కేరళ కాంగ్రెస్‌ మెడకు చుట్టుకున్న వక్ఫ్‌బిల్లు 

`బూమరాంగ్‌ అయిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు

`కాంగ్రెస్‌, సీపీఎంలపై మండిపడుతున్న క్రైస్తవులు, వక్ఫ్‌ బాధిత ముస్లింలు

`పుట్టి ముంచనున్న ఓటు బ్యాంకు రాజకీయాలు

`తలపట్టుకు కూర్చున్న కాంగ్రెస్‌ క్రైస్తవ ఎంపీలు

`రాహుల్‌, ప్రియాంకలపై కేరళ ముస్లింల ఆగ్రహం

`బీజేపీకి అస్త్రంగా మారిన వక్ఫ్‌బిల్లు

`వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ

`కాంగ్రెస్‌పై మండిపడుతున్న కేథలిక్‌ చర్చ్‌

`కాంగ్రెస్‌ కొంప ముంచనున్న మునాంబం సమస్య

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత కేరళలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. మైనారిటీల వర్గాల బుజ్జగింపు రాజకీయాలతో తన రాజకీయ మనుగడను సాగిస్తున్న కాంగ్రెస్‌కు అదే మైనారిటీ అస్త్రం బూమరాంగ్‌ కావడం కేరళలో తాజాపరిణామం. పార్లమెంట్‌లో వక్ఫ్‌ బి ల్లుపై చర్చలో రాహుల్‌ మౌనం పాటిస్తే, ప్రియాంకా వాద్రా అసలు లోక్‌సభకే రాలేదు. చివరకు వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో, కేరళలోని ముస్లిం వర్గాలు కాంగ్రెస్‌పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. సందట్లో సడేమియా మాదిరిగా ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ కేరళ క్రైస్తవ వర్గాల్లో సానుకూలతను పెంచుకోవడానికి కృషి చేస్తుండటం తాజా పరిణామం. బిల్లు ఆమోదంతో డిఫెన్స్‌లో పడ్డ కాంగ్రెస్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీలు ఉమ్మడిగా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఇటీవల జబల్‌పూర్‌లో క్రైస్తవ మత గురువుపై రైట్‌వింగ్‌ కార్యకర్తలు జరిపిన దాడికి ఎక్కువ ప్రచారం కల్పించడం ద్వారా, కేరళ క్రై స్తవుల్లో భాజపాపై సానుకూలతను నిరోధించే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇది అంతగా ఫలితం ఇస్తున్నట్టు లేదు.

మునాంబం వాసుల్లో ఆనందం

వక్ఫ్‌ బిల్లు ఆమోదంతో కేరళలోని మునాంబం గ్రామ ప్రాంతంలోని క్రైస్తవుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక్కడి క్రైస్తవుల భూములను వక్ఫ్‌బోర్డు తమదిగా ప్రకటించడంతో ఈ ప్రాంత క్రైస్తవుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పినరయి విజయన్‌ ప్రభుత్వం కూడా పెద్దగా స్పం దించకపోవడం క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. తాజాగా పార్లమెంట్‌లో వక్ఫ్‌బిల్లు ఆ మోదం పొందడంతో మునాంబంలోని 610 క్రైస్తవ కుటుంబాలకు ఊరట లభించే అవకాశాలు మెరుగైన నేపథ్యంలో, బీజేపీ పట్ల కృతజ్ఞతా భావంతో ఇప్పటికే ఈ ప్రాంతంలోని 50మంది క్రైస్తవులు బీజేపీలో చేరిపోయారు. ఈనెల 4వ తేదీన కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎన్‌డీఏ కూటమి భాగసామి నేతలు మునాంబం గ్రామాన్ని సందర్శించి న ప్పుడు వీరికి అపూర్వరీతిలో స్వాగతం లభించింది. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు ఈ ప్రాంత వాసులు వక్ఫ్‌ ప్రకటన కారణంగా పడుతున్న కష్టాలను పట్టించుకోకపోయినా, తాము వారికి దన్నుగా నిలుస్తామని వీరు స్పష్టం చేశారు. వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు తమ భూములపై చట్టబద్ధంగా యాజమాన్య హక్కు వచ్చేవరకు తాము వీరికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్‌బోర్డు వీరి భూములను తమవిగా ప్రకటించడంతో గత 178రోజులుగా ఈ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందడంతో కృతజ్ఞతగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రాంత క్రైస్తవులు కోరడంతో, అందుకు తప్పక అవకాశం కల్పిస్తామని ఈ నాయకులు హామీ ఇచ్చారు. 

