Gold and Silver Prices Surge Sharply in a Single Day
వామ్మో.. వెండి.. ఒక్క రోజులోనే మరీ ఇంతలా
బుధవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. ట్రేడింగ్ మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త పుంతలు తొక్కాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరల ర్యాలీ మళ్లీ మొదలైంది. మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. పేదల బంగారంగా పేరుపడ్డ వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 11.00 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510కు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.650 అధికం. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.600 మేర పెరిగి 1,23,300కు చేరుకుంది. వెండి ధర మాత్రం సామాన్యులను హడలెత్తించే స్థాయిలో పెరిగింది. ట్రేడింగ్ మొదలైన గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.8900 మేర పెరిగి రూ.2,08,000కు చేరుకుంది (Gold, Silver Rates on Dec 17).చెన్నైలో 24 క్యారెట్ పసిడి (10 గ్రాములు) ధర గరిష్ఠంగా రూ.1,35,280కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,24,000గా హైదరాబాద్, విజయవాడల్లో రూ.1,23,300గా ఉంది. కిలో వెండి ధర చెన్నైలో అత్యధికంగా రూ.2,22,000కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా ధర ఇదే రేంజ్లో కొనసాగుతోంది.బుధవారం ట్రేడింగ్‌లో ఇప్పటివరకూ బంగారం ధరలు అర శాతం మేర పెరగ్గా వెండి ఏకంగా 4 శాతం మేర పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత పెరుగుతుండటంతో ఫెడ్ రేట్ కోత మళ్లీ ఉంటుందన్న అంచనాలు, ఇతర సానుకూల భౌగోళిక రాజకీయ అంశాలు ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.
