అసలైన హీరోలు నిర్మాతలే!

-తెరమీద హీరోలు నిర్మాతల ముందు జీరోలే!

-హీరోల మార్కెట్‌ నిర్మాతల బిక్ష!

-నిర్మాతల బిక్ష మీద బతికేదే హీరోలు!

-నిర్మాతలు లేకుంటే హీరోలంతా జీరోలు!

-నటులతో సినిమాలు దివాలా తీసిన నిర్మాతలు కోకొల్లలు!

-నిర్మాతలిచ్చిన జీతమెక్కువై బలుపెక్కిన వాళ్లు హీరోలు!

-నిర్మాతలంతా ఒక్క సారి చేతులెత్తేస్తే హీరోల బతుకులు బజారు పాలు.

-మీరేమైనా డెమీ గాడ్సా?

-టికెట్ల రేట్ల పెంపు కోసం నిర్మాతలు నిలబడాలా?

-ప్రభుత్వాల ముందు నిర్మాతలే సాగిలపడాలా?

-టిక్కెట్‌ రేట్లు పెంచమని నిర్మాతలొస్తే చాలా?

-హీరోలు ఇంట్లో కూర్చుంటే నిర్మాతలు పాలకుల ముందు మోకరిల్లాలా?

-నిర్మాత లేనిదే సినిమా లేదు.

-సినిమా బతుకుతోందంటేనే నిర్మాత వల్ల

-నిర్మాత లేనిదే పరిశ్రమే లేదు.

-హీరోలను తయారు చేసేదే నిర్మాత!

-సినిమా నిలబడాలంటే ఆస్థులు అమ్ముకునేది నిర్మాత!

-అప్పులు చేసి, అన్నీ కుదువబెట్టుకునేది నిర్మాత!

-హీరోలకు మార్కెట్‌ ఏర్పాటు చేసేదే నిర్మాత!

-నిర్మాతలది పెట్డే చేయి!

-హీరోలది అడుక్కునే చేయి!

-అడుక్కు తినే హీరో బతుకులకు అరుపులెందుకు?

-నటులను హీరోలను చేసేదే నిర్మాతలు.

-నటులను నమ్మి నాలుగు రూపాయలు పెట్టేదే నిర్మాత.

-నిర్మాత లేనిదే సినిమా లేదు.

-ఆ సినిమాలలో హీరోలు లేరు.

-అహంకారం తలకెక్కి నిర్మాతలు మా వల్లే బతుకుతున్నారనుకుంటున్నారు.

-నిర్మాతలు కుర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు కింద కూర్చునే వారు.

-ఇప్పుడు నిర్మాతలను హీరోలు బానిసలుగా చూస్తున్నారు.

-డబ్బు ఖర్చు చేసే నిర్మాతలంటే అంత లోకువా?

-పాలకులంటే, ప్రభుత్వాలంటే సినిమా హీరోలకు వాళ్లకు చులకనా?

