విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు
విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌బోర్డు చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మల్యాల వినయ్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాల్యాల వినయ్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్ బోర్డు చెలగాటం అడుతుందని, ఇంటర్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించడం లేదని విమర్శించారు. తక్కువ మార్కులు వచ్చి అన్యాయం జరిగినా విద్యార్థులకు ఉచితంగా రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు, గ్లోబరినా సంస్థ చేసిన తప్పులకు విద్యార్థులను బలిచేయద్దని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలని కోరారు. 17మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వేణు, భూమేష్, వెంకటేష్, అబ్బాస్, సాయి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.