రైతును నిండా ముంచుతున్న యూరియా పంపిణీ కేంద్రాలు
* తెల్లారేసరికి మండలం దాటుతున్న యూరియా సంపద
* రైతులంటే చిన్నచూపు చూస్తున్న సంబంధిత అధికారులు
* ఇరుగుపొరుగు వారి ఆధార్ కార్డులతో యూరియా దోపిడి
* జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు దర్జాగా తరలిపోతున్న యూరియా
మహాదేవపూర్ సెప్టెంబర్ 23 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో రైతును నిండా ముంచుతున్న యూరియా పంపిణీ కేంద్రాలు. జిల్లా నుండి మండలం వరకు రైతులు యూరియా పంపిణీ కేంద్రాల ముందు ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ క్యూ లైన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడితే ఆధార్ కార్డుకు ఒకటి నుండి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి మండలం లో నెలకొంది. దీనిని ఆసరా చేసుకొని యూరియా బస్తాల కోసం యూరియా పంపిణీ కేంద్రాల నిర్వహకులు వ్యవసాయ అధికారులకి అనుమానం రాకుండా, తనిఖీ చేసిన దొరకకుండా ఇరుగుపొరుగు వారి ఆధార్ కార్డులను జమచేసి అవసరం లేకున్నా ఒక్కొ ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున దర్జాగా తీసుకొని అక్రమంగా నిల్వ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా పక్క మండలాలకు, పక్క రాష్ట్రానికి బస్తాకు 400 రూపాయల చొప్పున తీసుకొని రాత్రికి రాత్రి ట్రాక్టర్లలో, ట్రాలీ ఆటోలలో సరఫరా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇలా సరఫరా చేయడంతో మండలంలో కృత్రిమంగా యూరియా కొరత ఏర్పడి ఒక్కొక్క యూరియా పంపిణీ కేంద్రాల ముందు రైతులు గొడవలు, కొట్టుకునే పరిస్థితి నెలకొందనీ, రైతులు పంటకు మొదలు యూరియా బస్తా కొనుగోలు నుండి పంట పండించి చేతికి వచ్చి అమ్మకం జరిగే వరకు రైతుకు కష్టలు తీరలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటే సంబంధిత అధికారులు రైతులంటే చిన్నచూపు చూస్తూన్నారని లేకుంటే యూరియా అక్రమంగా ఎందుకు తరలిపోతుందని రైతులు గుసగుస పెట్టుకుంటున్నారు. యూరియా అక్రమంగా తరలింపు చేస్తున్న యూరియా పంపిణీ కేంద్రాలపై, మండలాన్ని దాటిస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని అక్రమ యూరియా దందాపై ఉక్కు పాదం మోపాలని రైతులు సంబంధిత అధికారులను వేడుకుంటున్న పరిస్థితి మహాదేవపూర్ మండలంలో నెలకొంది. ఇప్పటికైనా రైతుల గోడు విని సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా యూరియా తరలిపోకుండా యూరియా పంపిణీ కేంద్రాలపై నిఘా ఉంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.