బాబాలు కాదు…బద్మాష్‌ గాళ్లు!

https://epaper.netidhatri.com/view/314/netidhathri-e-paper-8th-july-2024%09

స్వాములు కాదు సన్నాసులు.

-ఆధ్యాత్మిక ముసుగులో కొందరు బాబాల తిక్క వేశాలు.

-కొత్త బాబా వచ్చిండంటే చాలు పరుగెత్తుతారు వెర్రి జనాలు.

-బాబాల పాద దూళి కోసం పాకులాటలా…

-సిగరెట్‌ కాల్చితే వచ్చే బూడిద కోసం పడిగాపులా…

-సన్యాసి చింతనలో సన్నాసి వేశాలా!

-బాబాలు ఎక్కడ పడితే అక్కడ తడిమితే ఆరోగ్యమా!

-మహిళల మీద నుంచి నడిస్తే పిల్లలు పుడతారా!

-స్వామీజీలు తినగా మిగిలిన ఎంగిలే మహా ప్రసాదమా!

-ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలు చేస్తున్నారు.

-బాబాలుగా మారి అత్యాచారాలు చేస్తున్నారు.

-దైవ దూతల ముసుగులో దుర్మార్గాలు చేస్తున్నారు.

-దేవుడు కనిపించాడని లేనిపోనివి చెప్పి మోసాలు చేస్తున్నారు.

-అలాంటి దొంగ స్వాములే ప్రజాదరణ పొందుతున్నారు.

-దొంగ బాబాలను నమ్మి నాయకులు పరుగెత్తున్నారు.

-వారి ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు.

-కనికట్టు విద్యలు చూసి చలించిపోతారు.

-అబ్రకదబ్ర వేశాలు నిజం కాదని తెలినా గుడ్డిగా నమ్మేస్తారు.

-కాల మహిమను నమ్మరు…కష్టపడి బతకాలనుకోరు.

-బాబాలను నమ్మి బాగుపడాలనుకుంటారు.

-ఎంత మంది మోసపోతున్న మూఢ నమ్మకాలు విడిచిపెట్టరు.

-జనం బలహీనతలే బాబాలకు పెట్టుబడి.

-దేవుని పేరు చెప్పి హుండీలు పెట్టి నిలువు దోపిడీ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొందరు బాబాలుగా చెలామణి అయ్యే వాళ్లు చెప్పేవి మాయ మాటలు. కట్టు కథలు. పచ్చి అబద్దాలు. పిచ్చి వాళ్ల చేష్టలు. వాళ్ల నోటి నుంచి వెలువడే మాటల్లో నిజాలుండవు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు బాబాలు కాదు. బూటకపు దొంగలు. అలా అని అందరూ కాదు. కొందరున్నారు. ఆధ్యాత్మికను జనావళిలోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేస్తుంటారు. వారిలో మానవత్వాన్ని నిద్రలేపుతుంటారు. మానవసేవే మాధవ సేవ అన్నది చెబుతుంటారు. అలాంటి మంచి మాటలు చెప్పేవారు కొందరే… నీతులు వల్లించినట్లే వల్లిస్తూ, అమాయక జనాలను మోసం చేస్తున్నారు. తెలిసి, తెలిసి నేరాలు చేస్తున్నారు. కాకపోతే మతాలు ఏమైనా వాటి ముసుగులో ఘోరాలు చేస్తున్నారు. ఇలా బాబాల అవతరాలు ఎత్తిన వారు ఒక్క హిందువుల్లోనే కాదు. అన్ని మతాల్లో వున్నారు. వారి పబ్బం గుడుపుకుంటున్నారు. జనాల బలహీనతలో ఆడుకుంటున్నారు. వాళ్లు వేసే తిక్క వేషాలనే నిజాలు అనుకొని నమ్మే వాళ్లు ఎక్కువయ్యారు. ప్రజల కష్టాలే బాబాలకు పెట్టుబడి. ప్రజల బలహీనతలే వారికి రాబడి. పూటకు గతిలేకపోయినా, కష్టాలు తీరుతాయని అప్పులు చేసి మోస పోవడం పేదలకు అలవాటు. పేద వారి కష్టాలు తీర్చి, సంపన్నులను చేస్తామని చెప్పి వారి రక్తం తాగడం బాబాలకు అలవాటు. అసలు బాబాల దర్శనమే దుర్లభం. వారి దర్శనభాగ్యం కోసం వేల రూపాయలు ఖర్చు. వారి ఆశీస్సులు పొందాలంటే ఖర్చు. ఇలా ప్రజల మేలుకోరినట్లు నటించేవారు బాబాలౌతున్నారు. సంపన్నులౌతున్నారు. విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు. జీవితాన్ని పూల పానుపు చేసుకుంటున్నారు. ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నారు. మనలాగా పుట్టన ఒక వ్యక్తి గొప్ప వారయ్యారంటే సమాజానికి ఎంతో ఉపకారం చేసిన వాళ్లై వుండాలి.

మనం ప్రాణాలు కాపాడే వైద్యుడికి నమస్కారం చేయం.

