
# స్వీప్ ఆధ్వర్యంలో బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన ర్యాలీ.
నర్సంపేట,నేటిధాత్రి :
18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు నమోదు చేసుకున్న యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వీప్ జిల్లా నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.జిల్లా స్వీప్ (సిష్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టరల్ పార్టీసిపేషన్ ప్రోగ్రాం) ఆధ్వర్యంలో యువత ఓటు హక్కు ను వినియోగించుకోవాలని కోరుతూ బుధవారం నర్సంపేట బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ చేపట్టగా స్వీప్ జిల్లా నోడల్ అధికారి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నోడల్ అధికారి మాట్లాడుతూ 18 సం.నిండి ఓటు హక్కు నమోదు చేసుకున్న యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఈవిఎం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధానం పట్ల యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటరు చైతన్య రథాలను ఏర్పాటు చేసి అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. ఉత్తమ ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు ప్రముఖ పాత్ర వహిస్తుందని, ఓటు హక్కు వినియోగాన్ని బాధ్యతగా భావించాలని ఆమే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి సారయ్య,కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.