మునాంబం వివాదం

2022లో కేరళ వక్ఫ్‌బోర్డు మునాంబం గ్రామంలో ప్రజలు నివసిస్తున్న 400 ఎకరాల విస్తీర్ణంలో ని నివాస భూములన్నీ తమవేనని ప్రకటించడంతో, ఈ ప్రాంతంలో నివసించే ఫలితంగా ఇక్కడ నివసిస్తున్న 600కు పైగా క్రైస్తవ కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్నది హిందూ, క్రైస్తవ మత్స్యకార్లు. ఎర్నాకులం జిల్లాలోని తీరప్రాంత శివారు గ్రామమే మునాంబం. సిద్ధిఖి సైట్‌ అనే వ్యక్తి ‘వక్ఫ్‌’ కింద కోజిక్కోడ్‌లోని ఫరూక్‌ కళాశాలకు దానంగా ఇచ్చాడని వక్ఫ్‌బోర్డు వాదిస్తోంది. అయితే తాము ఈ భూములను కళాశాల యాజమాన్యం నుంచి కొనుగోలు చేశామని దీనికి సంబంధించిన టైటిల్‌ డీడ్స్‌ కూడా తమవద్ద వున్నాయని మునాంబం వాసులు చెబుతున్నారు . ఎన్నో ఏళ్లుగా వీరిక్కడ నివాసం వుండటమే కాదు ఇంటిపన్ను కడుతున్నారు. తమ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు కూడా వీరివద్ద వున్నాయి. కానీ ఈ భూములను వక్ఫ్‌బోర్డు తమదిగా ప్రకటించడంతో 1995 వక్ఫ్‌బోర్డుచట్టం ప్రకారం, వీరు వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను మాత్రమే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వీరిలో ఎకోశానా లేదు. ఈ ట్రిబ్యునల్‌లో నిష్పక్ష పాత తీర్పు వస్తుంద న్న ఆశకూడా వీరిలో లేదు.ఎప్పుడైతే వక్ఫ్‌బోర్డు ఈ భూములు తమవని ప్రకటించిందో స్థానిక పంచాయతీ పన్ను వసూళ్లను నిలిపేసింది. ఇక బ్యాంకులు ఇక్కడివారికి రుణాలు మంజూరు చేయడంలేదు. ఈ తతంగం 2022 నుంచి కొనసాగుతోంది.

