*సీనియర్ జర్నలిస్ట్ లకు పెన్షన్ మంజూరు కు కృషి చేస్తా….
*వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు తిరుపతి ఎంపీ భరోసా…
తిరుపతి (నేటి ధాత్రి:
దేశవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్ట్ లకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తా నని తిరుపతి యంపి డా.మద్దెలగురుమూర్తి పేర్కొన్నారు. శనివారం తిరుపతి లో ఆయన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు డా. టి.జనార్దన్, ఎపి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం.నరేంద్ర రెడ్డి, ఆర్.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పి. వి. రవికుమార్ లు కలసి ఎంపీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్ట్ లకు పెన్షన్ అందజేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం ఆగష్టులో కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్స్ ప్రథమ జాతీయ మహా సభలో వెటరన్స్ కు సామాజిక భద్రత క్రింద ఆదుకోవాలని దానికై జాతీయ సమగ్ర పెన్షన్ విధానం అమలు చేస్తూ నెలకు కనీసం ₹25 వేలు మంజూరు చేయాలని తీర్మానం చేసినట్లు వారు తెలిపారు.
కరోనా సమయంలో రద్దుచేసిన రైల్వే పాసులు పునరుద్దరించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సత్వరం గతంలో లాగా రాయితీ పాసులు అందజేయాలని కోరారు. అలాగే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింప చేసి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్ట్ లను ఆదుకొనేందకు మీడియా కమిషన్ ఏర్పాటు చేసి వేజ్ బోర్డు సిపార్సులు పటిష్టం గా అమలు కు కృషి చేయాలని తెలిపారు. ఈ డిమాండ్స్ పట్ల ఎంపీ సానుకూలంగా స్పందించి రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో జర్నలిస్ట్ ల సమస్యలు సభదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
