
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
ఎంపీగా ఒక అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా..
-పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి నేడు సూట్ కేసులకు అమ్ముడుపోయి ఇతర పార్టీలలో చేరే నేతలతో మనకు పనిలేదని, పార్టీకి నష్టం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలే తప్ప ప్రజలకు నాయకులు చేసింది ఏమీ లేదనిఅన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లు మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా సరే పథకాలు అమలు కావడం లేదని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని, ప్రజలంతా మళ్ళీ కేసిఆర్ పరిపాలననే కోరుకుంటున్నారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కోట్లు ఉన్న వ్యక్తికి కార్మిక వ్యక్తికి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. వివేక్ ది కుటుంబ పాలన కాదా అని దుయ్యబట్టారు. కోట్లు పెట్టి ఎంపీ టికెట్ కొనుక్కున్నారని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఒక్క అవకాశం కల్పించాలని కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంభగౌని సుదర్శన్ గౌడ్, డాక్టర్ రాజా రమేష్, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.