తెలుగు రాష్ట్రాలలో బలపడుతున్న బీసీ గళం.
రాజకీయ పార్టీలలో ప్రకంపనం.
ప్రతి పార్టీ బీసీ విభాగం ఏర్పాటు చేయాలి.
పార్టీ అధినేత, అగ్రనేతలతో సమాన గౌరవం ఇవ్వాలి.
లేకుంటే బీసీలంతా తిరగబడాలి.
అగ్రకుల తొత్తు రాజకీయాలు మానుకోవాలి.
ప్రాంతీయ పార్టీలలో జోడు పదవులకు స్వస్తి చెప్పాలి.
బీసీలే బలమైన రాజకీయ వర్గాలని చాటాలి.
పిడికెడు ఉన్నత వర్గాల గుప్పిట్లో బీసీలు ఒదిగిపోవొద్దు.
బానిస రాజకీయాలకు అలవాటు పడొద్దు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదు.
జాతీయ పార్టీలలో కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు.
ఇకపై బీసీలకే రాజకీయ పదవులలో పెద్ద పీట వేయాలి.
బలమైన సామాజిక వర్గాలైన బీసీలకే పార్టీ పదవులు అప్పగించాలి.
ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ససమేమిరా అంటే కొత్త వేధికలు రావాలి.
ఆధిపత్య కులాలను రాజకీయ పదవులకు దూరం చేయాలి.
బీసీలలో పార్టీలకు అతీతంగా ఐక్యత రావాలి.
బీసీలలో ఆధిపత్య రాగం కొంత కాలం మానుకోవాలి.
భవిష్యత్తు తరాల కోసం అసలైన త్యాగం ఇప్పుడు చేయాలి.
ఇంత కాలం అగ్రకులాల కోసం చేసిన త్యాగం చాలు.
అగ్రకులాల నేతలకు చేసిన ఊడిగం వదిలేస్తే మేలు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కచ్చితంగా 50 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలి.
ఈ ఎన్నికల నుంచే అమలు చేయాలి.
మండల పరిషత్, జిల్లా పరిషత్ లలో సగ భాగం ఇవ్వాల్సిందే.
వచ్చే జమిలి ఎన్నికల నాటికి సగం స్థానాలను కేటాయించాలి.
బీసీ డిక్లరేషన్ అమలు చేయని పార్టీలను బహిష్కరించాలి.
తెలుగు రెండు రాష్ట్రాల నుంచే ఈ మార్పు అమలు జరగాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
బిసిల ఐక్యత.. కొత్త రాజకీయ చరిత్రకు నాంది కావాలి. వచ్చే ఎన్నికల నాటికైనా, వస్తే జమిలీ ఎన్నికల వరకైనా బిసిలు మరింత రాజకీయ దూకుడు ప్రదర్శించాలి. నాయకులంతా ఏకం కావాలి. అది తెలంగాణ నుంచే మొదలుకావాలి. కాలయాపన జరకుండా బిసి. సమాజమంతా ఏకం కావాలి. ఇప్పటే అడుగులు పడ్డాయి. ఇక బిసిల రాజకీయం పరుగందుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో బలపడుతున్న బిసి గళం దేశమంతా వినిపించాలి. అన్ని రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలను అనుసరించేలా బిసిలకు రాజకీయ రిజర్వేషన్‌పై పోరు జరగాలి. సహజంగా ఉద్యమాలంటేనే దావానలంతా కదిపే అగ్ని కీలలు. అవి స్వాతంత్య్ర ఉద్యమమైనా, తెలంగాణ పోరాటమైనా, ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా అందుకు సజీవ సాక్ష్యలే. ఇప్పుడు బిసి ఉద్యమాలు కూడా అందుకు తగ్గకుండా ఊపందుకోవాలి. బిసిల ఐక్యతకు దేశమంతా ఊపిరిపోయాలి. రాజకీయ పార్టీలలో ఒక్కసారిగా ప్రకంపనం పుట్టాలి. బిసిలకు జనాభా ప్రాతిపదికన సముచిత స్థానం కల్పించకపోతే పార్టీల మనుగడకే ప్రమాదకరమని గ్రహించేలా సత్తా