శ్వాస తీసుకోవడం అనేది మనుషులతోపాటూ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకూ అత్యంత సహజమైన ప్రక్రియ. ఊపిరి ఆగిపోతే జీవం ఆగిపోతుంది. అయితే అక్సిజన్ అయిపోతే ఏం జరుగుతుందో తెలుసా…? ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. భూమిపై ఆక్సిజన్ అయిపోవడం అటుంచితే ప్రాణవాయువు సరఫరా ఒక ఐదు సెకన్లు ఆగితే ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుందనే విషయం తెలుసా? ఆక్సిజన్ ఆగితే.. ఓజోన్ పొర రక్షణ పోతుంది. ఫలితంగా సూర్యుడి అతినీలలోహిత కిరణాలు తాకి మన చర్మం కాలిపోతుంది. అంతేకాదు ఎయిర్ ప్రెజర్ ఆగి పోవడంతో చెవులు దెబ్బతిని వినికిడి లోపం తలెత్తుతుంది.
మనమే కాదు వాహనాలు, భవనాలూ కూడా ఆక్సిజన్ లేకుండా మనలేవు. కంబషన్ ఇంజిన్లలో ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆ వాహనాలు ఆగిపోతాయి. విమానాలు, కార్లు, బైకులు, ట్రక్కులు ఈ కోవకే వస్తాయి. మరోవైపు ఆక్సిజన్ ఆగితే వెల్డింగ్ అవసరం లేకుండానే లోహాలు అతుక్కుపోతాయట. ఎందుకంటే సాధారణంగా లోహాలపై ఆక్సిడేషన్ వల్ల ఓ పొర ఏర్పడుతుంది. అది లేకపోతే కరిగించే అవసరం లేకుండానే లోహాలు అతుక్కుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.