స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం… కాషాయ జెండా ఎగరవేస్తాం – బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ లోగడ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని, నేడు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ కొత్త రాజకీయ డ్రామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి రామడుగు మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాశాల సమావేశం రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్ నందు జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు గ్యారంటీలతో, 420 హామీలతో ప్రజలను ఆదుకుంటామని కాంగ్రెస్ మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. పథకాల అమలు కోసం దాదాపు రెండేళ్ల కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన పేరిట ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అరకోరపథకాలను అమలు చేస్తూ, ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి సక్రమంగా అమలైంది తప్ప, మిగతా ఏఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీ అరకోర చేసిందని, పింఛన్లు అందించడం లేదని, నిరుద్యోగ భృతిని అటకెక్కించిందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చెప్పిన లెక్కలేనన్ని హామీలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీవన్నీ ఉద్దెర ముచ్చట్లనే విషయం ప్రజలందరికీ అర్థమైందని, మాటల గారడితో ప్రజలను మోసగించడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి ప్రతిఫలం లభించిందని , అందుకే లోగోడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆప్రభుత్వానికి ఉద్యోగులు, పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ కాంగ్రెస్ సర్కార్ లబ్ధి పొందడానికి కుటిలప్రయత్నాలు, రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశంతో రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించే విధంగా బీసీ రిజర్వేషన్ ను చేపట్టిందన్నారు. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. జరగబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు దిమ్మదిరిగే ఫలితాలు అందిస్తారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం లభిస్తుందన్నారు. ప్రజలంతా బిజెపి మోదీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారన్నారు. గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటేలా తగిన కార్యాచరణలతో ముందుకు కొనసాగడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండలశాఖ అధ్యక్షులు మోడీ రవీందర్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, ఎన్నికల ప్రభరి జాడి బాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి,వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు, శక్తి కేంద్రం ఇంఛార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు.