Warangal Collector Alerts Officials Over Monnda Cyclone
*మోంధా తుఫాన్ పట్ల
అధికారులు అప్రమత్తంగా ఉండాలి*
ఆత్యవసమైతేనే బయటకు వెళ్ళాలి..ప్రజలు,రైతులకు విన్నపం
తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటన
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1800 425 3424, జిడబ్ల్యూ ఎంసీలో 1800 425 1980,9701999676 టోల్ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు
టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రతినిధి నర్సంపేట, నేటిధాత్రి:
మోంధా తుఫాన్ ప్రభావం తీవ్రతరం దాల్చిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ నుండి కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదనవు కలెక్టర్, జిల్లా,మండల స్థాయి అధికారులు, తహసిల్దార్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పరిస్థితులను సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహణకు పలు సూచనలు చేశారు.
క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డిఆర్డీఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.వర్షాల కారణంగా అత్యవసర సహాయార్ధం ప్రజల కొరకు వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 1800 425 3424 టోల్ ఫ్రీ నెంబర్ కు 9154252936 మొబైల్ నంబర్ కు అదేవిధంగా వరంగల్ పట్టణానికి సంబంధించి జిడబ్ల్యూ ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 1800 425 1980 టోల్ ఫ్రీ నెంబర్ కు 9701999676 నెంబర్లకు సంప్రదించాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తాసిల్దారులు,ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.తహసిల్దార్లు, ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని లు గ్రామాలు జల మాయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు.
వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్, రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని,
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయితీ శాఖల ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు కార్యస్థానంలో ఉంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.పారిశుద్ధ్య ఆరోగ్య సమస్యల పరంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ముంపు సమస్యలపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.ఈటెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, పంచాయతీ , అగ్నిమాపక ,బల్దియా, కుడా, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు తహసిల్దారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
