పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం
మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ
“నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా:
పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ అన్నారు. మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమిటనే అంశంపై పూర్తి విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా 13 మంది మృతదేహాల అచూకీ వెంటనే కనుగొనడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఇండస్ట్రియల్స్ ను రద్దు చేయాలని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరియు సిగాచి రసాయనిక పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.