vidyarthi jivithamtho urbane college chelagatam, విద్యార్థి జీవితంతో అర్బెన్‌ కాలేజీ చెలగాటం

విద్యార్థి జీవితంతో అర్బెన్‌ కాలేజీ చెలగాటం

నగరంలో ప్రైవేట్‌ కాలేజీలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కాలేజీలు నడుపుతూ ధనార్జనే ధ్యేయంగా విద్యావ్యాపారం చేస్తున్నారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపి కోట్లు దండుకుంటున్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. హన్మకొండ నగరంలో సర్య్కూట్‌ గెస్ట్‌హౌజ్‌ రోడ్డులో ఉన్న అర్బెన్‌ జూనియర్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఓ విద్యార్థి జీవితం ఆగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే…హన్మకొండ కెఎల్‌ఎన్‌రెడ్డి ప్రాంతానికి చెందిన బి.వరుణ్‌ 2017లో ఎంపీసీ గ్రూపులో అడ్మిషన్‌ పొందాడు. 2017-18 మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు కూడా రాయడం జరిగింది. రెండవ సంవత్సరంలో విద్యార్థి కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణంతో ఇంటర్‌బోర్డులో 2018-19 రెండవ సంవత్సర వార్షిక పరీక్ష ఫీజును కాలేజీ యాజమాన్యం చెల్లించలేదు. దీని ఫలితంగా విద్యార్థికి ఇంటర్‌ బోర్డు నుండి హాల్‌టికెట్‌ రాకపోవడంతో పరీక్షలు రాయలేకపోయాడు. దీనికంతటికి కారణం కళాశాల యాజమాన్యం ఫీజుల మీదు ఉన్న మోజు విద్యార్థి జీవితంపై లేకపోవడమేనని విద్యార్థి వరుణ్‌ ఆరోపిస్తున్నాడు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం విద్యార్థి కళాశాల ఫీజు చెల్లించినా…చెల్లించకపోయినా పరీక్ష ఫీజును కళాశాలే విద్యార్థి పేరున కట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను వారు ఉల్లంఘించి విద్యార్థి జీవితాన్ని నాశనం చేశారు. ఫీజు పేరుతో తన తల్లిని కాలేజీకి పిలిపించి అనేకసార్లు మానసికంగా మాటలతో హింసించేవారని విద్యార్థి వాపోయాడు. గత కొన్ని రోజుల క్రితం ఫీజు విషయంపై మీతో మాట్లాడేది ఉందంటూ మమ్మల్ని పిలిపించి దొంగను నిల్చోబెట్టిన విధంగా నిల్చోబెట్టి 10మందికిపైగా అధ్యాపకులు గుమిగూడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోపోమ్మని బెదిరించారని బాధితుడు తెలిపాడు.

ప్రిన్సిపాళ్ల మార్పుతో విద్యార్థుల ఇక్కట్లు

అర్బెన్‌ జూనియర్‌ కాలేజీని వరుసగా ప్రిన్సిపాళ్ల మార్పుతో కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రామకృష్ణ కళాశాల నుంచి వెళ్లిన అనంతరం మరో ప్రిన్సిపాల్‌గా అపర్ణ వచ్చారని, ఆమె తరువాత ప్రస్తుతం శైలజా ప్రిన్సిపాల్‌గా కొనసాగుతోంది. ప్రిన్సిపాళ్లు ఈ విధంగా ఒకరి తరువాత ఒకరు మారడం వలన విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపాళ్లు ఆ ఫీజుతో మాకు సంబంధం లేదంటూ కళాశాల మొత్తం ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిఐఈఓకు ఫిర్యాదు

ఇంటర్మీడియట్‌ బోర్డు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పర్యవేక్షణాధికారికి విద్యార్థి బి.వరుణ్‌ తనకు జరిగిన అన్యాయంపై అర్బెన్‌ జూనియర్‌ కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశానని, అయినా ఎలాంటి ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పై విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కళాశాలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విద్యార్థి వరుణ్‌ వేడుకుంటున్నాడు.

నాకు న్యాయం చేయాలి

కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణంగా నా పరీక్ష ఫీజును కళాశాల ప్రిన్సిపాల్‌ చెల్లించకపోవడంతో నాకు హాల్‌టికెట్‌ రాలేదు. దీని వల్ల పరీక్షలు రాసే అర్హతను కోల్పోయాను. విద్యాహక్కుచట్టం ప్రకారం, ఇంటర్‌బోర్డు నిబంధనల ప్రకారం కళాశాల ఫీజు చెల్లించినా…చెల్లించకపోయినా పరీక్ష ఫీజు కట్టలన్నా నిబంధనలను పాటించకుండా సంవత్సర కాలం వృథా చేశారని, దీనికి అర్బెన్‌ కళాశాలే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నాకు జరిగిన అన్యాయంపై ఇంటర్‌బోర్డు డిఐఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితుడు రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రిన్సిపాల్‌ శైలజా వివరణ

ప్రిన్సిపాల్‌ శైలజాను వివరణ కోరగా నాకు ఆ విషయం గురించి తెలియదు. నేను ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకుని నెలరోజులే అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారం కోసం మాజీ ప్రిన్సిపాల్‌ కృపాకర్‌ను 8328315859 మొబైల్‌ నెంబర్‌లో సంప్రదించాలని సలహా ఇచ్చింది. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా అతను అవుట్‌ ఆఫ్‌ స్టేషన్‌, కులుమనాలిలో ఉన్నాను…ఇప్పుడేం మాట్లాడలేను అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!