
వేదాల బడి.. 4 రాష్ట్రాల విద్యార్థులకు శిక్షణ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: “వేదం నమామి.. సదాస్మరామి” అన్నది వేదవాజ్ఞయ సూక్తి. మానవుడి జీవనయానంలో సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగై పోతున్నాయి. వేద పండితుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. దీని దృష్టిలో పెట్టుకొని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితమే వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. అన్ని వర్ణాల వారు వేదం నేర్చుకోవడానికి అర్హులే. వేద ఆశ్రమ పాఠశాలపై “నేటి ధాత్రి ” ప్రత్యేక కథనం
యజ్ఞయాగాదులు, వివాహాది శుభకార్యాలు చేసేందుకు అవసరమయ్యే పురోహితులు, వైదికుల కొరత తీర్చేందుకు ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ కృషి తో వైదిక పాఠశాల కొనసాగుతోంది. కులాలకు అతీతంగా (అన్ని వర్ణాల ) వారికి కేవలం నియమ నిష్టలు, కట్టుబాట్లు పాటించే విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వేదవిద్యను బోధిస్తున్నారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది వారివారి స్వస్థలాల్లో అర్చక వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 100 ລ້ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ఉచిత బోధన, భోజన వసతి
వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానం పై బోధిస్తారు. విద్యార్థులకు వేదాంత, న్యాయ, యోగదర్శనం, ధ్యానం, భజన, గ్రంథపఠం తదితరాలపై శిక్షణ ఇస్తారు.
అర్చకుల కొరత తీర్చడమే లక్ష్యం సిద్ధేశ్వరానందగిరి మహరాజ్
ఊరూరా ఆలయాల్లో అర్చకుల కొరత తీర్చేందుకే వైదిక పాఠశాల కృషి చేస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన అర్చకులు వివిధ ప్రాంతాలలో స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నారు. అర్చకత్వం తో పాటు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వారి విద్య యధావిధిగా కొనసాగిస్తున్నాం. ట్రస్టు సభ్యులు, భక్తుల సహకారంతో పాఠశాల కొనసాగుతుంది.