కాని ఆ పక్కనే కాషాయం వేసుకున్న వ్యక్తి వెళ్తున్నాడంటే దండం పెడతాం. ఇదే మనలో వున్న దౌర్భాగ్యం. కొత్త బాబాలు పుట్టుకొస్తూనే వుంటారు. కాని పేదల కష్టాలు అక్కడే వుంటాయి. కొత్త బాబా వచ్చిండంటే చాలు…పరుగెత్తుకుంటూ వెళ్తారు. కష్టాలు తీరాలని కోరుకుంటారు. అసలు బాబాల పాద దూళి కోసం ప్రజలు పాకులాడడం ఏమిటి? వారి పాద దూళికి అంత విలువుంటుందా? బోలే బాబా పాద దూళి కోట్లు కురిపిస్తుందా? ఎలా రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా ఇంట్లోకి వచ్చి వాలుతాయా? ఇక్కడ బాబాల అవతారంలో పురుషులే కాదు, మహిళలు కూడా తయారయ్యారు. వారు కూడా సాధుసంతువులౌతున్నారు. చుట్టూ వేల మందిలో ఓ మహిళ సిగరెట్లు పట్టుకొని కాల్లడమేమిటి? ఆ బూడిత కోసం జనాలు ఎగబడడం ఏమిటి? ఇదంతా జనం పిచ్చి కాకపోతే ఏమిటి? సిగరెట్‌ కాలిస్తే లంగ్స్‌ చెడపోతాయి. క్యాన్సర్‌ వస్తుంది. అని అవి తయారు చేసే కంపనీలే పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. అలాంటి వ్యసనాల జోలికి వెళ్లొద్దు. ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఆరోగ్యమే మహా భాగ్యమని చెప్పాల్సిన వాళ్లు, భక్తుల మందు సిగరెట్లు తాగమేమిటి? ఆ బూడిదను ప్రసాదంగా ఇవ్వడమేమిటి? ఆ బూడిద నుదిట మీద రద్దుకుంటే కష్టాలు పోవడమేమిటి? జనాలను ఇలా వెర్రివాళ్లును చేస్తూ వుంటే, పోలీసు యంత్రాంగం వారికి బందో బస్తు కల్పించడం ఏమిటి? ప్రభుత్వాలు ప్రోత్సహించడమేమిటి? మహిళలను కన్న తండ్రి కూడా ఒక వయసు దాటితే తన కూతురను పట్టుకోవాలన్నా, ముట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు. బిడ్డను దీవించే సందర్భంలోతప్ప ఏ తండ్రి తన కూతురును దగ్గరకు తీసుకోడు. అలాంటిది బాబాల ముసుగులో వున్నవారు మహిళలను ఎక్కడ పడితే అక్కడ తాకొచ్చా? ఆ హక్కు ఎవరిచ్చారు? ప్రజల వెర్రితనం వారికి వరంగా మారుతోంది.

మహిళలను బాబాలు, స్వాములు ఎక్కడ తడమినా తప్పులేదా?

అలా బాబాలు ముట్టుకుంటే రోగాలు నమమౌతాయా? సంతాన బాగ్యం కలుగుతుందా? ఇదెక్కడి విచిత్రమా..జనం మూర్ఖత్వమా అర్ధం కావడం లేదు. ఏదో గుడిలో మహిళలంతా వరుసగా పడుకొని వుంటే, స్వామీజీ వేషంలో వున్న వాడు వారి మీద నుంచి నడుచుకుంటూ వెళ్లడమా? అలా వాడు వెళ్తే వారికి పిల్లలు పుడతారా? ఇంకా కొన్ని విచిత్రాలు చూస్తే మతి పోవాల్సిందే. నెత్తినిండా జులపాలు, మీసాలు గడ్డం పెంచుకొని స్వామీజీల అవతారం ఎత్తి, వాడు తిన్న ఎంగిలిలో ఒక్క మెతుకు దొరికినా చాలన్నట్లు జనం కొట్టుకోవడం ఏమిటి? ఆ ఎంగిలి దొరకమడే మహా భాగ్యమనుకోవడం ఏమిటి? ఆ మెతుకులను కళ్లకు అద్దుకొని జనం తినడమేమిటి? ఇంట్లో కుటుంబ సభ్యుల ఎంగిలి గ్లాసు ముట్టుకోవడానికే ఇష్టపడరు. ఎవడో మూర్ఖుడి నోట్లో నుంచి రాలిపడిన మెతుకులను మహాప్రసాదమనుకుంటున్నారు. ఇక ఆత్యాధ్మిక ముసుగులో బాబాలుగా, స్వామీజీలుగా, ఫాస్టర్లుగా మారిన వారు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వారికి ఆశ్రమాలు. వందలాది ఎకరాల భూములు. విలాసవంతమైన జీవితాలు గడుతున్నారు. విపరీతం తలకెక్కి అరాచాకాలు సృష్టిస్తున్నారు. ఆగపిల్లలను మీద అగాయిత్యాలు చేస్తున్నారు. ఆడ పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారు. వారి జీవితాలు చిదిమేస్తున్నారు. అయినా జనం వారి వెంట పరుగులు పెడుతున్నారు. అసలు మనుషులకు దేవుడు కనిపించడమేమిటి? అలా అయితే అందరికీ కనిపించాలి. అందుకే గుళ్లూ గోపురాలు వున్నాయి. అక్కడ మొరపెట్టుకోండి. కాని నోరు తెరిస్తే అబద్దాలు చెప్పే వారు స్వామీజీలుగా అవతారమెత్తితే జనాలు విశ్వసించడమేమిటి? వారు దేవుణ్ణి చూశామంటే మనం నమ్మడమేమిటి? వారి ఆశీస్సులకోసం ఆరాటపడమేమిటి? నిజానికి స్వామీజీలు అని చెప్పుకునేవారు మానసిక రోగులు. వారికి దేవుడు కలలో కనిపిస్తే అంతకన్నా భాగ్యం మరొకటి లేదు. సహజంగా ఎవరైనా ఏం కోరుకుంటారు? బతికితే కష్టాలు లేకుండా బతకాలనుకుంటారు. పోతే స్వర్గం వెళ్లాలని కోరుకుంటారు. మరి దేవుడు కనిపించిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్లమని కోరుకోకుండా, స్వాములు కావడమేమిటి?

