Use Online Sand Booking System
మన ఇసుక వాహనం విధానాన్ని వినియోగించుకోవాలి
నిర్మాణదారులు మన ఇసుక వాహనం వెబ్సైట్, అప్లికేషన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
మన ఇసుక వాహన విధానంపై తహసీల్దార్లు, మైనింగ్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఇసుక తరలింపులో పారదర్శకత కోసం అమలు చేస్తున్న మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానాన్ని గృహ, ప్రభుత్వ పనుల నిర్మాణాదారులు వినియో గించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, మొబైల్ అప్లికేషన్, ఇసుక బుకింగ్స్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మైనింగ్ అధికారి, తహసీల్దార్లు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారితో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందుగా మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, మొబైల్ అప్లికేషన్ ఎన్ని బుకింగ్స్ వచ్చాయి అనే అంశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సెంటర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన మన ఇసుక వాహనం వెబ్సైట్, అప్లికేషన్ లో ఇందిరమ్మ ఇండ్లు, సొంత గృహ, ప్రభుత్వ పనుల నిర్మాణాదారులు జిల్లాలోని 15 ఇసుక రీచ్ ల నుంచి ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. నిర్ణీత పత్రాలు జత చేసి.. ఆన్లైన్ విధానం ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే వీలు ఉందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక తరలింపులో నేరుగా కూపన్లు ఇచ్చే విధానం నుంచి ఆన్లైన్ ద్వారా పొందే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. మన ఇసుక వాహనం విషయమై సమాచారం, వివరాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని, 040- 23120421/ 83339 23732 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అలాగే మెయిల్ ఐడీ helpdesk.tsmiv@cgg.gov.in ఉందని తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారి జారీ చేసిన దృవపత్రం జత చేయాలని, ఇతర ఇంటి నిర్మాణానికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత అధికారి జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు, ప్రభుత్వ పనులకు సంబంధిత కార్య నిర్వహణ ఇంజనీర్ జారీ చేసిన అనుమతి పత్రం జత చేయాలని సూచించారు. నిర్మాణదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఇసుక రీచ్ ఆఫీసర్ తమ ఆన్లైన్ లాగిన్లోకి వచ్చిన ఇసుక బుకింగ్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని, ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పనుల కోసం ఆయా నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఇంజనీర్లు సూచనలు చేయాలని సూచించారు. ప్రతి నిర్మాణ పనికి ఇసుక కోసం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.
సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి కుమార్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
