నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్, ప్రతిభ స్వచ్చంధ సంస్థ మరియు వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్బంగా బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంతారావు అధ్యక్షతన జరిగింది. ప్రతిభ సంస్థ నిర్వాహకులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ధరిత్రి,భూమిని పరిరక్షించడం కొరకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. పెరుగుతున్న భూతాపం,వాతావరణ కాలుష్యాల నుండి భూమి,ధరిత్రిని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు.1970 నుండి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 193 దేశాలలో ధరిత్రి దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాయని తెలియజేశారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్” బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడుచు ధరిత్రి, భూమిపైన మాత్రమే ప్రతీ జీవరాశి మనుగడ సాధ్యం అని, ఇతర గ్రహాల మీద అనుకూల వాతావరణం లేదని అన్నారు.సమస్త జీవకోటి భారాన్ని మోసేది ధరిత్రి భూమి మాత్రమే అని అలాంటి భూమిని కాపాడుకోవడం, పరిరక్షించడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. నీటి వృధాను అరికట్టి నిల్వ చేయాలని, వీలైనన్ని మొక్కలు నాటి, కాలుష్యాలను అరికట్టి, ప్లాస్టిక్ ను విడనాడి భూమిని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరమ్ జిల్లా విజిలెన్స్ మెంబర్ నాగేల్లి సారంగం గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది నరేందర్, రాజేష్, సురేష్, వాణి, స్వరూప, నిర్మల, షౌరి, పిఈటి స్వామి, బాలబాలికలు పాల్గొన్నారు.