కలెక్టరేట్ లో జీపీ స్పెషల్ ఆఫీసర్లతో జరిగిన సమీక్షా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలోని వివిధ శాఖల అధికారులు అంతా కలిసి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, విధుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడివోసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ సీఈవో, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మీ, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్ని గ్రామాల స్పెషల్ ఆఫీసర్లతో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీపి ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులతో కలిసి సమన్వయంతో పనిచేస్తేనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజూ గ్రామంలో పర్యటిస్తూ ప్రజాసమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ఫాగింగ్ చేయాలని కోరారు. కొన్ని గ్రామాలల్లో పంచాయతీ కార్యదర్శుల పనితీరు సరిగా లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలల్లో విధులు నిర్వర్తించే సెక్రటరీలే తనకి బలం, బలగం అని, వారు(సెక్రటరీలు) బాగా పనిచేస్తేనే మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను ఎలాంటి పైరవీలకు తావులేకుండా అధికారులు సంక్షేమ పథకాలను అందించేలా చూడాలని సూచించారు.