దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు.
నర్సంపేట,నేటిధాత్రి:
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి
విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన
స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 59వ వర్ధంతిని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది. దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్గి రాజేశాడని వర్ణించారు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.దొరల అణిచివేతకు,అరాచకాలకు వ్యతిరేకంగా,కౌలు,లెవీ రద్దు చేయాలని,కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడని బాబు తెలిపారు.ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది.ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైందన్నారు.ఈ నేపథ్యంలో కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది.ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్న క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటరూపం తీసుకున్నదని పేర్కొన్నారు.కాగా ఈ పోరాటంలో భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు. వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయన్నారు.ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉందన్నారు. మరోవైపు దేశంలో కార్పొరేట్ శక్తుల, మతోన్మాదుల కూటమి దేశాన్ని పట్టిపీడిస్తున్నదని,ప్రజా వనరులన్నిటిని దోచి బడా పెట్టుబడిదారుల ఖజానా నింపుతున్నదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, పరికి మధుకర్ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మండల, పట్టణ నాయకులు బుర్రి ఆంజనేయులు, పుచ్చాకాయల నర్సింహా రెడ్డి, నాయకులు లక్క రాజు, తోటకూరి రాజేష్, కందికొండ సంతోష్, వీరన్న, ప్రశాంత్, నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.