ఎంఈఓ జాడి పోచయ్య…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రుపొందించిన బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభమైంది .అందులో భాగంగానే క్యాతనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని మందమర్రి మండల ఎంఈఓ జాడి పోచయ్య, మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ లు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆర్పీలు, అవగాహన ర్యాలీని నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, డిజిటల్ స్మార్ట్ బోర్డ్ , నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని వారు తల్లిదండ్రులకు వివరిస్తు ర్యాలి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ పోచయ్య, కమిషనర్ మురళీకృష్ణ లు మాట్లాడుతూ…. చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే బడి బాట ప్రథమ ఎజెండా అని అన్నారు.బడి ఈడు ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించిన నేపథ్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. బడి వయసు పిల్లలను గుర్తించి దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.