-కవిత ఆరోపణలు బీఆర్ఎస్ పెద్దలకు కనిపించడం లేదా?
`కౌంటర్ అటాక్ ఎందుకు చేయడం లేదు?

`కేవలం కేసీఆర్ కూతురు కావడం ఇంకా వరమేనా?
`సాక్షాత్తు కేసీఆర్ నే కవిత టార్గెట్ చేస్తోంది?

`మిషన్ భగీరద మీద ఆరోపణలు చేస్తోంది?
`కాళేశ్వరం లో అవినీతి జరిగిందంటోంది?
`జిల్లాల పర్యటనలో బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తోంది?
`నాయకులంతా అవినీతి పరులైతే పార్టీ బతికి బట్ట కడుతుందా?
`పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఒక్క మాట కూడా కవిత మాట్లాడడం లేదు?
`పార్టీకి పని చేస్తున్నవారిని టార్గెట్ చేస్తున్నారు?
`ఉద్యమ కాలం నుంచి పార్టీ కి సేవ చేస్తున్నవారిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు?
`జనం బాటలో ప్రభుత్వాన్ని పల్లెతు మాట అనడం లేదు?
`బీఆర్ఎస్ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదు?
`కవిత కు బీఆర్ఎస్ అదినాయకత్వం భయపడుతోందా?
`కవిత ఆరోపణలు పార్టీకి తీరని నష్టమే?
`ఉపేక్షిస్తే మొదటికే మోసమే?లేవకుండా మునగడం ఖాయమే?
`‘‘కవిత’’ వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రజలెవరు పట్టించుకోవడం లేదు?
హైదరాబాద్, నేటిధాత్రి: చిన్నపిల్లాడు చీపురు పుల్లతో కొట్టిననాడే వద్దని చెప్పకపోతే రోకలి బండతో కొట్టే రోజు కూడా రావొచ్చు. ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత చేస్తున్నది కూడా అదే. ఆమె పదే పదే తలుపు చెక్కతో కొడుతుంటే బిఆర్ఎస్ నాయకులు దెబ్బలు ఓర్చుకుంటున్నట్లే వుంది. బిఆర్ఎస్ నాయకులను కవిత అన్నన్ని మాటలు అంటుంటే ఎవరు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న సమాజం నుంచి కూడా ఉత్పన్నమయ్యే రోజు వస్తుంది.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. కాన్సర్ కణితికి వెంటనే చికిత్స చేయకపోతే ఒళ్లంతా పాకుతుంది. ప్రాణం హరిస్తుంది. ఇక్కడ పార్టీకూడా అంతే. ఎందుకంటే ఆమె టార్గెట్ చేస్తున్న నాయకులంతా ఎవరో చిన్నా చితకా నాయకులు కాదు. అడ్రస్ లేని వాళ్లు కాదు. ఉద్యమకారులు. తెలంగాణకోసం పోరాటం చేసిన వాళ్లు. పార్టీ కోసం ఇటుక రాళ్లై మోస్తున్నారు. భుజాలు నొప్పి పెట్టేలా పార్టీ జెండాలను మోసిన వారు. పార్టీ కోసం అనేక ఇబ్బందులు,సమస్యలు, కేసులు ఎదుర్కొన్నవారు. పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్న వారు. పార్టీయే ప్రాణంగా రాజకీయాలు చేస్తున్న వారు. అన్నింటికన్నా ముఖ్యంగా కేసిఆర్‌ను దేవుడుగా కొలుస్తున్నవారు. అలాంటి నాయకులను ఏరి కోరి ఎంచుకొని కవిత విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. వారిని ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగతంగా మారిపై బురద జల్లుతున్నారు. కడుక్కోండి అని సవాలు చేస్తున్నారు. పెద్ద సారు కూతురు కదా! అని నాయకులు ఓపిక పడుతుంటే మరింత రెచ్చగొడుతున్నారు. వాళ్లు నిజంగానే నోరు తెరిస్తే కవిత రాజకీయం ఏమౌతుందో ఆమె రాజకీయం ఏమౌతుందో అర్దం కాదు. ఏ నాయకులకైనా సహనం కొంత వరకే వుంటుంది. అయినా కవిత పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నానని అనుకుంటున్నారు. కాని నేరుగా కేసిఆర్‌పైనే అస్త్రాలు సంధిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే ఎవరైనా తర్వాత తండ్రి పెంపకం గురించి మాట్లాడుకుంటారు. కుటుంబం మీదనే నిందలేస్తారు. ఇప్పుడు కవిత చేసే విమర్శలు కూడా నేరుగా కేసిఆర్‌కే తగిలేలా చేస్తున్నారు. ఆమె తెలిసి మాట్లాడుతున్నారో..తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సమాజంలో రెచ్చగొట్టే వాళ్లు అనేక మంది వుంటారు. చిచ్చులు పెట్టే వారు వుంటారు. వారి మాటలు నమ్మితే మోసపోయేది మా మాటలు విన్నవాళ్లే అనేది కవితకుతెలియంది కాదు. ఒక వేళ కవిత ఇన్ని రకాల విమర్శలు చేసి, ఆరోపణలు చేసి పార్టీని భ్రష్టు పట్టించాలని చూస్తుంటే ఇంకా ఓపిక పడుతున్నారు. ఒక్కసారి వాళ్లుంతా నోరు తెరిచినా చివరికి అవి కూడా కేసిఆర్‌కే తగులుతాయి. ఆ విషయాన్ని ఆమె మర్చిపోతోంది. తాను కేవలం నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తున్నానన్న భ్రమల్లో వున్నట్లున్నారు. బిఆర్ఎస్ నాయకుల ఓపిక నషించి కవితనపై కేసుల విషయం ప్రస్తావిస్తే, కవిత కడిగిన ముత్యం అని కేసిఆర్ చెప్పిన మాటకూడా అబద్దమని తేలుతుంది. అంతిమంగా తన తండ్రి, పార్టీ అద్యక్షుడు కేసిఆర్‌కే అప్రదిష్ట వస్తుంది. పార్టీ ఓడిపోయినా, కేసిఆర్ ఇమేజ్ను ఎవరూ చెరపలేకపోయారు. ప్రజల్లో కేసిఆర్‌కు వున్న ఆదరణ తగ్గించలేకపోయారు. కేసిఆర్‌ను ఇంకా తెలంగాణ సమాజం తెలంగాణ పిత అనే గౌరవిస్తోంది. కాని కవిత నాయకులను టార్గెట్ చేసి తన తండ్రిని దృతరాష్ట్రున్ని చేస్తోంది. పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు కేసిఆర్‌కు తగిలేలా చేస్తున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో యాత్ర చేస్తూ కేసిఆర్‌ను విమర్శించారు. అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా వుంటూ తెలంగాణతో నీకేం సంబందం షర్మిలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మేం మేం విమర్శించుకుంటాం. తెలంగాణ రాజకీయాలు మాట్లాడడానికి నువ్వెవరు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. కొట్టుకున్నా,తిట్టుకున్నా మేమంతా ఒక్కటే..మధ్యలోకి రావడానికి నువ్వెవరు? అని అన్నారు. అలాంటిది కవితనే ఇప్పుడు నేరుగా పార్టీ నాయకులను విమర్శిస్తూ పోతే అది కేసిఆర్‌కు నమర్దా కాదా? ఆయన పరువుకు భంగం వాటిల్లదా? పార్టీ వుంటే ఎంత? పోతే ఎంత? అన్నప్పుడే పార్టీ నాయకుడు కేసిఆర్ గ్రహిస్తే పరిస్దితి ఇంత దూరం వచ్చేదేమీ కాదేమో? తెలంగాణ ప్రజలు కేసిఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ తింటే తిన్నారేమో? నీళ్లైంతే ఇచ్చారు. రైతులను ఆదుకున్నారు. కాళేశ్వరం కట్టి, రైతులను బతికించారని అంటుంటే ఆ మాటలు కవితకు వినిపించడం లేదా? కేసిఆర్ దేవుడు అంటూ తెలంగాణ సమాజం చెప్పుకుంటున్న మాటలు కవిత చెవిని చేరడం లేదా? తెలంగాణ ఉద్యమానికి కేసిఆర్‌తో తొలి అడుగు వేసిన హరీష్‌రావు మొదటి నుంచి ఉద్యమంలో లేరని కవిత చెబితే జనం నమ్ముతారా? అసలు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కవిత వున్నారా? కవిత తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడొచ్చారన్నది చరిత్రలో లేదా? కవిత చెప్పే మాటలనే జనం నమ్ముతారనుకోవడం కవిత భ్రమ. ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కానటువంటి ప్రాజెక్టు నిర్మాణం కాళేశ్వరం. అలాంటి కాళేశ్వరం నిర్మాణం కోసం హరీష్‌రావు ప్రాజెక్టు వద్ద ఎన్ని నిద్రలు చేశారో కవితకుతెలియదా? ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో పగలు పరిశీలించేందుకే వెళ్లని మంత్రులు దేశంలో అనేక మంది వున్నారు. కాని హరీష్ రావు ఒక్కరు మాత్రమే పగలు రాత్రి అనే తేడాలేకుండా పనులు పర్యవేక్షించారు. సమీక్షించారు. రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఒక యజ్ఞంలా కాళేశ్వరం నిర్మాణం కోసం కష్టపడ్డారు. ఆ కష్టాన్ని చూసి అప్పటి గవర్నర్ హరీష్‌రావును ఏకంగా కాళేశ్వరరావు అని కీర్తించారు. ఆఖరకు పిసి ఘోష్ కమిటీ కూడా కాళేశ్వరంలో అవినీతిని గుర్తించలేకపోయింది. కాని కవిత మాత్రం లేనిపోని రాద్దాంతం చేస్తోంది. తెలంగాణ సమాజమంతా కాళేశ్వరం వల్లనే తాము బతుకుతున్నామని చెబుతుంటే కవిత కాంగ్రెస్ కళ్లతో చూస్తోంది. కేవలం పార్టీ మీద ఆదిపత్యం కోసం ప్రయత్నం చేసి ఆఖరుకు బైటకు వెళ్లేదాకా తెచ్చుకున్నది. అయినా కవిత తన సొంత బలం మీద రాజకీయాలు చేయాలనుకుంటే ప్రస్తుతం పాలనలో వున్న కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలి. ఆరుగ్యారెంటీల మీద మాట్లాడాలి. ఆరు గ్యారెంటీ అమలు కోసం ఉద్యమాలు చేయాలి…కేటిఆర్, హరీష్‌రావులు క్షేత్రస్దాయిలో వుండాలని ఉచిత సలహాలు ఇస్తూనే, వారినే టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ పోతే కవితను చూడడానికే కాదు, కవిత మాటలు వినడానికి కూడా జనం ఆసక్తి చూపరు. అందుకే ఈ మధ్య కవిత జనం బాటకు జనాలు రావడం లేదు. పలిచినా ఎవరూ రావడం లేదని జాగృతి నాయకులు, నేరుగా కవితకే చెబుతున్న సంబాషణలు వైరల్ అయ్యాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం తెలంగాణలో సాగు లేదు. నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఊళ్లలో జనం లేరు. వలసలతో ఊరంగా వల్లకాడులా వుండేది. ఏ ఇంటిని చూసినా ఇళ్లకు తాళముండేది. వలసలు పోయిన ఇండ్ల ముందు పొక్కిలి వుండేది. ఊర్లలో నిర్మాణుష్యం తాండవించేది. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. మిషన్‌కాకతీయతో చెరువులు నిండడంతోనే సాగుమొదలైంది. కాలేశ్వరం నిర్మాణంతో తెలంగాణ కళకళలాడిరది. ఒకప్పుడు తిండికేడ్చిన తెలంగాణ రైతు దేశానికి అన్నం పెట్టేంత ఎదిగాడు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకుంటున్నాడు. సరిగ్గా పన్నెండేళ్ల కింద పగలు చూద్దామన్నా కరంటు లేదు. రాత్రి వెలుగు లేని రోజులు తెలంగాణ చూసింది. అలాంటిది ఆరు నెలల్లో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతూ మెరిసిపోయింది. అలాంటి ప్రగతిని ఈతరం తెలంగాణ చూస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. ప్రపంచంలో ఇంత శీఘ్రమైన ప్రగతి జపాన్‌లో కూడా జరగలేదు. అలాంటి బిఆర్ఎస్ పాలన అనుకున్నంత ప్రగతి జరగలేదని కవిత చెప్పడమంటే కళ్లుండి చూడలేని తనమే.. రాజకీయ కుళ్లును కంటి నిండా పెట్టుకోవడమే? కవిత సొంత పార్టీ పెట్టుకొని రాజకీయం చేసి, ఎదిగితే ఎవరూ కాదనరు. ఎవరి అండా లేకుండా నాయకురాలిగా రాణిస్తే అందరూ సంతోషిస్తారు? కాని హరీష్‌రావు లాంటి నాయకుల మీద నిత్యం విషం చిమ్ముతూ పోతుంటే జనమే మెచ్చరు. బిఆర్ఎస్లో నాయకులు కార్యకర్తలందరూ కేసిఆర్‌కు కొడుకులు, కూతుళ్ల లాంటి వారే! కేసిఆర్‌ను కొలిచేది వాళ్లే. పార్టీని కాపాడుకునేదివాళ్లే..కేసిఆర్‌ను మళ్లీ గెలిపించుకునేది కూడా వాళ్లే. కవిత ఒక్కరి కళ్లకు వెలుగు కనిపించపోతే, తెలంగాణ చీకటైపోయినట్లు కాదు. తెలంగాణ రాజకీయాలకు కవితకు లేదు చోటు!!
