విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 1,2వ వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇతర మౌళిక వసతులను ఆయన పర్యవేక్షించారు. వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేకపోవడంతో సానిటరీ ఇన్‌స్పెక్టర్, సానిటరీ జవాన్లను 500రూపాయల జరిమానా విధించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, తిరిగి పునరావృతమైతే విధుల నుంచి తొలగిస్తానని హెచ్చరించారు. పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులకు స్థలాలలో చెత్తచెదారం, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లింక్‌రోడ్ల వద్ద ప్యాచ్ వర్క్‌లు త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యానగర్‌లో నిర్మాణం పూర్తికాబోతున్న మిషన్ భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను సందర్శించి, నేడు సాయంత్రానికి పురపాలక సంఘానికి అప్పగించాలని, రోడ్ రిస్టోరేషన్ పనులు నాణ్యతాయుతంగా త్వరగా పూర్తి చేయాలని సంబంధిత డిఇ, ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో 1,2వ వార్డుల కౌన్సిలర్లు రాగుల జగన్, బుర్ర నారాయణగౌడ్, పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.