జిల్లాలో మండనున్న ఎండలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

జిల్లాలో మండనున్న ఎండలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
శ్రీరాంపూర్: నేటిధాత్రి

మంచిర్యాల జిల్లాతో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మేడ్చల్, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో రానున్న రోజుల్లో ఈనెల 29 వరకు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరే ప్రమాదం ఉందని పేర్కొంది.ఇప్పటికే శ్రీరాంపూర్ ప్రాంతంలో గత రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బొగ్గు గనుల ప్రభావంతో వేడిగా ఉండే ఈ ప్రాంతంలో రానున్న వారం రోజుల పాటు భానుడు మరింత ప్రతాపం చూపనున్నాడని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, సింగరేణి ఏరియా, ప్రతి వార్డులో తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పారిశుధ్య కార్మికులు ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, టోపీ, గొడుగు వినియోగించడం, తరచూ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తీసుకోవాలని సూచించారు.ఉపాధి హామీ, భవన నిర్మాణ పనులను ఉదయం 7 గంటల నుంచి 10:30 గంటల లోపే ముగించాలని తెలిపారు. తీవ్ర తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితుడిని నీడలోకి తీసుకెళ్లి తడి గుడ్డతో శరీరం తుడిచి సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.ఈ నెల 29 వరకు వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version