“Trident Workers Protest Demanding Wage Arrears”
వేతన బకాయిలు డిమాండ్ చేస్తూ ట్రైడెంట్ కార్మికుల ఆందోళన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: వేతన బకాయిలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘం అధ్యక్షులు ఎంజీ.రాముల ఆధ్వర్యంలో ట్రైడెంట్ కార్మికులు కంపెనీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా యాజమాన్యం తమ బకాయి డబ్బులను చెల్లించకుండా రేపు మాపంటూ కాలయాపన చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కంపెనీ కార్మికులు కాదని యూపీ, బీహార్ కు చెందిన దినసరి కూలీలతో చట్టవిరుద్ధంగా పని చేయిస్తున్నారన్నారు. రూ.5 కోట్లు వేతన బకాయిలు చెల్లించి తమకు పనులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కంపెనీ, కార్మిక చట్టాలకు విరుద్ధంగా యూపీ, బీహార్‌లకు చెందిన 300 మంది కార్మికులతో పనిచేయిస్తున్నారని ఆరోపించారు. వీరిలో చాలామంది కూలీలు బాల కార్మికులేనని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి పని కల్పిస్తూ తమకు మాత్రం బకాయిలు చెల్లించకుండా పని కల్పించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. యాజమాన్యం దిగొచ్చేంత వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల డీసీఎల్ వద్ద సమావేశమైన యాజమాన్యాలు ఉమర్, ఓంకార్ షుగర్స్ లతో ఫిబ్రవరి 2వ తేదీ వరకు బకాయిలు చెల్లించేలా జరిగిన ఒప్పందం ప్రకారం ఈరోజు చెల్లించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించడంతో ఆగ్రహించిన కార్మికులు కంపెనీ గేటు ముందు బైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కరించే అంతవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మిక సంఘం అధ్యక్షులు ఎంజీ.రాములతో పాటు నాయకులు రాజశేఖర్, నాగేష్ పాటిల్, జగదీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