కుహనా సెక్యులర్‌ రాజకీయాలు

ప్రస్తుతం కేరళలో క్రైస్తవ ఓటర్లు 18% వున్నారు. తమను తాము సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునేకాంగ్రెస్‌ లేదా లెఫ్ట్‌ పార్టీలు ఎక్కువగా ముస్లిం మైనారిటీ వర్గానికే కొమ్ము కాసే విధంగా రాజకీ యాలు నడుతుండటంతో, క్రమంగా ఈ పార్టీలు మిగిలిన వర్గాలకు దూరమవుతున్నాయి. చాప కింద నీరులా జరుగుతున్న ఈ పరిణామాన్ని ఇవి గుర్తించకపోవడం వాటి స్వయంకృతాపరాధం. ‘సెక్యులర్‌’ అంటే దేశంలోని అన్ని వర్గాల పట్ల సమాన వైఖరితో వ్యవహరించడం. కానీ దేశంలోని విపక్ష పార్టీలు కేవలం ముస్లిం మైనారిటీ వర్గానికి మాత్రమే దన్నుగా నిలుస్తూ, మెజారిటీలను నిర్లక్ష్యం చేయడం ద్వారా తమను తాము సెక్యులర్‌గా భావిస్తున్నాయి తప్ప, తాము ‘సూడో సెక్యులర్‌’ విధానాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారామన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాయి.విపక్ష కాంగ్రెస్‌ నేత వి.డి. సంథీసన్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ బిల్లుకు, మునాంబం సమస్యకు ప్రత్యక్ష సంబంధం లేదని, ఈ విషయంలో ఇప్పటికే చర్చ్‌ మత గురువులను కలిసి చర్చించి వారిని ఒ ప్పించగలిగామని చెబుతున్నారు. ఈలోగా జబల్‌పూర్‌లో క్రైస్తవ మతగురువుపై జరిగిన దాడిని హైలైట్‌ చేయడానికి యత్నించారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్టు క్రైస్తవులు శాంతించినట్లయితే,బీజేపీ లో ఈ చేరికలు జరిగివుండేవి కావు. ఇదిలావుండగా కేరళలో ప్రముఖ ముస్లిం సంస్థ అయిన ‘సమస్థ కేరళ జమియతుల్‌ ఉలేమా’, వక్ఫ్‌బిల్లు విషయంలో రాహుల్‌ గాంధీ మౌనాన్ని, ప్రియాంకా వాద్రా వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సంస్థ అధికార పత్రిక ‘సుప్రభాతం’ లో ‘‘ప్రియాంక వాద్రా లోక్‌సభకు రాకపోవడం, రాహుల్‌ గాంధీ మౌనం వహించడంతో, బీజేపీ ముస్లింల రాజ్యాంగ హక్కులను నిరోధించే వక్ఫ్‌బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది’’ అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో ప్రియాంక ఇచ్చిన వివరణను వారికి తెలియ జేసి శాంతింజేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు నానా తిప్పలు పడుతున్నారు.

 కేరళ కేథలిక్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ (కేసీబీసీ) వక్ఫ్‌ చట్టాలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కౌ న్సిల్‌లో సైరో`మలబార్‌, లాటిన్‌, సైరో`మలంకర చర్చ్‌లు భాగంగా వున్నా యి. వక్ఫ్‌ బిల్లుకు మద్దతు పలకాలని తమ ఎంపీలకు కేసీబీసీ బహిరంగంగా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశే ఖర్‌ చురుగ్గా పావులు కదపడం మొదలుపెట్టి, కేసీబీసీ ప్రెసిడెంట్‌ కార్డినల్‌ బేసిలియోస్‌ క్లీమిస్‌ మరియు ఎస్‌ఎన్‌డీపీ యోగం సంస్థ ప్రధాన కార్యదర్శి వల్లెపల్లి నటేషన్‌ను కలిసి మంతనాలు జరిపారు. నటేషన్‌ బీజేపీకి అనుకూలుడు. అంతేకాదు రాజీవ్‌ చంద్రశేఖర్‌ బిల్లు విషయంలో కేసీబీసీ అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. వక్ఫ్‌బిల్లుకు మద్దతు పలకాలని కేసీబీసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కేరళలో మంచి ప్రాచుర్యం పొందిన కేథలిక్‌ దినపత్రిక ‘దీపిక’ తన సంపాదకీయం లో కాంగ్రెస్‌, సీపీఎంల వ్యవహారశైలిని తీవ్రంగా వి మర్శించింది. ‘‘వక్ఫ్‌బిల్లును వ్యతిరేకిస్తే ఈ నాయకులు రాబోయే తరాలకు జవాబుదారీలుగా మిగులుతారు. కొన్ని వర్గాల ఓట్లు తమకే పడతాయని, మరికొన్ని వర్గాలను ఎప్పటికప్పుడు బుజ్జగించక తప్పదని ఈ పార్టీలు తప్పుగా అంచనా వేస్తున్నాయి. కేవలం వక్ఫ్‌కు అనుకూలంగా వ్యవహరించడమే సెక్యులర్‌ విలువలని భావించడం తప్పు’’ అని ఆ పత్రిక సంపాదకీయం ఘాటుగా హెచ్చరించింది. ఇదే సమయంలో ఈ వక్ఫ్‌ బిల్లు సవరణ ద్వారా, వక్ఫ్‌ అక్రమంగా తనదిగా ప్రకటించిన ఈ అమాయక ప్రజల భూములను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని భాజపాను ఈ సంపాకీయం విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో బిల్లు ఆమోదం కేవలం బాధితులకు న్యాయం అందించడానికి తప్ప, రాజకీయం కోసం కారాదని కూడా హెచ్చరించింది.