-సినిమా హీరోలు సమాజానికి అతీతులా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సినీ కళ బతకాలన్నా, సినిమా తెరమీదకెక్కాలన్నా, సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు రావాలన్నా ముఖ్యం..మూలం నిర్మాత. నిర్మాత లేకుండా సినీ పరిశ్రమే లేదు. ఎంత మంది దర్శకులున్నా, ఎంత మంది హీరోలున్నా వారిని నమ్మి పెట్టుబడి పెట్టి సినిమా తీయాలంటే నిర్మాత కావాలి. సినిమాకు మొదటి రీల్‌ నుంచి చివరి రీల్‌ వరకు నిర్మాత పడే కష్టం ముందు ఎవరిదీ ఎక్కువ కాదు. కళాకారుల కల నెరవేరాన్నా, వారి బతుకులు వెలగాలన్నా నిర్మాతలుకావాలి. కళకారుల కళ వెలుగులోకి రావాలంటే నిర్మాతల ప్రోత్సాహం వుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలు లేనిదే కళ లేదు. హీరోల కలలకు దిక్కులేదు. అసలు సినీ ప్రపంచమే లేదు. సినీ లోకానికి తావే లేదు. ఒకప్పుడు సినిమా అన్నది కళల ప్రపంచం. ఇప్పుడు అది కాసుల ప్రపంచమైంది. వినోదం వ్యాపారమైంది. కళ కాసుల వేటలో పరుగులు పెడుతోంది. రంగుల ప్రపంచం ఊహల పల్లకిలో ఊరేగుతోంది. హీరోలకు సోకుల సామ్రాజ్యమైంది. కోట్ల సంపాదనకు నిర్మాతల త్యాగం హీరోలకు ఊపిరైంది. వారి వేడుకులకు వేదికైంది. హీరో అడుగు బైట పెట్టడం నుంచి మొదలు, సకలం, సర్వం నిర్మాత దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే బతుకుతాడు. కాని నిర్మాతలే తమ వల్ల బతుకుతున్నారన్నంత అహం హీరోల్లో పెరిగిపోయింది. హీరోలు అవకాశమిస్తే గాని నిర్మాత లేదన్నంత దుర్మార్గం నిండిపోయింది. సినిమాకు మూలం నిర్మాత అన్నది మర్చిపోతున్నారు. నిర్మాతలను హీరోలు అనే వారి కళ్లకు పట్టిన మబ్బులు కమ్మేస్తున్నాయి. సెట్‌లో నిర్మాతలుంటే నటించమని అంటున్న హీరోలు కూడా వుంటున్నారు. కళ్లకు పొరలొచ్చి కొట్టుకుంటున్నారు. నిర్మాతల విలువ ఆవిరైంది. ఒక నిర్మాత ఎదగడానికి పడే కష్టంలో హీరో పాత్ర చాలా చిన్నది. కాని హీరోలే నిర్మాతలను బతికిస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారు.

నిజం ఎప్పుడూ నిష్టూరంగానే వుంటుంది. నిజాల్ని జీర్ణించుకోలేని హీరోలకు ఆ నిజం మింగుడు పడకుండా వుంటుంది. గొంతులో పచ్చి వెలక్కాయలాగా చిక్కుకుంటుంది. ఎందుకంటే సినీ లోకానికి అసలైన హీరోలు నిర్మాతలు. సంపాదించిన సొమ్మును ఒక సినిమా కోసం ఆవిరి చేసేందుకు ధైర్యం చేసే అసలైన హీరోలు. కోట్లు ఖుర్చు పెట్టి సినిమా తీస్తే అది ఆడుతుందా? లేదా? అన్నది దైవాదీనం. అందులో పెద్ద హీరో వున్నాడా? చిన్న హీరో వున్నాడా? అన్నది ముఖ్యం కాదు. సినిమాకు అసలైన హీరో కథ. ఆ కథ సరిగ్గా లేకుంటే నిండా మునిగేది నిర్మాత. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా నష్టపోయేది నిర్మాత. అంతే కాని ఒక సినిమా ఆడకపోతే హీరోకు వచ్చిన నష్టమేమీ వుండదు. కాని ఒక్క సినిమా పోతే మరో సినిమా తీయాలంటే నిర్మాత పడే నరకయాతన అంతా ఇంతా కాదు. అలాంటి నిర్మాతలకు ఇప్పుడు విలువ లేకుండాపోయింది. హీరోల మందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఒకప్పుడు నిర్మాతలదే పై చేయి. ఆ తర్వాత దర్శకులు చెప్పిందే వేదంగా వుండేది. కాని ఇప్పుడు హీరోలే దర్శకులౌతున్నారు. గాయకులౌతున్నారు. పాటలు రాస్తున్నారు. సకల కళా పోషణ చేస్తున్నారు. నిర్మాతలను నిండా ముంచేస్తున్నారు. నిర్మాతల పాలిల శాపాలౌతున్నారు. ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలౌతుంటాయి. అందులో విజయం సాధించేది కేవలం పది సినిమాలు మాత్రమే వుంటాయి. ఆ హిట్‌ అయిన సినిమాల్లో పెద్ద హీరో సినిమాలు వుండాలని కూడా ఏమీ లేదు. ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత చిన్న సినిమా తీసినా కథ బాగుంటే, కథనం బాగుంటే అన్నీ సర్ధుకుంటాయి. కాని ఇప్పుడు సినిమాను ఎలివేట్‌ చేయాలన్న ఆలోచనతో, హారోయిజం ఎక్కువగా చూపించాలన్న ఆలోచనతో గ్రాఫిక్స్‌ను దించేసి, నిర్మాతలను నలిపేస్తున్నారు. సినిమాలు తీయాలంటే భయపడేలా చేస్తున్నారు. అలా హీరోల మూలంగా వారి సినిమాల మూలంగా అడ్రస్‌ లేకుండా పోయిన వారు ఎంతో మంది వున్నారు.

