నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని లేనియెడల ఈనెల 20 తరువాత ఏ రోజు నుండైనా నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డితెలిపారు
శుక్రవారం తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ జనరల్ బాడీ సమావేశం పద్మనగర్ మార్కండేయ గుడి దగ్గర గంజి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కనీస వేతనాల చట్టం పనిగంటలు బోనస్ ప్రమాదాల కు నష్టపరిహారం తదితర 44 చట్టాలను రద్దుచేసి నాలుగు కోడులుగా పార్లమెంటులో ఆమోదించిందని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను 70 ఏళ్ల కృషితో పెంచుకున్న ఆస్తులను ధ్వంసం చేయడానికి బరితెగించిందని అన్నారు. మార్పు చేసిన లేబర్ కోడ్ లా వలన వేతనాల పెంపు కోసం బెరసారాలాడే హక్కు కార్మిక వర్గం కోల్పోతుందని నూతనంగా యూనియన్లు ఏర్పాటు చేసుకోవడానికి కష్టతరమైన నిబంధనలు విధించి కార్మికులను కట్టు బానిసలుగా చేయాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీంమాట్లాడుతూ,పవర్లూమ్ కార్మికుల కూలిరేట్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అగ్రిమెంట్ గడవు 2024 మార్చి 31 తో ముగిసినప్పటికీ యజమానుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పలుమార్లు నోటీసు ఇచ్చి తప్పని పరిస్థితుల్లో అక్టోబర్ 20 తర్వాత ఏ రోజు నుండైనా సమ్మె చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి యూనియన్ జిల్లా అధ్యక్షులు పెండెం రాములు జిల్లా ప్రచార కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఇండస్ట్రియల్ చర్లపల్లి ఏరియాలో అధ్యక్షులు గంజి నాగరాజు పెండెం బుచ్చి రాములు, చిట్టిపోలు వెంకటేశం కార్యదర్శులు సూరపల్లి భద్రయ్య దేవులపల్లి గిరిబాబు రమేష్ నిమ్మనకోటి సైదులు, ఎస్కే జానీ బిక్షపతి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు*