ఈ చేత్తో లంచాలు..ఆ చేత్తో అవార్డులు!

`ఆరోపణలు వున్న ఉద్యోగులకే ఎక్కువ పురస్కారాలు?

`ఉద్యోగులలో జరుగుతున్న చర్చ.

`ఒకటికి నాలుగు సార్లు అవార్డులు తీసుకుంటున్నది వాళ్లే?

`గతంలో ఏసిబికి చిక్కిన అధికారులలో అవార్డులు పొందిన వారే ఎక్కువ?

`అన్ని శాఖలలో అదే తీరు!

`అవార్డులు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారా?

`అవార్డులు ప్రకటించకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రకటిస్తున్నారా?

`పురస్కారాలు కూడా అంగట్లో సరుకులయ్యాయని విమర్శలు వినిపించడం లేదా?

`అవార్డులు ప్రభుత్వం సిఫారసుల ప్రకారం ప్రకటిస్తున్నారా?

`పై అధికారుల మెప్పు పొందిన వారికే ఇస్తున్నారా?

`ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి?

`నిజాయితీ అధికారులలో ఆందోళనలు కూడా నెలకొన్నాయి!

`ప్రతిసారీ ఇదే తంతు నిజాయితీ అధికారులు పక్కకు…

`పైరవీకారులకే పురస్కారాలు అనేది అందరూ చెప్పుకునేదే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక అధికారికి ఉత్తమ పురస్కారం వచ్చిదంటే ఆ ఉద్యోగి తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్దిగా నిర్వర్తిస్తున్నాడని అర్ధం. ఉద్యోగులకు ఏటా ఇచ్చే పురస్కారం ఆదర్శవంతమైన జీవితానికి సంకేతం. తోటి ఉద్యోగులు ఆ ఉద్యోగిని ఆదర్శంగా తీసుకొని స్పూర్తిని నింపుకోవాలని సంకేతం. ప్రతి ఉద్యోగి ఈ ఏడాది అందరికంటే ఎక్కువ సేవలను అందించి శాఖకు మంచి పేరుతోపాటు, తాను కూడా నీతి నిజాయితీలకు నిలువెత్తు సంతకం అన్నట్లు నిరూపించుకునేందుకు పడే తాపత్రయంగా మల్చుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నామన్న సోయితో పనిచేయాలి. పనుల మీద కార్యాలయాలకు వచ్చిన ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడం, వాటి పరిష్కారం వెంటనే చూపాలి. ఇదీ ఒక ఉద్యోగి నుంచి ప్రజలు కోరుకునేది. మరి వ్యవస్దలు అలాగే వున్నాయా? అలాగే సాగుతున్నాయా? ప్రతి ఉద్యోగి ఆత్మ ప్రభోతంతో పని చేయకపోయినా సరైన బాద్యత నిర్వర్తిస్తున్నాడా? ఉద్యోగులు వున్నదే ప్రజలకు సేవ చేయడానికి అని గుర్తెరిగి పనిచేస్తున్నారా? అంటే సమాధానాలు వెతుక్కొవాల్సి వస్తుందంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. అతిశయోక్తి అసలే కాదు. అయితే ఇక్కడ అందరూ ఉద్యోగులు అలాంటి వారే అనడం కూడా కరక్టు కాదు. కాని మెజార్టీ ఉద్యోగులు అలాగే వున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికీ నిజం. వంద మంది ఉద్యోగులల్లో 90శాతం అవినీతికి పాల్పడుతున్నవారే? అని సాక్ష్యాత్తు ఉద్యోగులే అంటున్నారు. ఇలాంటి నిజాలు ఉద్యోగుల మీద ఆరోపణలు కాదు…అక్షర సత్యాలు. అందుకే ఉద్యోగ వ్యవస్ధ ప్రజలు భయపడుతున్నారు. బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయం గడప తొక్కాలంటే గడగడలాడుతున్నారు. గుండెలు అదిమి పట్టుకొని కార్యాయాల్లో అడుగులు పెడుతున్నారు. ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో అడుగు పెట్టగానే మొదట బెదించేంది అటెండర్‌. అవును ఇది అనుభవించని వారు ఎవరూ వుండరు. కార్యాలయానికి వచ్చిన వారిని ఎం కావాలి అని ఎవరూ అడగరు. ఎందుకొచ్చావ్‌ అంటూ హూంకరించినంత పని చేస్తారు. సార్‌ కోసం వచ్చామని చెబితే లేరు..