తెరమీద కనిపించే హీరోలు ఎప్పుడూ నిర్మాతల ముందు జీరోలే. హీరోల మార్కెట్‌ కూడా నిర్మాతలు పెట్టిన బిక్షే. హీరోలు సినిమా సినిమాకు మార్కెట్‌ పెంచేస్తుంటారు. ఒక్క సినిమా హిట్‌ అయితే రెమ్యునరేషన్‌ భారీగా పెంచుకుంటారు. కాని సినిమా ఫ్లాఫ్‌ అయితే మాత్రం మాకేం సంబంధం అని చేతులు దులుపుకుంటారు. అలా హీరోలను చేసి, వారికి మార్కెట్‌ పెంచి, వారి చేత సినిమాలు తీయాలంటే మళ్లీ నిర్మాతలు చేతులు కట్టుకొని హీరోల మందు నిలబడాలి. ఇది సినీ రంగానికే సిగ్గు చేటు. నిర్మాతల దయాదాక్షిణ్యాల మీద బతికే హీరోలు, అదే నిర్మాతలను చుక్కలు చూపిస్తున్న రోజులు. అసలు నిర్మాత అనే వ్యక్తి లేకుంటే హీరో అనే పాత్రే లేదు. వారి బతుకులకు అర్ధమే లేదు. హీరోలను నమ్మి, కోట్లు ఖర్చు చేసి, ఆ సినిమాలు ఆడక దివాలా తీసిన నిర్మాతలు కోకొల్లలున్నారు. కాని హీరోలు మాత్రం వెలుగుతూనే వున్నారు. నిర్మాతలు కొవ్వొత్తిలా కరిగిపోతూ, కాలి పోతున్నారు. అలా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లే కాదు, ఎన్టీఆర్‌, ఎన్‌ఆర్‌ల కాలంలో కూడా ఆవిరైన నిర్మాతలు ఎంతో మంది వున్నారు. కాకపోతే ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ కాలంలో నిర్మాతే అసలైన హీరోలు. ఒకప్పుడు నిర్మాతలు కుర్చీలలో కూర్చుంటే ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌లు కింద కూర్చున్న సందర్బాలు అనేకం వున్నాయి. ఇప్పుడు నిర్మాత హీరోల కాళ్లదగ్గర కూర్చోవాల్సిన పరిస్దితికి తెచ్చారు. తాజగా ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఓ వ్యాఖ్య నిర్మాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వుందని టాక్‌ వినిపిస్తోంది. సినిమా రేట్లు పెంచుకోవాలనుకున్నప్పుడు హీరోలో రావాల్సిన అవసరం లేదు. నిర్మాతలు వస్తే చాలంటూ ఓ పవన్‌ కళ్యాణ్‌ ఓ కితాబిచ్చారు. అంటే సినిమా విషయంలో హీరోల ప్రమేయం వుండొద్దా? సినిమా విషయంలో అన్నింట్లో హీరోలు వేలు పెడతారు. సినిమా కథ దగ్గర నుంచి మొదలు, దర్శకులు చెప్పింది చేయక, ఆచార్య పని గోవిందా? ఎలా అయ్యిందో అందరూ చూసిందే. ఆ సినిమాకు రెమ్యునరేషన్‌ హీరోలకు అందింది. నిర్మాతకు కోట్లలో లాస్‌ వచ్చింది. సినిమా అనేది కూడా ఇప్పుడు లాస్‌ అండ్‌ ప్రాఫిట్‌ వ్యాపారమైపోయింది. అలాంటప్పుడు నిర్మాతలే ఎందుకు నష్టపోవాలి.

