నగర శివారులో నీటి జలగలు
* అజీజ్ నగర్ లో జోరుగా అక్రమ నీటి దందా
* భూగర్భ జలాలను తోడేస్తున్న అక్రమార్కులు
* సుమారు రోజు వందలాది ట్యాంకర్లతో నీటి తరలింపు
* నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలకు విక్రయం
* చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
* కోట్లలో సాగుతున్న అక్రమ నీటి వ్యాపారం
నేటిధాత్రి, రంగారెడ్డి :
గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్ నగర్ రెవెన్యూలో అక్రమ నీటి దందా జోరుగా సాగుతుంది. సుమారు 13 అక్రమ నీటి రవాణా ప్లాంట్లతో నిత్యం వందలాది ట్యాంకర్లతో నీటి రవాణా కొనసాగిస్తున్నారు.వేసవి రావడంతో శివారు రోడ్లన్నీ నీటి ట్యాంకర్ల మోత మోగిపోతుంది. వ్యవసాయ భూములు లీజ్ తీసుకుని ఇష్టానుసారంగా బోర్లు వేసి, విద్యుత్ లేని సమయంలో వ్యాపారానికి ఇబ్బంది లేకుండా జనరెటర్లు పెట్టి మరి అక్రమార్కులు భూగర్భ జలాలను తోడేస్తున్నారు. నిత్యం వందలాది ట్యాంకర్లతో జలాలను తరలిస్తు కోట్లు గడిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తూన్నారు. భవన నిర్మాణాలకు , వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు జంబో ట్యాంకర్లతో అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. వందలాది ఫీట్ల లోతులో భూమిని గుల్ల చేసి నీటిని పీలుస్తున్నారు. రెవెన్యూ అధికారులు తెలిసి పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా చిన్న తరహా ట్యాంకర్ల నుంచి జంబో ట్యాంకర్ల దాకా నీటిని తరలిస్తూన్న రెవెన్యూ, పోలీసు,జలమండలి శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ కనీస అనుమతులు తీసుకోకుండా భూగర్భ జలాలను తోడుతున్నారు. అక్రమ దందా కోట్లలో సాగుతున్నా..అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. నిబంధనలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వందలాదిగా అక్రమ బోర్లు వేసి భూగర్భ జలాలను దొంగిలిస్తున్నా తనిఖీలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు తనిఖీలు చేయకుండా బోర్ల యజమానులు మ్యానేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* అవసరమే ఆసరాగా… అందినకాడికి దోపిడీ
మాదాపూర్, నార్సింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచే వేసవి సీజన్ మొదలవుతుంది. నీటి ఎద్దడితో ట్యాంకర్ల అవసరం ఏర్పడుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ట్యాంకర్ల అవసరం రెండు, మూడింతలు పెరుగుతుంది. ఇదే అదనుగా వ్యాపారులు దర పెంచేస్తున్నారు. వర్షాలు పడేదాకా ఈ అక్రమ నీటి చోరీ దందాకు కొదవ ఉండదు. నిర్మాణంలో ఉన్న భవనాలు, వాణిజ్య సముదాయాలతో పాటు బహుళ అంతస్తుల భవనాలకు జంబో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. దూరం, డిమాండ్‌ను బట్టి ఒక్కో ట్యాంకర్‌ను రూ.వెయ్యి నుంచి రూ.10 వేల దాకా విక్రయిస్తున్నారు.
ఎండలు ముదురుతున్న కొద్దీ జంబో ట్యాంకర్‌ను రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా విక్రయిస్తారు. ఒక్క అజీజ్ నగర్ లోనే ఒక్క రోజు వందలాది ట్యాంకర్లతో నీటి రవాణా సాగిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల యజమానులు, బిల్డర్లు ధర విషయంలో రాజీపడకుండా ఎంత అడిగితే అంత చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈనెలలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో దందా జోరుగా సాగుతున్నది. రాత్రి పూట ట్యాంకర్ల రాకపోకలతో శివారు ప్రాంతాల రోడ్లు మారుమోగిపోతున్నాయి. నీటిని బహిరంగంగానే తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు జలమండలి అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో యతేచ్చగా నీటి దందా సాగిస్తున్నారు.
* వాల్టా చట్టానికి తూట్లు..
వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్-2002(వాల్టా ) ప్రకారం ఎవరైనా తమ సొంత స్థలాల్లో బోర్లు వేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. సంబంధిత రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రాంతాన్ని బట్టి ఎంత లోతు బోర్ తవ్వాలో వాల్టా చట్టం ప్రకారం అధికారులు నిర్ణయిస్తారు. కాని గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో వాల్టా చట్టం ఎక్కడా అమలు చేయడం లేదు. హిమాయత్‌నగర్, అజీజ్ నగర్, రాజేంద్రనగర్ రెవిన్యూ పరిదీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టరాజ్యాంగ వందలాది ఫీట్ల లోతులో బోర్లు వేసి అక్రమార్కుల నీటి దందా సాగిస్తున్నారు. అధికారుల దుర్వినియోగం వల్ల వాల్టా చట్టం దుర్వినియోగం అవుతున్నది. జిల్లా ఉన్నతధికారులు అక్రమ నీటిదోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