పుట్టిన వారికి మరణం తప్పదు.

మరణించిన వారికి జననం తప్పదు. అందుకే మంచి చేసి పుణ్యలోకం కోరుకోవాలనుకుంటారు. స్వర్గం చేరుకోవానుకుంటారు. ఆ మార్గం కోరుకోకుండా స్వాములు ఈ దొంగ జపాలు చేయడమేమిటి? సాదువుల ముసుగులో మోసం చేయడమేమిటి? నోట్లో నుంచి లింగాలు తీయడమేమిటి? చేతుల్లోనుంచి బూడిదలు రాల్చడేమిటి? అది ఒక రకంగా సైన్స్‌. అదే మెజీషియన్సు చేసే మ్యాజిక్‌. బాబాలకన్నా మెజీషియన్లు వెయ్యి రెట్లు బెటర్‌. ఎందుకంటే వాళ్లు పొట్ట కూటికోసం మ్యాజిక్‌లు చేస్తూ, ప్రజలను రంజింపజేస్తారు. తాము చేసేవన్నీ కనికట్టు విద్యలే అని నిజం కూడ చెబుతారు. మీ కళ్లను మోసం చేస్తూ, మా పొట్ట పోసుకుంటున్నామని ధైర్యంగా చెబుతారు. మెజీషియన్‌ చేసే మ్యాజిక్‌ను చూసి అబద్దమని అనుకుంటాం. కాని అవే స్వాములు చేస్తే అద్భుతమని నమ్ముతాం. స్వాములను దైవాంససంబూతులుగా కొలుస్తాం. ఒక మెజీషియన్‌ కూడా కడుపులోని లింగాన్ని తీస్తాడు. కాని ఎప్పుడూ మెజీషియన్‌ తాను గొప్పవాడినని చెప్పుకోడు. కోటి విద్యలు కూటి కోసమే అంటాడు. కాని స్వాములు అవే అబ్రకదబ్ర వేషాలు వేసి, ప్రజలు మోసం చేస్తున్నారు. నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రజలను వంచిస్తున్నారు. నాలుగు మాయా జాల విద్యలు నేర్చుకొని, అభూత కల్పనలు చూపించి, అధ్భుత శక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు గుడ్డిగా వారిని నమ్మి సేవిస్తున్నారు.

ప్రజలు ఎప్పుడూ కాల మహిమను నమ్మరు.

కష్టపడి బతకాలనుకోవడం లేదు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కలలుగంటున్నారు. బాబాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీవితంలో ఎదిగిన వారెవర్వరూ రాత్రికి రాత్రి వెలుగులోకి రాలేదు. ఎన్నో పగలు రాత్రులు కష్టపడితే గాని విజయాలు దరి చేరవు. అయినా బాబాలను నమ్మి బాగు పడాలనుకుంటారు. వారికి సేవలు చేసుకొని వెలిగిపోవాలనుకుంటారు. ఎంత మంది మోసపోతున్నా ప్రజలు మూఢ నమ్మకాలను విడిపెట్టడం లేదు. బాబాలకు మొక్కకుండా వుండలేకపోతున్నారు. మనం మోసపోవడం అలవాటు చేసుకున్నాం. స్వాములు , బాబాలు మోసాలు చేయడం అలవాటు చేసుకున్నారు. అందుకే బాబాలకు మనం మొక్కుతున్నాం. వాళ్లు మొక్కించుకుంటున్నారు. జనం చేత దేవుళ్లనిపించుకుంటున్నారు. మనల్ని పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారు. నిజంగా పిచ్చి చేష్టలు చేసేవారిని, మనం పిచ్చిగా నమ్మడమే మన పిచ్చితనం. ఆ పిచ్చే స్వాములకు వరం. మనకు శాపం. ఎక్కడో లేదు నరకం…ఎండమావుల వెంట పరుగెత్తితే మిగిలేది శూన్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *