4 సీట్లకు 40 మంది!

-ఎమ్మెల్సీ ఎన్ని’’కల’’ నెరవేరేది ఎవరికి.

-నాలుగు సీట్లలో సామాజిక న్యాయం సాధ్యమేనా!

-ఎమ్మెల్సీలెవరికి దక్కేనో!

-అద్దంకికి అడ్డంకులు తొలిగేనా?

-మరో వాయిదా పడదన్న గ్యారెంటీ వచ్చేనా?

-సీనియర్లు అడ్డుపడితే మొదటికే మోసం వచ్చేనా?

-ఆశావహులు చాలా మంది వున్నారు.

-చాలా మంది నేతలు కాచుకొని కూర్చున్నారు.

-పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వున్నారు

-పార్టీ అధికారంలోకి రావడంలో పాత్ర వున్న వారున్నారు.

-వారిని కాదని సామాజిక సమీకరణాలంటే సాధ్యపడేనా!

-పదుల సంఖ్యలో క్యూలో వున్నారు.

-అందరూ మాకే కావాలంటున్నారు!

-ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు!

-అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు.

-అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే!

-నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే.

-భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేయడమే!

-మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరమే.

-లేని లీకులతో మీడియా చేసేది గందరగోళమే!

-పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువే.

-రేటింగ్‌ కోసం పాకులాటలో లేని ఆశలు రేపడం అలవాటే.

-గందరగోళం సృష్టించి వార్తలు వండిరచడమే!

-అభ్యర్థుల పేర్లు కూడా డిసైడ్‌ చేసేది మీడియానే.

-వాళ్లకు టికెట్‌ రాకపోతే అన్యాయం జరిగిందని లొల్లి చేసేది మీడియానే.

-నాయకులంతా నిమిత్త మాత్రులే.

-ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

 

తెలంగాణలో శాసన మండలి ఎన్నికకు మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు గత ఎడాది కాలంగా బిజీబిజీగానే వున్నారు. అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలంటూ అభ్యర్థనలు పంపుతూనే వున్నారు. వీలు చిక్కినపుడుల్లా ఎక్కే ఫ్లైట్‌ దిగే ఫ్లైట్‌ అన్నట్లు డిల్లీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటూనే వున్నారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటూనే వున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ రానే వచ్చింది. అందులో నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ వచ్చే అవకాశం వుంది. రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. మొదట్లో వున్న లిస్ట్‌కు ఇప్పుడు వినిపిస్తున్న లిస్ట్‌కు పొంతనే లేదు. ఒకింత చాంతాడంత పెరిగిపోయింది. అయినా ఎమ్మెల్సీలెవరికి దక్కేనో! అన్నది ఉత్కంఠగా మారిపోయింది. ఇక ముందుగా చెప్పాల్సి వస్తే కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన జీవన్‌ రెడ్డికి ఆ అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఆయనే వద్దన్నారన్న ప్రచారం కూడా వుంది. పైగా ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వినయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ దరి చేరారు. ఇది జీవన్‌ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. అయినా కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌ రెడ్డి అలకను పట్టించుకోలేదు. కానీ ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం అనుకుంటే తప్ప ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. ఇక మొదటి నుంచి అన్యాయం జరుగున్న నాయకుడు అద్దంకి దయాకర్‌. ఈసారైనా అద్దంకికి అడ్డంకులు తొలిగేనా? అనే ప్రశ్న వుండనే వుంది. ఆయన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భరోసా మీదనే ఆధారపడి వున్నారు. అయినా ఎక్కడో ఏదో అనుమానం ఆయన వ్యక్తం చేయకపోయినా లోలోన గుబులు వుండనే వుంది. తుంగతుర్తి నియోజకవర్గం తనదే అన్న ధీమాతో ఆది నుంచి వున్నారు. 2019 ఎన్నికలలో అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఒక దశలో అద్దంకి దయాకర్‌ గెలిచినట్లే వార్తలు వచ్చాయి. ఆఖరు క్షణంలో ఫలితం తారుమారైంది. అప్పటి నుంచి ఆయన తుంగతుర్తిని వీడలేదు. ఆ నియోజకవర్గం ఎప్పటికైనా నాదే అని పనులు చేసుకుంటూ వెళ్లారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకే టికెట్‌ అధిష్టానం ఇచ్చింది. ఇందులో ఏం జరిగిందనేది అద్దంకికి తెలుసు. పార్టీకి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా అద్దంకికి టికెట్‌ వచ్చినట్లే అనుకున్నారు. వరంగల్‌ సీటు వస్తుందని ఆయన కూడా భరోసాతోనే వున్నారు. ఆఖరు నిమిషంలో కడియం కావ్యకు టికెట్‌ వెళ్లింది. అద్దంకి అలా మరో సారి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా అద్దంకి ఎమ్మెల్సీ అవుతారా లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొనే వుంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డికి పాద నమస్కారం కూడా చేసిన సందర్భం వుంది. ఇక ఇప్పుడు ఆయన భవిష్యం తేలకపోతే భవిష్యత్తు రాజకీయం కష్టమే. కాంగ్రెస్‌కు వచ్చేవే నాలుగు స్థానాలు. బిసి నినాదం బలంగా వినిపిస్తోంది. ఆ నాలుగు మాకే కావాలని బిసిలు కోరుతున్నారు. అందులో కనీసం రెండు సీట్లైనా బిసిలకు పోతే అద్దంకి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మిగులుతోంది. పైగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కూడా రేస్‌లో వున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సీట్లు ఎక్కువ ఇచ్చారన్న వాదన వుండనే వుంది. వరంగల్‌ పార్లమెంటు విషయం అన్యాయం జరిగిన దొమ్మాటి సాంబయ్య కూడా సీటు నాకే ఇవ్వాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అద్దంకికి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే ఇక ఆయన నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి. ఒకవేళ అద్దంకి అదృష్టం బాగుండి, ఎమ్మెల్సీ అయితే మాత్రం మంత్రి కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందువల్ల అద్దంకిని అడ్డుకోవడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా తమ వంతు రాజకీయం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్సీ అయితే మంత్రి వర్గ విస్తరణలో ఆ ఇద్దరు నేతలు ఆశలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నాలుగు స్థానాలలో సామాజిక న్యాయం సాధ్యమయ్యేనా! అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గం నుంచి మంత్రులు ఎవరూ లేరు. మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఎమ్మెల్సీ రేసులో వున్నారు. ఈసారి అవకాశం వస్తే మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. పైగా నిజామాబాదు ఉమ్మడి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు దక్కాల్సి వుంది. కానీ త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగాల్సి వుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సొంత గూటికి వచ్చేశారు. అయినా ఆయన అంత సంతోషంగా లేరు. సుప్రీంకోర్టు లో వున్న కేసులో తీర్పు ఎలా వుంటుందో చెప్పలేనిది. అందువల్ల హైదరాబాద్‌ కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం కోసం ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తారనే అంటున్నారు. ముఖ్యంగా ఫిరోజ్‌ ఖాన్‌ ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. అంతే కాకుండా మాజీ టీం ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్‌ లో కొనసాగుతున్నారు. యూపి లోని ఫిరోజాబాద్‌ నుంచి రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ అనుభవంతో పాటు అధిష్టానం వద్ద అజహరుద్దీన్‌కు మంచి వెయిట్‌ వుంది. ఇక సీనియర్లలో ఎక్కువగా బిసిలు వున్నారు. వారిలో ఇప్పటికీ ఆక్టవ్‌గా వున్న వి. హనుమంత రావు ఫ్లీజ్‌ అంటున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ నాకేం తక్కువ అంటున్నాడు. పైగా రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు అనే గుర్తింపు వుంది. వీళ్లతో పాటు సికింద్రాబాద్‌ మాజీ ఎంపి. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ పడుతున్నాడు. సీనియర్లు అడ్డుపడితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మొదటికే మోసం వచ్చేనా? ఎందుకంటే ఆశావహులు చాలా మంది వున్నారు. సీటు మాకంటే మాకే అంటూ కాచుకొని కూర్చున్నారు. పార్టీ కోసం ఇంత కాలం త్యాగాలు చేసిన వారు వున్నారు. అంతే కాకుండా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసిన వాళ్లు వున్నారు. వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నాయకులు వున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, మరొకరు ఖైరతాబాద్‌ నియోజకవర్గం పార్టీ ప్రెసిడెంట్‌ రోహిన్‌ రెడ్డి. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని కూడా అంటున్నారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా మారి పూర్తి సీట్లు సాధించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. గత పార్లమెంటు ఎన్నికలలోనే ఖమ్మం సీటు ప్రసాద్‌ రెడ్డికి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడే ఎమ్మెల్సీ హామీ పార్టీ ఇచ్చిందనేది సమాచారం. ఇన్ని చిక్కు ముడుల మధ్య సామాజిక సమీకరణాలంటే సాధ్యపడతాయా! అధికారంలో వున్నప్పుడు సామాజిక సమీకరణాలతో అన్యాయం జరిగితే నాయకుడు ఊరుకుంటారా? తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ లో పదుల సంఖ్యలో క్యూలో వున్నారు. అందరూ మాకే కావాలంటున్నారు! ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు! అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే! అన్న మాటలే వినిపిస్తున్నాయి. నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే అని అంటున్నారు. భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేస్తామంటే నాయకులు సంతృప్తి చెందుతారా? ఇక సందిట్లో సడే మియా లాగా మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరం నింపుతోంది. లేని లీకులతో మీడియా చేసేది గందరగోళం సృష్టిస్తోంది. పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువైపోయింది. నాయకులంతా నిమిత్త మాత్రులే. ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!