చాటాలి. ఇప్పటికిప్పుడు ప్రతి పార్టీ బిసి విభాగం ఏర్పాటు చేసేలా ఆయా రాజకీయ పార్టీలలో వున్న నాయకులంతా ఒత్తిడి తేవాలి. ప్రతి పార్టీలోనూ పార్టీ అధినేత, అగ్రనేతలతో సమాన గౌరవం ఇవ్వాలని డిమాండ్‌లు ఊపందుకోవాలి. ఒకవేళ పార్టీ అధినేతలు అందుకు సుముఖత వ్యక్తం చేయకపోతే లేకుంటే బిసిలంతా తిరగబడాలి. అలాంటి చైతన్యం బిసిలలో వెల్లివిరియాలి. ఇప్పటికైనా బిసి నాయకులు అగ్రకుల తొత్తు రాజకీయాలు మానుకోవాలి. ఇది నేతలందరూ గ్రహించి రాజకీయాలు అలవాటు చేసుకోవాలి. అందుకు అందరూ కలిసికట్టుగా ఏకం కావాలి. ఏక కాలంలో అన్ని పార్టీల బిసిలంతా మా సీట్లు మాకే…కావాలని డిమాండ్లు ముందుపెట్టాలి. ఇక ప్రాంతీయ పార్టీలలో జోడు పదవులకు స్వస్తి చెప్పాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కచ్చితంగా ఏ ఒక్కరికీ రెండు పదవులు వుండకుండా చూడాలి. జాతీయ పార్టీలలో కూడా జోడు పదవుల సంప్రదాయంలో మార్పులు తేవాలి. తెలంగాణలో బిజేపిలో రాష్ట్ర అధ్యక్షుడు గా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి రెండు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పటికీ ఏడాదిన్న సమయం నడుస్తోంది. అయినా బిజేపి లో అధ్యక్షు పదవిని బిసిలకు ఇవ్వడం లేదు. గతంలో బండి సంజయ్ ని అధ్యక్షుడుగా చేసి, పార్టీకి ఒక ఊపు వచ్చిన క్రమంలో అర్థాంతరంగా ఆయనను దించేశారు. బిసిల మనోభావాలు దెబ్బ తీశారు. మరో బిసికి అధ్యక్ష పదవి ఇవ్వడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారు. అందుకే అందరూ బిసిలే బలమైన రాజకీయ వర్గాలని చాటాలి. లేకుంటే ఇంకా వంద సంవత్సరాలైనా బిసిలకు రాజ్యాధికారం రాదు. ఒకప్పుడు తెలంగాణలో రాజరిక పాలన సాగినా అగ్రకులాలే పాలన సాగించాయి. శాతవాహనుల కాలం నుంచి చూసినా, ఇక్ష్వాకుల కాలమైనా, విష్ణుకుండిన రోజులైనా, ఆఖరుకు కాకతీయుల రాజ్యమైనా అగ్రకులాలకే అగ్ర తాంబూలం అందింది. తర్వాత ముస్లిం పాలన సాగినా భూస్వాములంతా ఉన్నత వర్గాలే. నిజాం పాలనకు వ్యతిరేకంగా సర్థార్ సర్వాయి పాపన్న రాజ్యం ఏర్పాటు చేసుకున్నా వేధించి, వెంటాడి రాజ్యం హస్తగతం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో అంతటా అణచివేతనే కనిపిస్తుంది. బిసిలను బానిసలుగా చూసే రాజకీయమే సాగింది. ఇప్పటికీ అదే అగ్రకుల వారసత్వ రాజకీయమే సాగుతోంది. అందుకే పిడికెడు ఉన్నత వర్గాల గుప్పిట్లో బిసిలు ఒదిగిపోవొద్దు. అగ్రకులాలకు సలాం చేసి చేసి వంగిపోయిన నడుములు చాలు. బానిస రాజకీయాలకు ఇంకా అలవాటు పడొద్దు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి కూడా బిసిలకు అవకాశం రాలేదు. జాతీయ పార్టీలలో కూడా బిసిలకు ప్రాధాన్యత కల్పించలేదు. ఇకపై బిసిలకే రాజకీయ పదవులలో పెద్ద పీట వేయాలి. బలమైన సామాజిక వర్గాలైన బిసిలకే పార్టీ పదవులు అప్పగించాలి. ఒకవేళ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ససమేమిరా