జహీరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు… !
◆:- ట్రాఫిక్ నియంత్రించే నాథుడే కరువు
◆:- ప్రతి రోజు పట్టణంలో ట్రాఫిక్ జామ్
◆:- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు అంత ఇంతా కాదు ప్రతి రోజు ట్రాఫిక్ అంతరాయంతో జహీరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అప్పడప్పుడు పని చేస్తుంటాయని స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఇష్టానుసారంగా వాహనాలను జహీరాబాద్ పట్టణంలో నడపడం వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కాని లేదా ట్రాఫిక్ పోలీసులు అయినా వాహనదారులకు అవగాహన కల్పించిన దాఖలాలు ఇప్పటి వరకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలపై పట్టించుకోకపోవడంపై జహీరాబాద్ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.