ఒక్కసారి నిర్మాతలంతా చేతులెత్తేస్తే ఏమైతుందో హీరోలు గుర్తు చేసుకోండి. హీరోలేమైనా సెమీ గాడ్సా? సినిమాకు నిర్మాతలే పెట్టుబడి పెట్టి, సినిమాను ఆడిరచడం కోసం నిర్మాతలే కష్టపడితే హీరోలెందుకు? సినిమా కోసం హీరోల మందు సాగిలపడి, దాన్ని ఆడిరచుకునేందుకు ప్రభుత్వాల ముందు నిలబడి, కోట్లు పారేసి,చిల్లర ఏరుకునే దుస్ధితికి నిర్మాతకు ఎందుకు రావాలి? హీరోలు ఇంట్లో కూర్చుంటే, నిర్మాతలు పాలకుల ముందు మోకరిల్లాలా? అందువల్ల ఇప్పటికైనా హీరోల తీరు మారాలి. అది ఎంత పెద్ద హీరో అయిన వారి ఆలోచనలు మారాలి. నిర్మాత లేనిదే సినిమా లేదు. వాళ్లు లేకుండా హీరోలు తయారయ్యే పరిస్ధితే లేదు. సినిమా అంటే ఒకప్పుడు వంద రోజులు, రజతోత్సవాలు, మూడు వందల రోజులు అని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే..అయితే రెండు రోజులు లేకుంటే మూడు రోజులు. మహా అయితే వారం రోజులు. ఇంతకు మించి ఒక్క రోజు కూడా సినిమాలు ఆడని దిక్కుమాలిన రోజులు. అయినా హీరోలను పెట్టి సినిమాలు తీస్తున్నారంటే నిర్మాతల గొప్ప గుణం. గొప్ప దనం. నిర్మాత లేకుండా పరిశ్రమే లేదు. సినిమా కోసం అప్పులు చేసి, ఆస్ధులు తాకట్టు పెట్టి మరీ సినిమా తీస్తాడు. లాభాలు రాకున్నా పెట్టుబడి వస్తే చాలనుకుంటాడు. కాని హీరోలు లాభాలొస్తే మరిన్ని వాటాల కోసం ఆశపడతారు. నిర్మాతల బిక్ష కోసం ఎదురుచూస్తారు. నిర్మాతలది ఎప్పుడూ పెట్టే చేయే…హీరోలది ఎప్పుడూ అడుక్కునే చేయే…అడుక్కు తినే హారోల బతుకులకు అరుపులెందుకు? నిర్మాతల మీద పెత్తనాలెందుకు? నాలుగు సినిమాలు పోతే అడ్రస్‌ లేకుండా పోతారు. నిర్మాతల జీవితాలను ఆగం చేసి బతుకెళ్లదీసుకుంటారు. అందుకే సినిమాలో మళ్లీ నిర్మాతల రాజ్యం వస్తే తప్ప హీరోల అడ్డూఅదుపులకు కళ్లెం వుండదు. నిర్మాతలు చేతులెత్తేస్తే గాని పగటి కలల హారోల బతుకులు తారుమారు కావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!