రారు…సార్‌ బిజీగా వున్నారు..రేపు..రా…మాపు రా…పది సార్లు తిరిగినా గాని అధికారి దర్శన బాగ్యమే కాని కార్యాలయాలే ఎక్కువ. నిత్యం అధికారులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడమే కనిపిస్తుంది. పట్టుమని పది నిమిషాలు కుర్చీలో కూర్చొని పనిచేయడం అన్నది వుండడం లేదు. కాని పది పైసలు వస్తున్నాయంటే మాత్రం పద గంటలు కూర్చుంటారు. జేబు నింపుకొని వెళ్తుంటారు. ఇది నిత్యకృత్యమయ్యే శాఖలు కొన్ని వున్నాయి. అలాంటి శాఖల్లో ఉద్యోగులకు పురస్కారాలు అంటే ఎంత విచిత్రం. ఈ చేత్తో లంచాలు నిత్యం తీసుకుంటూనే వుంటారు. నిత్యం ప్రజల చేత ఆరోపణలు ఎదుర్కొంటూనే వుంటారు. కార్యాలయం మెట్లు ఎక్కిన ప్రతి వ్యక్తితో బేరం కుదుర్చుకుంటూనే వుంటారు. అడుక్కోడంలో కూడా బెదిరింపులు జత చేసి బాజాప్తా బాకీ వున్నట్లే వసూలు చేసుకుంటారు. ప్రజల చేత వంగి వంగి దండాలు పెట్టించుకుంటారు. కాని కనికరం అన్నది ఇసుమంత కూడా వుండదు. అలాంటి అధికారులు మన ఉద్యోగ వ్యవస్ధలో కొకొల్లలున్నారు. మేం నిజాయితీ పరులమని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలిగే ఉద్యోగులు ఎంత మంది వున్నారో చెప్పడం కష్టం. అది కూడా కొత్తగా ఉద్యోగాలలో చేరే వారు మాత్రమే కొంత భాగం నిజాయితీగా నడుకుంటారు. వ్యవస్ద అంతా ఇంతేలే అని తెలుసుకున్నాక, అంతకు ముందు వాళ్లకన్నా దోపిడీకి ఎగబడుతుంటారు. మరి ఏటా ప్రభుత్వం ప్రకటించే పురస్కారాలు ఎవరు అందుకుంటున్నారు? అని ఎవరినైనా కదిలిస్టే ఠక్కున వినబడే సమాధానం అందరికీ తెలిసిన విషయమే. ఇదీ మన ఉద్యోగ వ్యవస్దలో వున్న గొప్ప తనం. గొప్ప గుణం. అవినీతిని విచ్చలవిడిగా అదొక హక్కుగా మార్చుకున్న అధికారులకు ఏటా పురస్కారాలు వచ్చిన సందర్భాలు కొకొల్లలున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గతంలో పోలీసు శాఖలో ఓ ఉద్యోగి మీడియా వాళ్లు కలిసిన ప్రతి సందర్భంలోనూ సమాజం ఎంతో నాశనమౌతోంది. మానవత్వం కరువౌతోంది. మంచితనం లేకుండాపోతోంది. ప్రజలకు సేవ చేయాలన్న తపనే ఉద్యోగుల్లో వుండడం లేదు. తాను చదువుకునే సమయంలోనే ఒక వేళ నేను ఉద్యోగినే అయితే జీవితంలో ఒక్క రూపాయి కూడా ఎవరి వద్ద తీసుకోకుండా పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను అంటూ సోక్రటీస్‌ లెవల్లో మీడియా ప్రతినిధులతో గొప్పలు చెప్పుకున్న ఓ పోలీస్‌ అధికారి అదే రోజు సాయంత్రం లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అదే రోజు మళ్లీ అదే మీడియా మిత్రుల మందు ఈ పోలీసు అధికారి దోషిగా నిలబడ్డాడు. ఇక్కడ విశేషమేమిటంటే తాను ఉత్తమ పోలీస్‌ అదికారిగా అనేక సార్లు పురస్కారాలు అందుకున్నానని చెప్పారు. పోలీసు వ్యవస్ధలో తనకంటే నిజాయితీ పరుడు లేడని చెప్పుకున్న రోజే అవినీతి శాఖ అధికారుల చేతికి చిక్కిన వారు ఒక్కరు కాదు..