జరుగుతున్న పరిణామాలు కేరళ కాంగ్రెస్‌ క్రైస్తవ ఎంపీల్లో అసంతృప్తిని రాజేస్తున్న మాట వాస్త వం. ముఖ్యంగా క్రైస్తవ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఈ పరిస్థితిని ఎట్లా సర్దుబాటు చేయాలో తెలియక తలపట్టుకు కూర్చున్నారు. కొట్టాయంకు చెందిన కాంగ్రెస్‌ ఎం.పి. జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ ఇప్పుడ తీసుకొచ్చిన సవరణల్లో కొన్ని ఉపయోగకరమే కానీ తుది నిర్ణ యం రాష్ట్రప్రభుత్వం చేతులో వుండటం ఇక్కడ ప్రధాన సమస్య. తుదినిర్ణయం విషయంలో కేం ద్రం ఏమీ చేయలేదన్నారు. అయితే కేరళ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ పి.జె. జెసెఫ్‌ తనయుడు జాన్‌ జోసె ఫ్‌ మాత్రం రాష్ట్రంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం మునాంబం ప్రజలకు న్యాయం చేస్తుందని చెబు తూ బీజేపీ స్వల్పకాలిక వ్యూహాల ద్వారా ముస్లిం మైనారిటీలను నిరాశకు గురిచేయవద్దని కోరా రు. 

కేరళలో వక్ఫ్‌ బాధితులు సగానికి పైగా ముస్లింలే

వక్ఫ్‌బోర్డును చారిత్రకంగా నియంత్రిస్తూ వస్తున్న జమాయత్‌ ఉలేమా ఇ హింద్‌, జమాత్‌ ఎ ఇ స్తామీ వంటి సంస్థలు వక్ఫ్‌ బిల్లు సవరణను వ్యతిరేకిస్తున్నాయి. విచిత్రంగా ముస్లింలలో కూడా చాలామంది వక్ఫ్‌ బోర్డు బాధితులున్నారు. వీరంతా కేరళ కాంగ్రెస్‌ మద్దతుదార్లు. ప్రస్తుతం వీరికి వక్ఫ్‌ బోర్డుతో ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ట్రిబ్యునళ్లలో ప్రస్తుతం 40,951 కేసులు పెండిరగ్‌లో వుండగా వీటిల్లో 9942 కేసులు ముస్లిం వర్గాలకు చెందినవే. ఇక కేరళ విషయానికి వస్తే ప్రస్తుతం 1008 వక్ఫ్‌ ఆస్తుల వివాదాలు కొనసాగుతుండగా వీటిల్లో 551 కేవలం ముస్లింవర్గాలకు చెందినవి కాగా కేవలం 457 కేసులు మాత్రమే ముస్లిమేతరులవి. వీరంతా బాధితులు కనుక వక్ఫ్‌ చట్టాలను వ్యతిరేకించడం సహజం. వీరు వక్ఫ్‌ ట్రిబ్యునళ్ల కంటే సివిల్‌ కోర్టుల్లోనే తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గం ప్రజలంతా వక్ఫ్‌బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌, సీపీఎంలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహంతో క్రైస్తవులతో పాటు, వక్ఫ్‌బోర్డు బాధిత ముస్లిం వర్గాల ఓట్లను ఈ రెండు పార్టీ లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిరది. వక్ఫ్‌ బిల్లును సమర్థించాలని కోరిన తన విజ్ఞప్తిని ఖాతరు చేయని కాంగ్రెస్‌పై కేఎస్‌బీసీ తీవ్ర ఆగ్రహంతో వుంది. మొత్తంమీద చెప్పాలంటే వక్ఫ్‌బిల్లు ఆమో దం పొందడంతో కేరళ రాజకీయాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ పరిస్థితి కుడితో పడ్డ ఎలుక చందంగా మారిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!