Congress Failed to Deliver Promises: Challa Dharma Reddy
మేం చేసిందే తప్ప కొత్తగా చేసిందేం లేదు
అభివృద్ధి పనులు ఇంకా పూర్తి ఎందుకు కాలేదు
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల,నేటిధాత్రి
సోమవారం పరకాల పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి,చేసేది మరోటని,వారి పాలన మొత్తం అసత్య ప్రచారాలు,మోసాల పునాదుల మీద నడుస్తోందని ధ్వజమెత్తారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులకు రంగులు వేసి మళ్లీ ప్రారంభాలు చేయడమే కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అన్నారు.మా ప్రభుత్వంలో వేసిన శిలాపలకలను ధ్వంసం చేసి కొత్తవి పెట్టి శంకుస్థాపనలు చేయడం తప్ప,పరకాలలో కొత్తగా మంజూరైన అభివృద్ధి పనులు ఒక్కటైనా లేవని స్పష్టం చేశారు.సంక్షేమ పథకాలు గల్లంతయ్యాయని,కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా రెండు నెలల పెన్షన్లు,రైతుబంధు ఎగ్గొట్టి లబ్ధిదారులు,రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.కేసీఆర్ పాలనలో ఎక్కడా కొరత లేకుండా అందుబాటులో ఉన్న యూరియా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు లభించడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.స్థానిక ఎమ్మెల్యేకు పరకాలలో అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ, ప్రజల్లో తిరిగితే అభివృద్ధి ఉందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.ఒకసారి పరకాల ప్రజలను అడిగితేనే నిజం చెబుతారని అన్నారు.

రెండేళ్లుగా వంద పడకల ఆసుపత్రి,దామెర చెరువు మినీ ట్యాంక్ బండ్,ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్,డిగ్రీ కాలేజ్ ఎందుకు పూర్తికాలేదో స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దామెర చెరువులో ఉన్న బోట్ ఎటు పోయిందో కూడా ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.కాంగ్రెస్ అంటేనే స్క్యాములు,పర్సంటేజీల ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన చల్లా ధర్మారెడ్డి,సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు పరిపాలనపై పట్టు పూర్తిగా తప్పిందన్నారు.ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.మేడారంలో క్యాబినెట్ సమావేశం పెట్టినా జాతర పనులు ఇప్పటికీ పూర్తికాలేదని,అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని మండిపడ్డారు.ప్రజలు మళ్లీ బిఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని అన్నారు.వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,సొసైటీ,మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు, కో ఆప్షన్లు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