అనేక మంది ఉద్యోగులున్నారు. ఆ మధ్య ఓ రెవిన్యూశాఖకు చెందిన ఓ మహిళా ఉన్నతోద్యోగి జనవరి 26 నాడు ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకున్నారు. ఆ మరుసటి రోజు ఆమె గురించి మీడియాలో గొప్ప కథనాలు వచ్చాయి. అదంతా ఆమెకు పురస్కారం వచ్చిన సంతోషంలో మీడియా ప్రతినిధులకు తన గొప్పలన్నీ వివరించింది. పెద్దఎత్తున ఆమె నీతి, నిజాయితీ గురించి చెప్పుకున్నది. ఆ మరునాడు అన్ని న్యూస్‌ పేపర్లలో ఆమె గొప్పదనం గురించి, గొప్ప గుణం గురించి వార్తలు వచ్చాయి. సిరిగ్గా ఆ మరునాడే ఆమె అవినీతి నిరోధక శాఖ అదికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడిరది. ఏ చేతులతో ఇరవై నాలుగు గంటల మందు గొప్ప అధికారి అని రాసిన చేతులతోనే జర్నలిస్టులు ఆమె అవినీతి సామ్రాజ్యాన్ని రాయాల్సి వచ్చింది. అంటే ఇలా అవినీతికి చుట్టాలుగా మారిన ఉద్యోగులు పైరవీలతో పురస్కారాలు సంపాదించుకుంటారు? అనే ప్రచారం పెరిగిపోయింది. తమ ఉద్యోగ జీవితంలో ప్రజల నుంచి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న అధికారుకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్రదినోత్సవాలలో ఉత్తమ ఉద్యోగులుగా పురస్కారాలు అందుకునే వార్తలు చూసి ముక్కున వేలేసుకుంటారు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు? అలాంటి ఉద్యోగులను పురస్కారాలకు ఎంపిక చేసిన వాళ్లు గొప్పవాళ్లా? అవినీతి పరులమని తెలిసి కూడా పురస్కారాల కోసం ఎంపిక చేయాలని పైరవీలు చేయించుకునేవారు గొప్ప వాళ్లో అర్ధం కాకుండాపోయింది. ఏటా వరుసగా కూడా పురస్కారాలు పొందిన వాళ్లు ఎంతో మంది లంచాలు తీసుకొని పట్టుపడడం జరిగింది. ఇలా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడినా, మళ్లీ శాఖ పరమైన ఎంక్వౌరీలో మంచి ఉద్యోగిగా కూడా తోటి ఉద్యోగులతో చెప్పించుకొని ఉద్యోగాలు పొందిన వాళ్లు అనేకం వున్నారు. మళ్లీ పురస్కారాలు అందుకున్నవాళ్లున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగాలు కోల్పోయిన వారు కోర్టుకెక్కి, తాము ఇన్ని సార్లు ఉత్తమ పురస్కారాలు అందుకున్నామని, తమపై కక్షతో కొందరు పన్నిన కుట్ర మూలంగా ఇరుక్కుపోయామని తప్పుడు వివరణలు ఇచ్చుకొని,కోర్టును తప్పుతోవ పట్టించి ఉద్యోగాలు పొందిన వాళ్లు కూడా అనేక మంది ఉద్యోగులున్నారు. అసలు ఉద్యోగులకు పురస్కారాలు ఇచ్చే పరిస్దితుల్లోనే వ్యవస్ధలున్నాయా? కొన్ని శాఖల్లో అవినీతి లేకుండా ఒక్క క్షణం గడుస్తుందా? ఈ సంగతి పై అదికారులకు తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? అయినా ఇంకా ఈ పురస్కారాలు ఎందుకు? ప్రజల చేత తిరస్కారాలకు, తిట్లు, శాపనార్దాలు పడుతున్న ఉద్యోగులను పురస్కారాలకు ఎంపిక చేయొద్దన్న కనీస జిజ్ఞాస కూడా పై స్ధాయి ఉద్యోగులకు లేకుండాపోతోందా? ఎలాంటి ఎంక్వౌరీ లేకుండానే అవినీతి అధికారులను ఎంపిక ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అంతే కాదు పురస్కారాలు అందించేవారు కూడా అమ్ముడుపోతారన్న విమర్శలు లేవా? పురస్కారాలను అంగట్లో సరుకుల్లా కొనుక్కునేవాళ్లు కొనుక్కుంటుంటే, ప్రకటించేవాళ్లు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపించడం లేదా? పోలీసు శాఖలో అంటే ప్రాణాలకు తెగించి, కర్తవ్యాలను నిర్వర్తించే వారికి పురస్కారాలు అందుతున్నాయంటే గొప్పగా చెప్పుకోవాలి. కాని ఇతర శాఖల్లో రూపాయి లేకుండా ఫైలుపై సంతకం చేయని అధికారులకు పురస్కారాలు ఎందుకు అందిస్తున్నారో… అవలోకనం వద్దా? కనీసం పురస్కారాలలోనైనా అవినీతి మకిలి అంటకుండా చూసుకుందామన్న సోయి లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!