
TVK to Contest Alone in TN Elections: Vijay
తేల్చి చెప్పిన టీవీకే.. ఎన్నికల్లో ఒంటరి పోరాటమే..
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Vijay) శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు. అదే సమయంలో అన్నాడీఎంకే పేరు ప్రస్తావించకుండా ఆ పార్టీపై పరోక్ష విమర్శలు చేశారు. అడవిలోని సింహం ఒంటరిగానే వేటకు వెళ్తుందని,
తనకంటే బలమైన ఎరను మాత్రమే వేటాడుతుందని, ఆ రీతిలోనే తాను రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకోవాలనే డీఎంకేతో తలపడేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. సినీ రంగంలో ఛాన్స్‌లు లేక తాను రాజకీయాల్లోకి రాలేదని, ఆ రంగంలో ఉన్నతస్థితిలో ఉన్నప్పుడే రాజకీయ ప్రవేశం చేశానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాలలోనూ తానే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు భావించి ప్రజలంతా పార్టీకి ఘనవిజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు.
బీజేపీతో పొత్తు మాకు అనవసరం…
రాష్ట్రంలో తాము చేసిన అవినీతి అక్రమాలకు భయపడుతూ ఓ పార్టీ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తుపెట్టుకుందని, మరొక పార్టీ రహస్యంగా పొత్తు కుదుర్చుకుందని విజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల బాటలో టీవీకే కూడా బీజేపీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ పట్టలేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తామెలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదన్నారు. మదురై నగరంలో పార్టీ ద్వితీయ మహానాడు ఇంత గొప్పగా జరుగటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని, మదురై ప్రజలు నిజాయితీ పరులను ఆదరిస్తారని, అందుకు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ చక్కటి ఉదాహరణ అని, ఆయనను చూడలేకపోయినా ఆయన గుణాలను పుణికి పుచ్చుకున్న విజయకాంత్‌తో మంచి పరిచయాలున్నాయని, ఆ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకునే నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నానని వెల్లడించారు. విక్రవాండిలో తమ పార్టీ తొలి మహానాడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిందని, ఆ రీతిలోనే మదురై మహానాడు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని అన్నారు. పార్టీని ప్రారంభించినప్పడి నుండి ప్రత్యర్థులంతా పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయాల్లోకి ఆయనే (రజినికాంత్) రాలేదు ఈయన వస్తారా? అని ఎగతాళి చేశారని, రాజకీయాల్లోకి వచ్చాక అధికారంలోకి రాలేరని నిరుత్సాహపరుస్తున్నారని, ఏది ఏమైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకేతోనే తలపడుతుందని, ఈ రెండు పార్టీ మధ్యే గట్టి పోటీ ఉంటుందన్నారు. ఎంజీఆర్ స్థాపించిన పార్టీలో కార్యకర్తలంతా అయోమయంలో ఉన్నారని, ఆ పార్టీని సక్రమమైన మార్గంలో నడిపించేవారు లేకపోవటం శోచనీయమన్నారు. తనను సినిమా మనిషి అని విమర్శలు చేస్తున్నారని, వాస్తవానికి సినిమావాళ్లంతా మూర్ఖులు కారని చెబుతూ రాజకీయవాదులంతా మేధావులు కారని, అంబేడ్కర్‌ను, నల్లకన్నును, కామరాజర్‌ను ఓడించింది రాజకీయ నేతలే తప్ప సినీ నటులు కాదని ఆయన చెప్పారు.