నేటిధాత్రి, వరంగల్
ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, వరంగల్ వేదికగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హాస్పిటల్లో వైద్యబృందంచే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ క్యాన్సర్ అవగాహన సదస్సులో ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి బారిన ప్రజలు ఎక్కువగా పడచున్నారని, క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనే లక్ష్యంగా సదస్సు జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ తిప్పని అవినాష్ మాట్లాడుతూ, క్యాన్సర్ వస్తే మరణమే అని ప్రజలలో ఒక అపోహ వుంది. ముందుగానే గుర్తించగల్గితే క్యాన్సర్ మహమ్మారి నుండి బయటపడవచ్చు అని ఈ క్యాన్సర్ పై అగాహన కలిగి దైనందినచర్యలలో కొన్ని మార్పులు చేసుకోవటం వలన క్యాన్సర్ మహ్మమారి నుండి బయట పడవచ్చని ఆయన తెలిపారు. అదే విధంగా మెడికల్ ఆంకాలజిస్ట్, మరియొక డైరక్టర్ అయినటువంటి డాక్టర్ మద్ది రాహుల్ నారాయణ్ మాట్లాడుతూ అన్ని క్యాన్సర్లు ప్రాణాంతకం కాదని, అన్ని క్యాన్సర్ లకు కీమో, రేడియేషన్లు తప్పనిసరిగా చేయవలసిన అవసరం లేదని, అది వ్యాధి తీవ్రతను బట్టి నిర్ణయించబడుతుందని, ఈ క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే మందులతో, ట్రీట్మెంట్ తో నయం చేయవచ్చునని ఆయన తెలిపారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ తిప్పని సుమిత్ర మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని అలవాట్లతో సంబంధం లేకుండా మహిళలు ఈ మహమ్మారి బారిన ఎక్కువగా పడుతున్నారని, ప్రస్తుత కాలం మహిళలో సాధారణంగా రొమ్ము క్యాన్సర్ లు, గర్భాశయ, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ల బారిన పడుతున్నారని, కొన్ని స్త్రీయ పరీక్షల ద్వార రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చని, అదేవిధంగా 40యేండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని దాని వలన ముందే క్యాన్సర్ ను గుర్తించటం ద్వార దానిబారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు. ముగింపు కార్యక్రమంలో డాక్టర్ అవినాష్ తిప్పని మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకొని ఫిబ్రవరి 4వ తేది నుండి మార్చి 4వ తేదీ వరకు వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇది నెల రోజుల పాటు కొనసాగుతుందని, దీనిని అందరూ సద్వినియోగం పరచుకోవాలని ఆయన అన్నారు. ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ స్థాపించి సంవత్సరం పూర్తి అయినది. ఈ సంవత్సర కాలంలో 80% మందికి ఉచిత వైద్యం అందించటం జరిగిందని, దీనికి కొనసాగింపుగా ప్రతి నెల క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాలను మరియు అవగాహన సదస్సులను నిరంతరాయంగా నిర్వహిస్తామని ఈ సమాజం నుండి క్యాన్సర్ ను పాలద్రోలటానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యబృందంతో పాటు వరంగల్లోని ఫార్మసీ కాలేజీలు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, ఫ్యాకల్టీలు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, హన్మకొండ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా, మరియు లయన్ ఆర్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.