అంటే కొత్త వేధికలు రావాలి. బిసిలు తలుచుకుంటే రాజకీయాలు తారుమారు చేయొచ్చు. అగ్రకుల రాజకీయాలను తలకిందులు చేయొచ్చు. మాకు పదవులు కావాలని అగ్రకుల నాయకులు యాచించే స్థితిని తీసుకురావొచ్చు. బిసిలు అనుకుంటే ఇదంతా సాధ్యమే. అలా అనుకోకపోవడం వల్లనే ఇంత దూరం వచ్చింది. అందుకే ముందు ఆధిపత్య కులాలను రాజకీయ పదవులకు దూరం చేయాలి. అందుకోసం బిసిలలో పార్టీలకు అతీతంగా ఐక్యత రావాలి. అయితే బిసిలలో ఆధిపత్య రాగం కొంత కాలం మానుకోవాలి. భవిష్యత్తు తరాల కోసం బిసిలు అసలైన త్యాగం ఇప్పుడు చేయాలి. ఇంత కాలం అగ్రకులాల కోసం చేసిన త్యాగం చాలు. అగ్రకులాల నేతలకు చేసిన ఊడిగం వదిలేస్తే మేలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కచ్చితంగా 50 శాతం సీట్లు బిసిలకు ఇవ్వాలి. తెలంగాణలో సుమారు15 వేల గ్రామాలున్నాయి. వాటిలో సగానికి పైగా బిసిలు సర్పంచులు కావాలి. ఎంపిటిసిలు 600లకు పైగా రావాలి. జడ్పీటిసిలలో 250కి పైగా అందాల్సి వుంది. ఇక పార్టీ పరమైన, ఇతర కార్పోరేషన్ పదవులు, నామినేట్ పదవులు కూడా దామాషా ప్రకారం అందాల్సిందే. ఏపిలో కూడా సుమారు 23 వేల గ్రామాలుంటాయి. అక్కడ కూడా ఇదే తరహా సీట్లు అందాల్సిన అవసరం వుంది. కనీసం 13వేల సర్పంచ్ పదవులు బిసిలకు రావాలి. ఎంపిటిసిలు 7 వేలకు పైగా వుంటారు. సుమారు 1000 వరకు ఎంపిపి పదవులుంటాయి. అందులో 500 ఎంపిపి పదవులు దక్కాలి. ఇక జడ్పీల విషయానికి వస్తే సుమారు 600లకు పైగా వున్నాయి. అందులోనూ 300 దక్కాలి. ఇక ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, పార్లమెంటు సభ్యులలో కూడా దామాషా ప్రకారం దక్కాలి. ఇవన్నీ అందాలంటే బిసిల గళం బలంగా వినపడాలి. ఇవన్నీ అమలు చేయడానికి ముందుకు రాని పార్టీలను బిసిలు బహిష్కరించాలి. తెలుగు రెండు రాష్ట్రాల నుంచే ఈ మార్పు అమలు జరగాలి. అయితే బహిష్కరణలు, లేకుంటే సీట్ల పంపకాలు జరగాలి. అప్పుడే బిసిల రాజ్యాధికారం సాధ్యం. ఇప్పుడే బిసిల చైతన్యం పరుగులందుకుంటోంది. బిసిలలో రాజకీయచైతన్యం మేలుకొంటోంది. రాజకీయ కదన రంగంలో కదం తొక్కాలని ఎదురుచూస్తోంది. ఇంత కాలం ఒక లెక్క. ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా బిసి గళం వినిపిస్తోంది. బిసిలంతా ఏకతాటిపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం పోయిన మోసం చాలు. ఇక చరిత్ర తిరగరాయడమే మేలు. పాలనలో కీలక పాత్ర పోషించడమే బిసిల అభ్యున్నతికి దారులు. ఇంత కాలానికైనా బిసిల రాజ్యాధికారం అనే నినాదం ఊపందుకుంటోంది. ఈ వాదం, నినాదం వినిపిస్తున్న వారిని స్వార్థపరులు అని చిత్రీకరించకండి. బిసిలు నాయకులైతే పాలించే వాడు బిసిల కోసం ఆలోచిస్తాడు. అంతే కాని నా కోసమే ఆలోచించాలని అనుకోవద్దు. బిసిల కోసం పని చేస్తే చాలు అనుకోవాలి. అప్పుడు బిసిలలో రాజకీయ చైతన్యం ఎందుకు రాదో చూద్దాం! బిసిలకు రాజ్యాధికారం ఎందుకు రాదో తేల్చుకుందాం!!