
వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనమని, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు రాష్ట్రాన్ని సంక్షేమ యుగం వైపు తీసుకెళ్లిన మహానేత వైయస్సార్ అని ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యేభావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.