
కష్ట జీవులను కాటేస్తున్న కల్తీ కల్లు…..!
జహీరాబాద్. ఎక్సైజ్ పరిధిలో కల్తీకల్లు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కల్తీకల్లు అమ్మకాలతో పేదల జీవితాలతో దుకాణాల నిర్వాహకులు ఆటలాడుతున్నారు.
◆ కల్తీ కల్లుతో ఇల్లూ.. ఒల్లు గుల్ల
◆ కల్లు వ్యాపారులు ఆడిందే ఆట.. పాటిందే పాట
◆ మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు.. ప్రమాదంలో పేదల ప్రాణాలు
◆ కల్లు తయారీకి విచ్చలవిడిగా మత్తుపదార్థాల వినియోగం
◆ ప్రతీ గ్రామంలో లైసెన్స్ లేని కల్లు దుకాణాల నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్.ఎక్సైజ్ పరిధిలో కల్తీకల్లు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కల్తీకల్లు అమ్మకాలతో పేదల జీవితాలతో దుకాణాల నిర్వాహకులు ఆటలాడుతున్నారు. సాధారణ కల్లుతో మత్తు రావడం లేదని కొందరు ఎక్కువ మత్తు ఇచ్చే ఆల్కాహాల్ లిక్కర్‌కు అలవాటు పడ్డారు. దీంతో కల్లు అమ్మకాలు తగ్గాయి. దీంతో కల్లు వ్యాపారులు లిక్కర్ కంటే ఎక్కువ మత్తు ఇచ్చేలా వివిధ రసాయనాలు వేసి కల్తీకల్లు తయారు చేస్తున్నారు. సాధారణ లిక్కర్‌తో పోలిస్తే కల్తీకల్లు రేటు తక్కువ ఉండడంతో పేదలు కల్తీకల్లుకు అలవాటు పడుతున్నారు. కల్తీ కల్లు తాగితే నాడీ మండల వ్యవస్థ, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది దొరకకుంటే మతి స్థితిమితం తప్పిన వారిలా ప్రవర్తిస్తుంటారు. అలాగే కొన్ని సార్లు గుండెనొప్పితో మరణించిన సందర్భాలూ ఉన్నాయి. పేదల జీవితాలను కల్తీకల్లు చిత్తు చేస్తోంది. కల్తీ కల్లు వ్యా పారం అక్రమార్కులకు వరంగా, మత్తు ప్రియులకు శాపంగా మారింది.పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు రోజంతా పనిచేసి సాయంత్రం ఉపశమనం కోసం పురుషులు, మహిళలు కల్లు తాగుతారు. మద్యం ధరలను ఎక్కువ ఉండడంతో చౌకగా లభించే కల్తీ కల్లు తాగు తారు. దుకాణాల నిర్వాహకులు కల్తీకల్లు తయారుచేసి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట కల్తీకల్లు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.ఎక్నైజ్ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదు. కల్తీకల్లు వ్యాపారులు డబ్బు సంపాదనకు పేదల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
కల్తీ కల్లు తమారీ ఇలా..
జహీరాబాద్ ఎక్సైజ్ పరిధిలో వ్యాపారులు నిషేఽధిత పదార్థాలతో కల్తీకల్లు తయారు చేస్తున్నారు.కల్లులో మత్తు ఎక్కించే క్లోరోహైడ్రేట్, డైజోఫాం,సిల్వర్యాష్, కట్టామీటా, సిల్వర్ నైట్రేడ్ల తదితర మత్తు పదార్థాలు కలుపుతున్నారు. కొందరు కల్తీ కల్లు తయారీకి వినియోగించే మత్తుపదార్థాలు అమ్ముతున్నారు. రహస్యంగా లావాదేవీలు జరుపుతున్నారు. అధికారులు కల్తీ వ్యాపారాన్ని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.వ్యాపారులు ఓ కొత్త రకం మత్తుమందును కనిపెట్టినట్లు సమాచారం. ఈ మందు ధర మార్కెట్లో చాలా ఖరీదని గీతకార్మికులే పేర్కొంటున్నారు. ఈ మందును అందరికీ ఇవ్వకుండా రోజూ ఒకే వ్యక్తి కల్లులో ఇంజక్షన్‌తో తీసి కలుపుతుంటాడని చెబుతున్నారు. కల్తీ కల్లు తాగితే కీళ్ల నొప్పులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అతిగా తాగితే ప్రాణాలే పోతున్నాయి. కూలి పనిచేసుకునే పురుషులు, మహిళలకు కల్లు తాగడం అనాదిగా వస్తోంది. రోజంతా పనులు చేస్తే మత్తు పదార్థాలు తాగితే సేద తీరుతామని వారి అభిప్రాయం. కొందరు పిల్లలకు సైతం కల్లు తాగిస్తున్నారు. అది వారి ఆరోగ్యంపై, ప్రవర్తనపై ప్రభావం చూపుతోంది.
వ్యాపారులకు డబ్బు… తాగే వారి ఒల్లూ, ఇల్లు గుల్ల!
కల్తీకల్లు వ్యాపారంతో దుకాణ నిర్వాహకులు భారీగా డబ్బు సంసాదిస్తుండగా, కల్లు ప్రియుల జీవితాలు గుల్లవుతున్నాయి. ఝరాసంగం న్యాల్కల్ కోహిర్ మొగుడంపల్లి జహీరాబాద్
తదితర గ్రామాల్లో కల్తీ కల్లు వ్యాపారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. లైసెన్స్ ఉన్న కార్మికులే కాకుండా ఇతరులు సైతం కల్లు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాపారులు గ్రామాలను గుత్త తీసుకొని కల్తీ కల్లును విక్రయిస్తున్నారు. ఇక్కడి లైసన్స్ హోల్డర్లకు నెలకు కొంత మాట్లాడుకొని ఇతరులకు అప్పగించారు. వీరు సంపాదనే ధ్యేయంగా కల్తీకల్లును విక్రయిస్తున్నారు. నిజానికి ఈత, తాటి వనాల నుంచి సేకరించే కల్లుతోనే వ్యాపారాన్ని నిర్వహించాలి, మొత్తం ప్యూర్‌గా కాకున్నా మత్తు పదార్థాలు కలపకుండా అమ్మాలి. చెట్ల కల్లులో కొద్దిమేర నీరు కలిపితే పెద్దగా ప్రమాదం ఉం డదు. కానీ వ్యాపారులు అమ్ముతున్న కల్లులో ఐదు శాతం కూడా చెట్టు కల్లు ఉండదు. మొత్తం రసాయనాలతో చేసిన కల్తీకల్లే అమ్ముతున్నారు. కల్లు కాంపౌడ్లను ఏర్పాటు చేసుకున్నారు.
పరిగిలో జనావాసాల్లో కల్లు తయారు చేసే డిపోలనే నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గ, పరిసర గ్రామాలకు ఆటోలు, జీపుల్లో కల్లు సీసాలను తరలిస్తున్నారు. లైసెన్స్ లేకుండా నిర్వహించే కల్లు దుకాణాల్లో గీత కార్మికులు కాకుండా ఇతరులు కూలీలతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ దుకాణాలపై టాస్క్‌ఫోర్స్, అధికారులుగానీ దాడులు జరిపితే కేసుల్లో ఇరుక్కునేది అమయాకులే. కల్లు డిపో, కల్లు దుకాణాలు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా గ్రామానికి చివరి ప్రదేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే తయారు చేసిన కల్లును దూర ప్రాంతాలకు తరలించరాదని నిబంధనలను ఇక్కడి వారికి మినహయింపుగా ఉన్నట్లు తెలుస్తోంది.