
…………………………………..